అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗
- Author: Bhimeswara Challa
Book online «అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗». Author Bhimeswara Challa
సనల్ “కాని యింత కన్నీరు ఎక్కడ దాగింది కమలా? కన్నీటి కర్తవ్వమేమిటి” అన్నాడు.
“సప్తసముద్రాల లోతును కొలచవచ్చు సనల్ బాబూ కాని కన్నీటిలోతుని కొలచటం అసాధ్యం” అంది కమల.
రజని అంత వరకు మౌనంగా వుండిపోయింది. ఈసారిమీరెండవ ప్రశ్నకి సమాధానం కమల చెప్పలేదు. “కన్నీరు విశాలకి నిష్కృతి సునల్ బాబూ”
“అయితే కన్నీరును నువ్వెందుకుగర్హిస్తావు కమలా?’
“గర్హించనుకాని ఎందుకో నాకీ నిష్కృతి లేదు” అంది కమల.
విశాల సంతోషాన్ని పట్టలేక కళ్లుమూసుకుని వుంది. సనల్ విశాల ప్రక్కను కూర్చుని విశాలా - అని పిలచాడు- విశాల కళ్లువిప్పి మందహాసం చేసి, సనల్ కన్నీరు తుడచి, “ఇక దీని అవసరం లేదు సనల్ బాబూ” అంది.
విశాల సనల్ విశ్రాంతి కోసమని, కాశ్మీరు ప్రయాణమయ్యారు. ఇద్దరూ అలసివున్నారు. విశాల భయంకరమైన వొక యుద్దంలోంచి బయటపడింది. విజయం లభించింది. కాని ప్రయాణంతో అలసిపోయింది, సనల్ ఆవేదనతోటి, ఆతురతతోటి పూర్తిగా అలసిపోయాడు. అది కాక వివాహమయిననాటి నుంచి నూతన దాంపత్యపు సుఖం వారొక్కరోజుకూడాఅనుభవించలేదు. సనల్ తన భాద్యతలన్నిటిని తనతోటి డాక్టర్లకప్పగించి బయలు దేరాడు. విశాల అందరిని తనతో రమ్మని ఆహ్వానించింది. అందరు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. విశాల రజనిని మాత్రం రమ్మనమని పట్టుపట్టింది. మా అందరిలోకి శాంతి నీకు ఎక్కువ రజనీ యంత్రంలాగ రాత్రింబగళ్లు చాలా కాలంబట్టి పని చేస్తున్నావు. నువ్వనకపోయినా నీ శరీరం మానవ మాత్రమేచల్లటి, మనోరంజకమైన ఆ వాతావరణంలో శరీరానికి విశ్రాంతి, మనస్సుకి శాంతి లభిస్తాయి, ప్రకృతి సౌందర్వంలో వంటరితనమనే అవాంతరం కూడా తప్పుతుంది అంది.
విశాల మాటలు, రజనిలో అణచి పడిన అలసటని లేవతీసింది. నిజంగా ఆమెకు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇంతకు ముందు రెండుసార్లు ఢిల్లీ వదలి వెళ్లిపోయే సమయంలో రామం చేసిన రభస జ్ఞప్తికి వచ్చింది. ఆ సమయంలో రామం అక్కడే వున్నాడు. ఒకసారి అతని వైపు చూసింది. ముఖం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు. దీని అర్ధం ఆమె గ్రహించింది. మొట్టమొదటసారిగా రామంపై కొంచెం కోపంకూడా వచ్చింది.
“నాకు విశ్రాంతి అవసరమనే విషయం నువ్వు మాత్రమే గుర్తించగలిగావు విశాలా.ఆ బాధ్యత వున్న వాళ్లు పెడముఖంపెట్టుకు కూర్చున్నారు. అయినా రాలేను విశాలా మంచి వుద్యోగం దొరికింది. ఈసారి వదలుకుంటే ఇక బిచ్చమెత్తుకోవాలి. ఈ రోజులలో అందమైన ఆడవాళ్లకు బిచ్చం పెట్టె అన్నదాతలు కూడా కరవయిపోతున్నారు” అంది.
రామం యింకా ఏమి మాట్లాడలేదు. ముఖం కాస్త ఎర్రబడింది. విశాల సంగతి గ్రహించింది. ఒకసారి దీర్ఘంగా నిటూర్చి “నీకు యిలాంటి మాటలు అనడం ఇష్టం లేదని నాకు తెలుసు రజనీ, కాని నువ్వంటుంటావు. ఆవేశాలనుకుంటాను. జీవితంలో నీకు నేను ఋణపడినంత ఇంకెవరికి ఋణపడలేదు. ఇంకొకటి కూడా చెప్పడం నాధర్మం. నిన్ను అర్ధం చేసుకున్నంతగా యింకెవరు నిన్నింతవరకు అర్ధం చేసుకోలేకపోయారు. నిజమైన నీ విలువను పూర్తిగా గ్రహించిన వ్యక్తులు ఎవరూ లేరు” అంది.
“ఇతరులు విలువలు గ్రహించేమంటే వారి విలువను మీరు మొదట గ్రహించాలి విశాలా! అది లోటయి నప్పుడు మనం ఫిర్యాదు చెయ్యడం అవివేకం” అంది.
విశాలకు వీడ్కోలు చెప్పడానికి, రజనికి వీడ్కోలు చెప్పటానికివచ్చిన వారంతా వచ్చారు. ఈసారి రజని ఫ్లాటుఫారం మీద నిలబడి వుంది. రజని కేవలం విశాల రైలులో వుంది. ఆనాడు రజని వివాహిత యీనాడు విశాల వివాహిత యీరెండు సంఘటనల మధ్య నున్న వ్యవధిలో వ్యక్తుల జీవిత కాలలో ఎన్నో మార్పులు జరిగాయి, అందరు ఫ్లాటుఫారం మీద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం పటాన్ కోట వెళ్ళే ఆ రైలు బయలుదేరడానికి ఇంకొక పదినిమిషాల వ్యవధి వుంది. అందరి ముఖాల్లోను ఒక విధమైన విచారం వ్యక్తమవుతుంది. వారందరిలోను నిజంగా సంతోషంగా వున్నది ప్రసాద్ వొక్కడే. “ఇంకొక నెలరోజుల్లో నేను మిమ్మల్ని శ్రీనగర్ లోనో లేక వేగాములోనో కలుసుకుంటాను విశాల. వంటరిగా రావడం యిష్టం లేదు. ఎవరినో తోడుతీసుకువస్తాను” అని కమల వైపుక్రీగంట చూచాడు.
అతని దృష్టి ఆమెమీద పడి క్షణంముందరే ఆమె దృష్టి మరల్చింది.
“కాశ్మీరులో కేవలం కాలం గడపడానికి చాలామంది వస్తారు ప్రసాద్. కాని అంతకు మించి, అందరి వద్ద నుంచి ఆశించకు,నన్ను తీసుకు వెళ్తావా ప్రసాద్” అని నవ్వింది.
“గర్వంతో అడిగిన ప్రశ్నయినా నేను దానిని గౌరవిస్తున్నాను. ప్రపంచంలో ఎవరయినా నీ తర్వాతే రజనీ! “కాని నువ్వు రావని నాకు తెలుసు ఆరోజులు శాశ్వతంగా గడచిపోయాయి అన్నాడు”.
కమల ఎందుకో ప్రసాద్ మాటలని సహించలేకపోయింది. మౌనంగా కూడా వుండలేకపోయింది. “వ్యక్తుల లాగే వ్యక్తుల విలువలు కూడా చంచలమయినవని మొదటిసారి నువ్వు మాయింటికి వచ్చి నప్పుడన్నావు రజనీ జ్ఞాపక ముందా?” అంది.
కమల అకస్మాత్తుగా అడిగిన ప్రశ్న అందరికి అసందర్భంగా కనబడింది.
రజని మాత్రం అర్థం చేసుకుంది.
“ఎందుకు జ్ఞాపకం లేదు కమలా, నువ్వప్పుడు చాంచల్యం గర్హనీయం కాదా అన్నావు. అది కూడా జ్ఞాపకం వుంది” అంది.
రజని మాటలు విన్న తరువాత ప్రసాద్ కి కమల ఆ ప్రశ్న ఎందుకు వేసిందో అర్థమైంది.
విశాల వీరిమాటలు వింటూనే వుంది. కాని ఆమె దృష్టి రెండుమూడు గజాల దూరంలో వంటరిగా నిలబడి వున్న రామంమీద పడింది. దగ్గరకు వెళ్ళి “రామంబాబు వెళ్ళే లోపల మీతో ఒక మాట చెప్పాలని వుంది. చెప్పమంటారా? అంది.
“చెప్పు విశాలా” అన్నాడు రామం.
విశాల “మీకు పూర్వజన్మపై నమ్మకముందా చెప్పండి? అంది.
విశాల ప్రశ్నవిని రామం ఆశ్చర్యానికి అంతం లేదు. “ఎందుకు విశాలా! అన్నీ వుంటే మనమిద్దరము క్రిందటి జన్మలో కవలపిల్లలమని, నామనస్సు ఈనాడు చెప్తోంది. మన యిద్దరి స్వభావాల్లో ఏకీభవించినంతగా ప్రపంచకంలో ఇంక యేఇతర హృదయాలు సన్నిహితం కాలేదు. ఇది మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు” అంది.
“పూర్తిగా గుర్తించకపోయివుండచ్చు విశాలా, కానీ నా వ్యధకి హృదయానికి మొదటి నుంచీ నేనంటేసానుభూతి సహాయం లభించాయి. అది నేను మరచిపోలేదు ” అన్నాడు.
గార్డ్ ఆకుపచ్చటి దీపం వూపడం మొదలు పెట్టాడు. అది చూచి విశాల కంగారుగా అందరివద్ద చివరిసారిగా వీడ్కోలు తీసుకుని రైలెక్కింది. గంభీరంగా శబ్దం చేసుకుంటూ రైలు ముందుకు సాగిపోయింది.
చాప్టర్ 18
విశాల వెళ్ళిన తర్వాత మూడు వారాలు గడచిపోయాయి. ప్రసాద్ కీ ఈలోపు కమల కమలాకరం నాలుగైదు సార్లు తటస్థపడ్డారు. కాని కమలతో వంటరిగా మాట్లాడడానికి అవకాశం చిక్కలేదు. కాని అతని క్రోధాన్ని ప్రేరేపించిన దేమిటంటే కమల ప్రవర్తనలో ఒక విధమైన మార్పును గుర్తించాడు. అట్లాంటి పరిస్థితులలో అంతకు ముందొక విధమైన వుదాసీనత్వం ప్రదర్శిస్తూ వుండేది. దానిని అతను ఎంతో కష్టం మీద భరిస్తూ వచ్చాడు. కాని కొద్దికాలంనుంచి నిర్లక్ష్యంతో పాటు పరిహారం కూడా ప్రదర్శిస్తూ వచ్చింది. యుద్ధరంగంలో ప్రగల్భాలు పలికి పిరికి పందలై పారిపోయిన వారి యెడల ప్రతి పక్షం ప్రదర్శించే ప్రవర్తనలా వుండేది. పూర్వం ప్రసాద్ కళ్ళలోకి తిన్నగా చూడటానికి ఆమె జంకుతూ వుండేది. ఆతీక్షణతకు తట్టుకోలేక ఆప్పుడప్పుడు ప్రసాద్ దృష్టి మరలించుకోవలసి వచ్చేది. లోలోన ఒక విధమైన భయం కూడా ఏర్పడింది. దానితో పాటు కమల యెడ మమకారం, మమత రాను రాను భరించలేనంత అభివృద్ధి చెందింది. రాత్రింబవళ్లు ఆ రూపమే అతనికళ్ళకుకట్టినట్లు కనబడుతు వుండేది. కమల కంఠస్వరం వినాలనే కాంక్ష హద్దుమీరి ప్రవర్తించేది. భరించలేని యీ బడబాగ్ని దహించి వేసే ద్రావణంలాప్రసాద్ ని ప్రచండునుగా చేసి వేసేంది. శరీరంలోని అణువు అణువు కమల నామాన్నే వుచ్చరించేది. అర్థరాత్రి హఠాత్తుగా లేచి కారు తీసుకుని బయలు దేరేవాడు. ఆ తరువాత నాలుగు ఐదురోజులుదాక కనబడే వాడు కాదు. యిలాంటి ప్రవర్తనకు చంద్రిక అలవాటుపడినా ప్రసాద్ లోని కర్కశత్వమే ఆమెను బాధ పెట్టేది.
చంద్రిక ఒకనాడు కమలతో సంగతాంతా చెప్పింది. కమల విని చాలా బాధపడింది. కారణం కొంతవరకు మాత్రమే గ్రహించగలిగింది. రెండు మూడు నిముషాలు వేదనాపూరిత వదనంతో ఆలోచిస్తూ కూర్చుంది.
“ఇంతలో ఆశ్చర్యపడ వలసినది ఏమి లేకపోయినా విచారించవలసినది చాలావుంది చంద్రికా? ఇదేమి ఈనాటి సమస్య కాదు” అంది.
చంద్రికకు కాస్త కోపం వచ్చింది. “చంద్రిక అనే వ్యక్తి నువ్వు నీయెదుట చూస్తు ఏవగింపుతో ముఖం ప్రక్కకు తిప్పుకోకుండా మాట్లాడుతున్నారంటే అదంతా మామయ్య ప్రతిభే. చంద్రికకు వేరే వ్యక్తిత్వం లేనే లేదు. కమలా ఈ విషయం నువ్వు పూర్తిగా గ్రహించినట్లయితే ఇంత చులకనగా మాట్లాడవు” అంది.
చంద్రిక కంఠ స్వరం కమలను చకితను చేసింది. ప్రసాద్ ఎడ చంద్రికకు వున్న నిశ్చలమైన కృతజ్ఞత , గుడ్డి నమ్మకం, ఆమెకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే వుంటుంది. కాని ఆమెని అప్పుడప్పుడు భయపెట్టే దేమిటంటే ఈ సంపూర్ణ సమర్థన చివరకు ఏరూపంలో పరిణమిస్తుంది? ప్రసాద్ ఆలోచనలు చంద్రికకు తెలిస్తే ఆమె కమలయెడ ఏవిధంగా ప్రవర్తిస్తుంది? కమలవద్ద నుంచి కూడ సమర్పణ ఆశిస్తుందా!
“చులకన చేయడము లేదు చంద్రిక చేసేదేమి కనబడటం లేదంటున్నాను” అంది.
“ఎందుకు లేదు కమల నువ్వంటే మామయ్యకు ఎంత అభిమానమో ఎంత గౌరవమో నాకు తెలుసు నీమాట కాదనడు” అంది.
కమల హృదయం బరువెక్కింది. క్షణకాలం మౌనం వహించి మనస్సు కుదుట పరచుకుని “లేదు చంద్రిక అధికారం నీకు రజనికి మాత్రమే వుంది. అది సంపాదించాలనే ఆశ కూడా నాకు సుతరామూ లేదు. ఇతరులు నాకు వుందని భ్రాంతి పడితే నేను సహించలేను” అంది.
రజని జ్ఞప్తికివచ్చి చంద్రిక ఆమె వద్దకు వెళ్ళింది
“అంత చెప్పి రజనీ ప్రపంచకంలో ఎవరైనా నీ తరువాతనే అని మామయ్య ఒకసారి అన్నాడు. అధికారం బాధ్యత నీ మీద వున్నది రజనీ”
“ఇతరులకి కర్తవ్య బోధన చెయ్యటం నాకు అలవాటు లేదని నీకు తెలుసు చంద్రిక. ప్రసాద్ కు కూడా అది రుచించదు. అయినా ఇది కేవలం ప్రసాద్ కు సంబంధించిన విషయంకాదని నాకనిపిస్తూంది.” అని వెంటనే మాటలు మార్చి“కర్తవ్యం అనే నెపంతో ప్రసాద్ స్వాతంత్రాన్ని అరికట్ట ప్రయత్నించడం అవివేకంకూడాను” అంది.
చంద్రికకు కోపంవచ్చి “కృతజ్ఞతను గుర్తించననే నెపంతో కర్తవ్యాన్ని త్రోసిపుచ్చుతున్నావు రజనీ. కాని చంద్రిక అలాంటిది కాదు” అని బయటకు వెళ్ళిపోయింది.
ఇంటికి తిరిగివచ్చి చంద్రిక పరిపరివిధాల ఆలోచించసాగింది. ప్రసాద్ ను బాధించే కారణం ఆమెకి యెంత వెతికినా ఆమెకి చిక్కలేదు. రజని అన్న ఒక్కమాట ఆమె హృదయంలో పలుమారులు మారుమ్రోగింది.
ఇది కేవలం ప్రసాద్ కి సంబంధించిన విషయం కాదని, నాకు కనిపిస్తూంది. అయితే ఆరెండో వ్యక్తి ఎవరూ? ఎంత ఆలోచించినా ఆమెకు అర్ధం కాలేదు. ప్రసాద్ కి అనేకమంది స్నేహితులున్నారు. అనేక ప్రదేశాలకు వెళుతూ వుంటాడు. అది ఆమెకు ఎప్పుడూ చెప్పడు. అతని జీవితంలో తనస్థానం తగు స్వల్పమైనది. కాని ఆమెకు అతనిని మించిన ఆప్తులు లేరు. ఇక వేరే వ్వకిత్వమే లేదు. ప్రసాద్ ని అడిగి తెలుసుకుంటే తప్పేముంది. అవకాశం మూడు రోజుల తరువాత మాత్రమే ఆమెకు లభించింది. ప్రసాద్ ఆ రాత్రి కాస్త శాంతంగా వున్నాడని ఆమె అనుకుంది, దగ్గరకు వెళ్ళి సూటిగా “మామయ్య మీరు కొంత కాలం నుంచి ఏదో బాధ పడుతున్నట్లున్నారు కారణం నాతో చెప్పరా?” అంది.
“ప్రత్యేకమయిన కారణం ఏమి లేదు. చంద్రికా ఇదేమి కొత్త కాదు” అన్నాడు మృదువుగా
చంద్రిక తల అడ్డం తిప్పుతూ “కాదు ఏదో వుంది నాతో చెప్పక పోతే నామీద ఒట్టే” అంది.
ప్రసాద్ కు నవ్వు వచ్చింది. కాస్త బాధకూడా కలీగింది. “జీవితంలో ఎవరి యుద్ధాన్ని వారే నడుపుకోవాలనే సూత్రం అప్పుడే మరచిపోయావా చంద్రికా?” అన్నాడు.
“మరచిపోలేదు మామయ్య కాని నాకు మీ చ్ఛాయలో తప్ప వేరే వ్యక్తిత్వం లేదు. స్థానం లేదు. అలాంటిటప్పుడు నాకు చెప్పగుండా వుండటం మీలోని ఒక భాగాన్ని అంధకారంలో వుంచడం సమం అవుతుంది” అంది.
ప్రసాద్ “అవి వివేకవంతమయిన మాటలు కావు, చంద్రిక” అని ఏదో అనబోతుంటే చంద్రిక అడ్డము వచ్చింది.
“ఉద్రేకంతో, వివేకం నాకు పని లేదు, వివేకవంతమైన నేనెందుకుచెయ్యాలి? కృతజ్ఞతతో మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకముంది. మీకు లేనంత మాత్రాన నాకు వుండకూడదనే అధికారం మీకు లేదు. నాజీవితంలో మీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. నాసర్వస్వము మీదే. దీనికి మా యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు” అంది .
చంద్రిక వుద్రేకవంతమైన మాటలు ప్రసాద్ ని ఎంతో ఆశ్చర్యపరచేయి. ఆమె మాటలు పూర్తి అర్ధం ఆమె గ్రహించిందా అనే అనుమానం కలిగింది. చంద్రికను మొదటిసారి చూచినప్పుడు కమలన్న మాటలు జ్ఞాపకమచ్చేయి. “కృతజ్ఞత అనే మైకంలో పడి నీయెడ నీకున్న కర్తవ్యాన్ని మరచిపోతావనే నాకు భయంగా వుంది చంద్రిక. అది యెన్నడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కప్పి బుచ్చకూడదు. యీప్రమాదం నుంచే నిన్ను నువ్వే కాపాడుకోవాలని నాకనిపిస్తోంది” అని ప్రసాద్ ని అనుమానించి అన్న మాటలు, చంద్రిక మాటలు వాటి సత్యాన్ని నిరూపించాయి. ఆనాడు ఆ మాటలు విన్నప్పుడు తాను చంద్రికకు ద్రోహం చేస్తాననే అనుమానం కమలకి కలిగినందుకు బాధపడ్డాడు. ఈనాడు చంద్రిక సంపూర్ణ సమర్పణ హృదయంలో ములుకుల్లా గుచ్చుకుంది.
చంద్రిక “జీవితంలో స్పర్శజ్ఞానాలకీ , తర్కశాస్త్రానికి మించిన విలువలు కొన్ని ఉంటాయని కమల అంటుంది. వాటిలో నాకు ఆట్టే నమ్మకం లేకపోయినా ఈనాడు నాకెందుకో నాముఖందాచుకోవాలనిపిస్తోంది” అన్నాడు.
చంద్రిక ఇంకా ఆ వుద్రేకంతోనే వుంది. “మాటలు తప్పించకండి మామయ్య. మిమ్మల్ని బాధపెట్టే విషయ మేమిటో మీరు చెప్పాలి” అంది .
ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్పు విడచి “ఒక స్త్రీని ప్రేమించాను చంద్రికా. అహర్నిశలు ఆమె రూపమే నా నేత్రాల ముందు మెదుల్తూంది కాని ఆమె నన్ను అసహ్యించుకుంటుంది. చీడపురుగులా ఏవగించుకుంటుంది. ఇది నేనెలా సహించగలను?” అన్నాడు.
ప్రసాద్ మాటలు చంద్రికను దిగ్భ్రాంతురాలిని చేశాయి. రజని మాటలలోని సత్వం ఆమెకు తెలిసివచ్చింది.
“ఆమెఎవరో చెప్పండి! నేను వెళ్ళి బతిమిలాడుతాను. ఆమె మనస్సు మారుస్తాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయివుంటుంది. నాకు చెప్పండి” అంది.
“లేదు చంద్రికా అది నీ సాధ్యం కాదు. పేరు తెలిసి నువ్వు ఆవిధంగా ప్రయత్నించేవంటే పరిస్థితి ఇంకా విషమిస్తుంది” అన్నాడు.
చంద్రిక దానికి సమాధానం చెప్పలేదు. తల పూర్తిగా క్రిందకు దించి వేసుకుని “ఆమెతప్ప యింకెవరూ మీకు సరిపడదా?ప్రేమించలేరా ? అంది నెమ్మదిగా.
చంద్రిక మాటలమధ్య వున్ననిగూడార్ధాన్ని ప్రసాద్ గ్రహించాడు. సిగ్గుతో తలంచుకొనివున్న ఆమె కేసి తేరిపార చూచాడు.
“యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు చంద్రిక. ఇది నా కెంతో విచారాన్ని కలిగిస్తోంది కమల హెచ్చరికని నిరూపించకు” అన్నాడు.
“సహజమైన వుద్రేకాన్ని, అసభ్యత అనే పదానికి భయపడి అణచకోవడం ఆత్మవంచనయని మీరేకదా చెప్పేవారు, స్వవిషయం వచ్చేసరికి మీరు కూడా అందరిలాగే సంఘానికి భయపడి తిరస్కరిస్తారా? మీరుకూడా ఇంతేనా? అంది.
చంద్రిక మాటల రూపు ప్రసాద్ ని లోలోన కొంచెం భయం పుట్టించాయి. తన ప్రబోథం తిరిగి తనకే వప్పగిస్తోంది. చంద్రిక ఆనాడు రజనీకి ప్రతిబింబంలా అతని కంటికి కనబడింది. ఆ యువతి భవిష్యత్తు అతనికే భయం కలిగించింది. రజనీవంటి సౌందర్యవతి కాదు. ఆగ్నిలాంటి ఆత్మవిశ్వాసం కూడా లేదు. అయినా భయంకరమైన నిర్భయత్వం, నివురు గప్పిననిర్లక్ష్యం ఈమెలోకూడ మూర్తీభవించి వున్నాయి. ప్రచండ మయిన స్త్రీ సాహస శక్తి ముందు ఎంతటి పురుషుడైనామోకరిల్లవలసిందే,
“సంఘానికి భయపడటం లేదు. చంద్రిక ఒకరికి సహజమయినది ఇంకొకరికి అసహజంగా కనబడటం కూడా సహజమే, ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడిప్పుడు తెలుసుకున్నాను. ఒక వ్యక్తి ఇంకొకరిని నిజంగా ప్రేమిస్తే తప్పనిసరిగా వారంటే కొంచెం ఆ వ్యక్తికి భయం కూడా వుంటుంది. ఇది అసందర్భముయినా ఎందుకో చెప్పాలనిపించింది ఆన్నాడు ప్రసాద్
“ఇదే విషయం రజని వొకసారి చెప్పింది. అందుకు కారణమేమంటే రెండవవ్యక్తి ప్రేమించబడుతున్నాడు. నిజంగాప్రేమించడం లేదు” అంది చంద్రిక.
రజని అన్న మాటల సత్యం తనలో తానే అతను గ్రహించగలిగాడు.ఆమె బుద్దితీక్షణతకు అతని హృదయమంతా గౌరవంతో నిండిపోయింది. రజని తనని విడచిననాడే అతని జీవితం చుక్కాని లేని నావ అయిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న, జలగర్భంలో పాషాణాన్ని నావ ఎప్పుడు వెళ్ళి కలుసుకుంటుందా?ప్రసాద్ మౌనం చంద్రికను మళ్ళీ కొంచెం వుద్రిక్తనుచేసింది.
“నా ప్రశ్నకు సమాధానం యింకా చెప్పలేదు మామయ్య.మీరు కాంక్షించే ఈ స్త్రీ స్థానాన్ని ఇంకెవరు ఆక్రమించలేరా?”అంది.
ప్రసాద్ హఠాత్తుగా లేచి వుద్రిక్తమెన కర్కశ స్వరంతో “లేదు చంద్రికా, యింకెవరు ఆక్రమించుకోలేరు” అని బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలలోనే కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. చంద్రికకు దుఃఖం ముంచుకొచ్చింది. తన ప్రయత్నమంతా విఫలమయిపోయింది. ప్రసాద్ ని ఆ అజ్ఞాన స్త్రీ నుండి రక్షించుకోలేకపోయింది.
చాప్టర్ 19
విశాల వెళ్ళిపోయిన తరువాత రజనికి కాస్త విశ్రాంతి తీరిక చిక్కాయి. కాని మనస్సులో అశాంతి కూడా చెల రేగింది. ప్రపంచంలో అందరు ఆమె ఆస్కారం అర్ధించేవారేకానిచేయూతనిచ్చే వారు లేరు. రజని ఒక ద్వీపం లాంటిది. ద్వీపం నలుప్రక్కలా కనబడే సముద్రాన్ని చూచి మనమంతా మోసపోతాము. అది ఇతర భూభాగంతో సంబంధం లేని ప్రత్యేకమయిన పూర్తి స్వాతంత్యంగల ప్రదేశమని మనమంతా భ్రమపడతాము. కాని నిజానికి అది సత్యం కాదు. సముద్రపు అట్టడుక్కి వెళ్ళి పరిక్షించి చూస్తే మనకు కనబడేది కూడా భూమే. అదే ద్వీపానికి వున్నలంకె బ్రహ్మాండమైన సముద్రం దానిని పూర్తిగా నలువైపులా కప్పి వేసి భ్రాంతిని కలిగిస్తూంది? రజనీ కూడా అలాంటిదే. అందరు అమెను చూచి అపోహడతారు. తోటి మానవుల అవసరం లేని సంపూర్ణ వ్యక్తి అని అనుకుంటారు. ఈమె నిర్భయత్వం, స్వాతంత్రత, సముద్ర తరంగాలలాగే అందరిని మోసపుస్తాయి. బాల్యం నుంచీ విశాల, రజని కలసి మెలసి పెరిగి పెద్దవారయ్యారు. విశాల విలువ ఆమెకి ఆనాడు అర్థమయింది. మొదటిసారిగా రజనికి తాను ప్రపంచకంలో ఏకాకి అనే సంగతి ఏర్పడింది. కాని ఆలోచన క్షణికంమాత్రమే మెదిలింది. మరుక్షణంలో రజని మారుప్రశ్న వేసింది. అయితే ఏకాకి కానివారెవరు? రక్త సంబంధం, స్నేహలత,ప్రేమబంధం. ఇవన్నీ తాత్కాలికమయినవే కదా? జన్మించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే.మరణించినప్పుడు ప్రతి వ్యక్తి ఏకాకే, యీ మధ్యలో మనల్ని పట్టుకొని పీడించేవే యీ భ్రాంతి.
రజని రామాన్ని చూచి చాలా కాలమయింది. అతను కూడా ఆమెవద్దకు రాలేదు. దాని అర్ధం ఆమె గ్రహించక పోలేదు ఏదో విషయంలో కోపగించుకుని వుంటాడు, మనస్సులో దాచుకుని బాధపడుతూ వుంటాడు. కొంత కాలంనుంచి ఆమె అతని గురించి ఆలోచిస్తుంది. అతనిని ఆమె పూర్తిగా అర్థం చేసుకుంది. జాలి, దయ, ఆదరం, అనురాగం అన్నీ కలసి ఆమె హృదయంలో మెదుల్తూ వుంటాయి. అతని హృదయంలోని అమితమయిన ప్రేమ ఆమె గ్రహించింది. అది అపరిచితమైనదని, తిరస్కారం సహించలేదని, ఆమెకు తెలుసు. దాని పర్యవసానమేమిటా అని ఆమెకు అప్పుడప్పుడుభయంకూడా వేసేది. దానికి కొంత వరకు ఆమె భాద్యురాలు. మొదట అతనిని ప్రేమించి, పీడించి అనురాగపు బీజాలను అతని హృదయంలో నాటిన వ్యక్తి ఆమెయే అతనిలో మొదట అగుపించిన ఏవగింపుని, ఆమె సవాలుగా స్వీకరించాలని పాదాక్రాంతుని చేసుకోవాలని ప్రతిష్టపెట్టింది. నిజానికి ఆ ప్రయాస అనవసరమని ఆమె గ్రహించలేక పోయింది. క్షణకాలంలోనే అతని హృదయాన్ని వశపరచుకుంది. అపురూపమైన సౌందర్యం విచిత్రమైన ఆమె ఆశయాలు అగ్నిలాంటి ఆత్మవిశ్వాసం, అతనిని పూర్తిగా తన్మయుని చేశాయి. అతనిలో లోపించిన గుణాలన్నీఅతనికి ఆమెలో దృగ్గోచరమయ్యాయి. ఆమె మీద ఒక విధమైన గుడ్డి నమ్మకంగా ఏర్పడింది. ఆమె ప్రదర్శించే ఆ చనువు, విశ్వాసము రామం అనురాగపు చిహ్నాలుగా అర్ధం చేసుకున్నాడు. తన సర్వస్వాన్ని సమర్పించి ఆమె నీడలో నిశ్చింతగా జీవితం గడపాలనే వాంఛని రామం జయించలేకపోయాడు. ఇదంతా రజని గ్రహించకపోలేదు కానీ ఆమె వారిరువురి స్వభావాలకి మధ్యనున్న అగాధాన్ని కూడా గుర్తించింది. ఆమె నుంచి అతనికి కావలసింది ఎన్నడు లభించలేదు. ఆమెకి కూడా అతని నుంచి ఆమె వాంఛించేది లభించలేదు. రజని ఎంత స్వతంత్ర మనస్తత్వం కలదైనా ఆమె ఇతరుల రక్షణ క్షణికంగా వాంచిస్తుంది. బలమైన బాహువులతో చేరదీసి అభయ హస్తం యిచ్చే వ్యక్తి అవసరం రావచ్చు. ఎంతైనా ఆమె స్త్రీ, రామం ఆపాత్ర ఎన్నడు నిర్వర్తించలేడని ఆమెకు తెలుసు. ఎంతసేపూ అతను ఆమె మీద ఆధారపడివుంటాడు. తన భారమంతా ఆమె భుజస్కంధాల మీద వేస్తాడు కాని ఆమె భారాన్ని ఏమాత్రమూమోయలేడు. అని బుద్ధికుశలతలో విశ్వాసం వుంచే సాహసం ఆమె చేయలేదు. అయితే అ యెడ ఆమె కర్తవ్యం ఏమిటి? వారం రోజులు గడచిపోయాయి. ఈనాటి సాయంకాలం రజని రామం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. రెండుమూడు నిముషాలవరకు తలుపు తెరవబడలేదు. రజని మళ్ళీ తలుపు తట్టుతూ “నిద్రపోతున్నారా ? రామంబాబూ ! మేలుకొలుపు పాడమంటారా?” అంది.
వెంటనే తలుపు తెరచుకొని ఒక యిరవయి సంవత్సారాల యువతి వచ్చి కొంచెం కోపంతో “ఎవరు మీరు? ఎవరు కావాలి?”అంది. రజని క్షణకాలం నిర్ఘాంతపోయింది. కొద్ది క్షణాలవరకు ఆమెకు చేదోడువాదోడుగా వుండే సమయస్ఫూర్తిని కోల్పోయింది
సమాథానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది “ఎవరు మీరు? రామం బాబుకు ఏమవుతారు?”అంది.
Comments (0)