అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗
- Author: Bhimeswara Challa
Book online «అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗». Author Bhimeswara Challa
అది చూచి కమల కంగారుగా, ప్రసాద్ చెయ్యి పట్టుకోని వెనక్కు లాగుతూ “అది నిజం కాదు. ప్రసాద్ బాబూ! అది నిజం కాదు. కోపంతో అన్న మాటలు” అంది గద్గద స్వరంతో.
ప్రసాద్ అప్పుడు ఆ ప్రయత్నం మాని “కమలా! యీ విషయంలో పరిహాసం ప్రళయానికే దారి తీస్తుంది. ఇదేనా బలహీనత” అన్నాడు.
కమల యింకా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి పూర్తిగా కోలుకోలేదు, క్షణకాలం ప్రసాద్ ముఖంలోకి తీక్షణంగా చూచి గబగబ మెట్లు దిగసాగింది. ఆమెను వారిద్దామని ప్రసాద్ ముందు ఒక్క అడుగు వేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు కాని కమల చూపుల తీక్షణత తాళ లేక మరుచటి క్షణంలో పట్టు జారవిడిచారు. కమల చర చర మెట్లుదిగిపోయింది.
చాప్టర్ 4
ఈలోగా కమలాకరం, రామం, కమలకోసం నాలుగు మూలలా గాలించారు. రామం భవనం వదలి వెనుక వున్న వుద్యానవనంలో వెదకసాగేడు. అక్కడ కూడా చాలా మంది జనం గుమిగూడి వున్నారు. వెదుకుతూ వుంటే వెనుక భుజంమీద ఎవరో చెయ్యి వేసినట్లయి వెనుదిరిగి చూచాడు, కమల కోసం కాని ఆమె కమల కాదు.
రజనిని చూచి నవ్వుతూ “నువ్వా రజనీ, కమల కోసం వెదుకుతున్నాను ఎక్కడా జాడ తెలియడం లేదు” అన్నాడు
రజని చిరుకోపం ప్రదర్శిస్తూ “అందరు కమలకోసం వెదకేవారే! నా కోసం వెదకేవారే లేరు. నా కోసం ఆతురత పడే వారే లేరు. ఏమండీ నేనంత అవాంఛిత వ్యక్తినాచెప్పండి?” అంది.
“ఇతరులు నీ గురించి కంగారు పడవలసిన అవసరం లేదని అందరికి తెలుసు. అరణ్యంలో వదలి వేసినా ఆర నిముషములో ఆశ్రయం పొందగలవు”అన్నాడు రామం.
“అవును. నాలాంటి వారెప్పుడు ఎవరో ఒకరి ఆశ్రయంలోనే వుంటూంటారు. ఎవరో ఒకరి నీడలోనే బతుకుతాను విసుగెత్తి వొకరు వదలి వేస్తే ఇంకొకరి చెంత చేరుతాను. విరహతాపంతో వెయ్యి మంది అర్రులు చాచితే వంతులు వేస్తాను అంతేనా మీరనేది” అంది.
రామానికి రజని పరిహాసపు ధోరణి అలవాటయి పోయింది. అయినా ఆమె తనను గురించే ఆ విధంగా అంటూంటే సహించ లేకపోయాడు.
“రామాన్ని నువ్వింక సరిగా అర్థం చేసుకోలేకపోయాను, లేకపోతే యిలాంటి మాటలు పరిహాసానికైనా అనవు,” అన్నాడు
రజని రామానికి కోపం వచ్చిందని గ్రహించి “వెన్నెల రాత్రులలో కూడా మరింత వేడి ఎలా ఎక్కుతారో నాకర్ధం కాదు. పదండి కాస్త తిరిగి వద్దాము ” అంది.
ఇరువురు బయలుదేరారు. తిరిగి తిరిగి అలసి ఒక చోట కూర్చున్నారు. ఆ వెన్నెలలో రజని ప్రక్కన కూర్చుని వున్న రామంకీ మనస్సులో రమ్యమైన ఆచనలు చెలరేగసాగాయి, “తెల్లటి యీ వెన్నెలలో, తెల్లటి భవనం. నన్నెక్కడికో తరుముకుపోతుంది రజని, పున్నమినాడు యి దృశ్యం యింత అందంగా వుంటుందని నేనూహించలేదు” అన్నాడు.
“కాదు అమావాస్యనాడు యింకా అందంగా వుంటుంది. చుట్టూ నల్లటి కారు నలుపు మధ్యన తెల్లటి భవనం ఆ దృశ్యం యింకా మనోహరంగా వుంటుంది. ఇప్పుడు తెలుపులో తెలుపు లీనమయిపోతుంది. అప్పుడు నలుపులో తెలుపు నలువైపులా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది” అంది రజని :
“తెల్లటి శరీర ఛాయగల నీబోటి స్త్రీ నల్లటి క్లేశాలను విరబోసుకొని నల్లటి చీరె తెల్లటి జాకెట్లు వేసుకొని వెన్నెలలో ఏకాంతంగా విహరిస్తూ వుంటే...” అని రామం అంటూంటే!
“కామినీ భూతమని అందరు హడలి చస్తారు” అని చిరునవ్వుతో అయినా మీరు ఢిల్లీలో బయలు దేరేముందే చెప్పలేకపోయారా- యీ సంగతి ? నల్లటి చీరె, రవిక వేసుకునే దానిని అయినా తెల్లటి చీరె, పచ్చటి యీ రవికా నాకు శోభించటం లేదా చెప్పండి ?” అంది.
పరధ్యానంగా ప్రక్కలకు చూస్తున్న రామం నిండుగా రజనిని పరీక్షించి చూస్తూ “నన్నెందుకిలా ఉన్మాదుని చేస్తున్నావు రజనీ! శరీర సౌందర్యానికి, నేనిలా చలిస్తున్నానంటే నేను నీచుడిని కాదా?” అన్నాడు.
రజని నవ్వుతూ “నీచులు కారు – రసికులు” అంది.
“పరిహాసం కాదు - రజని నేను దీని గురించే చాలాసార్లు మనస్సులో మదనపడుతూంటాను. నీ సౌందర్యం నన్నెందుకు తన్మయుని చేస్తుంది? నిజం చెప్పు, ఈ అంధునికి దారి చూపించు” అన్నాడు రామం:
“అంధునికి నేత్రాలంటే వుండవు రామం బాబూ. కాని ఆత్మ అనేది ఒకటి వుటుంది. సాధారణంగా నేత్రాలలోటును కూడా అదే పూర్తి చేస్తూ వుంటుంది. అదే ఎప్పుడూ దారి చూపిస్తుంది. అయినా మీరు దీని గురించి బాధపడవలసిన అవసరమేమి లేదు. ఈ ఆకర్షణే శూన్యమయితే సృష్టి అంతరించి పోతుంది. ఔన్నత్య మనేది దీనిని అదుపు ఆజ్ఞలలో వుంచుకోవడంలోనే వుంటుంది, సౌందర్య పిపాస సర్వకాలం లోనూ మానవ హృదయాలలో మెదులుతూనే వుంటుంది. అది మరుగున వుండవచ్చు కాని మాసి పోదు” అంది .
రామం హృదయం లోంచి ఏదో బరువు తీసినట్టయింది, దీర్ఘంగా నిట్టూర్చి “అయితే యిందులో దోషం లేదు ! ఇతర బంధనాల తోటి దీనికి నిమిత్తం లేదా ? మనం చేసే చేష్టల వలన యింక ఏ యితర మానవునికి చాలా కష్టము కలుగకుండా చూచుకోవడం మన కనీస ధర్మం కాదా?” అన్నాడు.
“మీరలా చుట్ట చుట్టి మాట్లాడతారెందుకు? అడగదలచినది స్పష్టంగా ఎందుకు అడగరు? మీరనేది వివాహితను ప్రేమించడం దోషము కాదా అని కాదా ? కాదుముమ్మాటికీ కాదు. ఎందుకంటే ప్రేమించడం ప్రేమించకపోవడం మన యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. అది ఏలా సంభవిస్తుదో ఏలా పరిణమిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక వేళ మనం ప్రేమించే వ్యక్తి వివాహితులయినంత మాత్రాన అందులో మన తప్పేముంది. మనస్సులోని భావాల్ని ఆలోచనల్ని అనురాగాన్ని శాసించే అధికారం ఎవరకు లేదు. మనస్సుని మనం శాసించలేక పోయినప్పుడు వాటి చేష్టల్ని మన తప్పులుగా అంట కట్టడం అన్యాయం కాదా? అందుకని స్వేచ్ఛావిహారం చెయ్యమని చెప్పడం లేదు. మీరు చెప్పినట్లు సాధ్యమైనంత వరకూ దాని వలన ఆ వ్యక్తిపై ఆధారపడిన వ్యక్తికి భర్త లేక భార్యకి అన్యాయం జరగకుండా చూచుకోవాలి. అంతే” అంది రజిని.
“అంటే నువ్వనేది-వివాహమయిన వారిని మనస్సులో ప్రేమానురాగాలతో పూజించడంలో తప్పేమీ లేదంటావంతే ? ఏదో దోషం చేస్తున్నామని మనస్సులో మనం బాధపడవలసిన అవసరం లేదంటావు”? అన్నాడు రామం.
“మీరు మనస్సులో బాధ పడవలసిన అవసరం అసలు లేనేలేదు. ఎందుకంటే నేను వివాహితను కాను. సర్వ స్వతంతురాలైన స్త్రీని” అంది రజని.
రామం కొంచెం కోపంతో “నేను నాగురించి మాట్లాడటం లేదు రజని! జనరల్గా మాట్లాడుతున్నాను. అన్నింటినీ యిలా అర్థం తీస్తే ఎలా?” అన్నాడు.
“మీరు ఏ వ్యక్తిని మనస్సులో వుంచుకొని మాట్లాడుతున్నారో తెలుస్తూనే వుంది. నాకు ప్రపంచంలో ఏ బంధనలు లేవు మనస్సులో అంతకంటే లేవు, మీ మనస్సులో మీరు వాటిని నిర్మించుకుని మధనపడకండి” అంది.
రామానికి ఆ విషయంలో సంభాషణ పొడిగించటం యిష్టం లేకపోయింది. మౌనంగా వూరుకున్నాడు. కాని రజని వూరుకోలేదు. “దుఃఖాల్ని, నిరాశల్ని, నిస్పృహల్ని, మనస్సులో అణుచుకుని వుంచుకోవటం అనవసరమని నేను అనడం లేదు. జీవితపు రణరంగంలో గాయపడని హృదయాలు చాలా అరుదుగా వుంటాయి. ఏదో ఒక బాణం దూసుకు పోతుంది. బాధపెడుతుంది. నేను కాదనను. కాని, ఆగాయన్ని పదిలంగా భద్రపరచుకోడానికి ప్రయత్నిస్తారు కోందరు. అదే ఆత్మవంచన అంటాను నేను. ఇంకొకటి. ఆలోచనలు ఆశయాల – వాంఛలు- పరిపరి విధాల మనస్సులో చెలరేగుతాయి- అసంబంద్దమైన, అన్యాయమైన కోరికల్ని అణచుకోవడానికి ప్రయత్నించడం మంచిదే- కాని ఆలాంటి కోరికలు మనస్సులో కలిగాయని బాధపడడం అనవసరము- అవివేకము కూడాను. అంతర్గతంలోని కోరికలలో సహజమైనవి కానీ అసహజమయినవి కానీ - గర్వించగలిగినవి కొన్ని, సిగ్గు పడవలసినవి కొన్ని అంటూ విభేదాలు లేవు. అన్నీ ఒకే తరగతికి చెందుతాయి . మనం పాటించవలసిన సూత్రంఒక్కటే క్రియరూపేణ పెట్టవలసి వచ్చినప్పుడు వాటి పరిమాణాల గురించి ఆలోచించి నిర్ణయానికి రావాలి ఇంకొక మాట మీహృదయంలో స్థానం అందరికి అనవసరంగా యివ్వకండి. తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది” అంది.
ఆ చివర మాటలు వింటుంటే రామం హృదయంలో అత్యంతమైన అశాంతి చెలరేగింది, కళ్లల్లో నీరు నిండు కుంది. ఎంత ఆపుకుందామన్నా అవి ఆగలేదు. పక్కకు ముఖం తిప్పుకుని తుడుచుకోవడానికని రుమాలుకోసం జేబులు వెదకసాగాడు. కాని కావలసినది దొరకలేదు. ఆది రజని పసికట్టి “ఏది ఇలా చూడండి రామంబాబూ? దాచుకోవలసింది యిందులో ఏమి లేదు” అంది.
కన్నీరుతో నిండిన ఆ కళ్ళను, రుమాలుతో తుడుస్తూ “కన్నీరు మానవత్వానికే మాయని మచ్చ, అవి మండి పడతాడు ప్రసాద్. కాని అది నేను అంగీకరించను. “మనోదౌర్బల్యానికి నిదర్శనమని మాత్రంఅంటాను.” అంది.
“మనోదౌర్బల్యమే కావచ్చును, కాని నువ్వే చెప్పేవు కదా , మనస్సుని శాసించడం చాలా కష్టం అని. ఆయినా నాకింత సునాయాసంగా ఏలా కన్నీరుబికి వస్తుందో నా కర్థం కాదు! ఆఖరికి విషాదకరమైన పాటలు వింటూంటే కూడా కన్నీరుబికి వస్తుంది” అన్నాడు రామం.
“మీకు సంగీతమంటేయిష్టమని నాకుయింకా తెలియదు. నన్ను పాటలు పాడమంటారా చెప్పండి?” అంది.
ఆశ్చర్యంతో “సంగీత సాధన కూడా చేశావా రజని! నాకు యీ ఆలోచన తట్టనైనా లేదు. ఎందుకో సంగీతానికి నీకు సరిపడడని నాలో ఒక భావం నాటుకుపోయింది” అన్నాడు రామం.
“అలా ఏలా అనుకున్నారు చెప్పండి – మాబోటివారికి సంగీత సాధనం- నృత్యం చాలా సానుకూలంగా వుంటాయి కదూ. చిన్నతనం నుంచి సాధన చేశాను. నృత్వం సాధన చేసాను కాని నాకు నచ్చలేదు - వదలి వేసాను. కాని సంగీతమంటే నాకు యిష్టమే- ఏమేమి పాటలు పాడమంటారు చెప్పండి” అంది రజని నవ్వుతూ.
ఆ తరువాత సుమారు ఒక గంట వరకు రామం రజని మధుర కంఠ స్వరాన్ని మైమరచి విన్నాడు. పాట కచేరీ పూర్తిగా అయిపోయిం తర్వాత రజని. “గంట సేపు నాకు కంఠశోష కలిగించారు. ప్రతిఫలం యివ్వకుండా మిమ్మల్ని నేను వదలి పెట్టను” అంది.
రామం కంటితడి తుడుచుకుంటూ “యివ్వడానికి నాదగ్గర ఏముంది రజని: వున్నదొక్కటి నీ కక్కర లేదు. ఇక నేనేం చెయ్యను?” అన్నాడు.
“అది నా కక్కర లేదని నేను అనలేదు. అది మీ దగ్గర వుంచుకుంటే నాకు మంచిదని నేనన్నాను. కాని మీరే చెప్పారు. వీటికి యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదని అయినా అవసరం రావచ్చును. అప్పుడు యాచిస్తాను కాదనరు కదూ?” అంది రజని.
రామం పూర్తిగా కరిగిపోయాడు. “నువ్వు మాట్లాడే దానిలో పరిహాసమేదో పరమార్థమేదో? ఎంత పరీక్షించినా నాకు ప్రసన్నమవదు రజనీ. కానీ యిదే నిజమవుతే నేను నీకీనాడు వాగ్దానం చేస్తూన్నాను. సర్వకాల సర్వావస్తలలోను నీకు నేను అండగా నిలబడుతాను. కాని యిదంతా పరిహాసానికంటున్నానని నీ మనస్సు చెప్తోంది. నీకు నేను అవసరం లేదు. నీ సహాయమే అందరికి కావలసి వస్తుంది. నిశ్చలమైన మనస్సు ధృడమైన విశ్వాసాలు. నీకు పరుల అవసరమేముంది? లేదు రజనీ! నీకు సహాయం చేసే అదృష్టం నాకు కలుగదు. నేను అందుకు నోచుకోలేదు. పైగా భవిష్యత్తులో నీ అవసరమే నాకుంటుంది” అన్నాడు.
“నిజంగా ఏమైనా సహాయం చెయ్యవలసి వస్తుందేమోనని మీరు అలా అంటారు. నోరు జారి - నాకు అండగా వుంటానన్నారు. కాని వెంటనే, ఏమో రజని “రాక్షసి – మాటయిచ్చేనంటే పట్టుకు వదలదని మాట మార్చి వేస్తారు. భలేవారు మీరు. అమాయకులనుకున్నాను. కాని నిజంగా మీరు దేవాంతకులు” అంది రజని నవ్వుతూ.
“ఏడుస్తూ వున్న వాళ్లని నవ్వించడము - నవ్వుతున్న వాళ్లని ఏడిపించటం నీకు పుట్టుకతోనే లభించిన విద్యలా వుంది” అన్నాడు రామం నవ్వుతూ.
“ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. ఇంకా సేపు పోయిన తర్వాత ఏమవుతుందో చెప్పలేము, అందుకని యిప్పుడే లేవండి. చాలా ఆలస్యమయింది. నేను చాలా అలసి పోయాను నిద్ర ముంచుకు వస్తూంది. కాసేపు యిక్కడే పడుకుంటాను. మీరు వెళ్లి కాస్త వారిని వెదకి తీసురండి యిక్కడికి - అని అక్కడే ఆ గడ్డిలో పవ్వళించింది. ఆకుపచ్చటి ఆనున్నటి గడ్డిపై వెన్నెలలో, వంపులతో వయ్యారంగే పవ్వళించిన ఆ సుందరాంగి సౌందర్యం రామాన్ని సమ్మోహితుని చేసింది. వెన్నెలలో లీనమైన ఆమె చీరె పచ్చటి ఆ గడ్డిలో ఆమెకొక వింత శోభ నిచ్చింది. రామానికి, ఆమెను వదలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది.
“లేదు రజని, వెళ్ళితే యిద్దరము కలసి వెళదాం లేకపోతే ఇక్కడే వుందాము. వాళ్లే వెదుక్కుంటూ వస్తారు” అన్నాడు.
“అలసిపోయి కాస్త అలసట తీర్చుకుంటానంటే మీరనవలసిన మాటలివేనా చెప్పండి? బొత్తిగా మీలో కృతజ్ఞత లేదు, గంటసేపు నాచేత గ్రామఫోనులా మీరు కావలసిన పాటలన్నీ పాడించుకున్నారు. ఇప్పుడు కాస్త సహాయం చేసి పెట్టమంటే చెయ్యనంటున్నారు. పైగా ప్రగల్భాలు పలికారు.” అంది రజని.
“అది కాదు రజని, నిన్ను వొంటరిగా యిక్కడ వదలి ...”
“వదలితే ఏమవుతుంది ! ఇదేమి అరణ్యం కాదు. ఇక్కడున్న వారంతా మీలాంటి మనుష్యులే. మీరు లేనప్పుడు వారేమైనా చేసి పోతారేమోనని భయం మీకక్కర లేదు. ఒక వేళయిది అరణ్యమే అయినా, మీరన్నట్లు అర నిమిషంలో ఆశ్రయం చేరుకుంటానని” అంది.
రామం యిక వెళ్ళక తప్పలేదు. రజని మీద కొంచెం కోపం కూడా వచ్చింది. కాని ఆమెతో వాదించి నెగ్గటం అసంభవమని అతనికి తెలుసు. మిగతా ముగ్గురి అన్వేషణార్ధం బయలుదేరాడు. కాని మనస్సు పీకుతునే వుంది. రజని వద్దకు తిరిగి పోవాలనే కోరికను బలవంతాన అణచుకొని తాజ్ మహల్ చుట్టూ తిరగసాగాడు. మనస్సు రజని వద్ద వదలి వచ్చాడు. శరీరం మాత్రం వెదకసాగింది. ఆ కారణం వల్లనే అతనికి ఎవరు కనబడ లేదు. తిరిగి తిరిగి అలసిపోయి వెనుదిరిగి వస్తూంటే కమలాకరం కనబడ్డాడు.
కమల మీనారట్ దిగి కమలాకరంకోసం వెదికి వెదికి చివరకు కలుసుకుంది. కమలను చూచి వెంటనే కమలాకరానికి కలిగిన సంతోషానికి హద్దులు లేవు. కమలకూడా ఆనందంతో వుప్పొంగిపోయింది. ఇరువురు దగ్గరలో వున్న వుద్యానవనం కొలను వద్ద కూర్చుని తనివితీరా అనురాగాన్ని ఆస్వాదించారు.
కమల జరిగింది చెప్పడానికి ప్రయత్నించింది. కాని చెప్పలేకపోయింది. జరిగినదంతా వొక పీడకలలా ఆమెకు కనబడింది. దానిని మరచిపోవడానికి చేసే ప్రయత్నమే కమలాకరంపై అత్యధికమైన అనురాగంగా పరిణమించింది.
“ఈ భవనమే అవిచ్ఛన్నమైన భార్యాభర్తల ప్రేమకు నిదర్శనము. దీనిని కట్టించి షాహజహాను తనకు ముంతాజ్ పైన వున్న ప్రేమను అమరం చేసాడు. మరణం తర్వాత ఏ భర్త యింతకంటే ఎక్కువ యింకేమి చెయ్యలేడు. భార్యాభర్తల బంధం క్షణికమని, క్షణభంగుర మని పలికేవారికీ యిదే తిరుగులేని తార్కాణం. అలా అనే వారంతా కుత్సితులు. కామాంధులు. కఠిన హృదయులు” అంది కమల.
“అంత కోపం పనికి రాదు. కమలా, ఎవరి ఆత్మకు తోచిన రీతిగా వారనుసరిస్తారు. ఇతరుల అభిప్రాయాలు, చేష్టలను విమర్శించి తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదు - ఇది మంచిది. ఇది చెడ్డది. యిది వుత్తమమైనదీ యిది కుత్సితమని, శాసించే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ మానవ కల్పితాలు దైవకల్పితాలు వేరు” అన్నాడు కమలాకరం.
“ఇతరుల అభిప్రాయాలతో నాకు నిమిత్తం లేదు. కాని వారి అభిప్రాయాలని యితరుల నెత్తిన బలవంతాన రుద్ది వారిని బాధించి మనోవోభ కలిగించడం అన్యాయం కాదా ?” ప్రశ్నించింది కమల.
“అదే నిజమయితే అది అన్యాయమే కమలా? కాని నువ్వు ఎవరిని వుద్దేశించి అలా అంటున్నావు?”
కమల కెందుకో ఆ వ్యక్తి పేరు చెప్పడం యిష్టం లేకపోయింది. “పోనీ అది వదిలెయ్యండి, కాని యిది నాకు చెప్పండి.. మన విధి, కర్తవ్యము, బాధ్యత మనకు తెలిసి వుండికూడా మనస్సు మనల్ని తప్పుదారి ఎందుకు పట్టిస్తుంది మన శరీరంలోని ఒక భాగమైన మన మనస్సును మనం ఎందుకు శాసించలేము!” అంది.
శాంతస్వరంతో “మనస్సుని శాసించగల వ్యక్తులు కూడా వున్నారు కమలా, వారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. వారి స్మృతీ యితరుల హృదయాలలో అజేయంగా హత్తుకొని పోతుంది. మిగతా వారంతా మట్టిలో కలిసిపోతారు మనమంతా యీ రెండవ తరగతికి చెందిన వ్యక్తులం. క్రోధం - కామం - ఇచ్చ -యీర్ష్య,యివన్నీ విజృంభించి వ్యక్తిత్వాన్నే మటుమాయం చేస్తాయి” అన్నాడు.
“మానవుడు దైవనిర్మితమయినప్పుడు యివన్నీ దైవనిర్మితాలు కావా? అలాంటి సమయంలో వాటిని అణచుకుని సిగ్గుపడవలసిన అవసరం ఏమిటి?” అంది.
“ఇవి దైవనిర్మితాలు కావని ఎవరు అనరు, కాని సృష్టిలో మంచి చెడు లేవా? ఆ విధంగానే మానవునిలో కూడా దైవం కొంత చెడు సృష్టించాడు. అదే లేకపోతే మానవుడు దైవసమానుడవుతాడు .. చివరకు దైవాన్నే ధిక్కరిస్తాడు. మానవుని ఎదుట దైవమే నిస్సహాయుడవుతాడు.”
"అయితే మీరనేది దైవస్వలాభం కోసం యీ లోపాలన్నీ సృష్టించాడంటం, సృష్టికర్త అంత స్వలాభపరుడా?"
సమాధానం చెప్పబోయే సమయానికి రామం ఎదురయ్యాడు. "మీరిద్దరు యిక్కడ వున్నారా? మీకోసం వెతకి నా ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చాను. మీరు చల్లగా యిక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు" అన్నాడు అక్కడ కూర్చుంటూ.
“మీరు అంత వెదకటానికి మేమేమైనా ఎక్కడైనా పొంచి వున్నామా చెప్పండి. ఇక్కడే కదా వున్నాము. కాస్త మీరు పరికించి చూస్తే కనబడి వుండేవాళ్లము. మనస్సు ఎక్కడో వదలి వచ్చినట్లున్నారు" అంది కాస్త నవ్వుతూ కమల.
కమల మాటలు విని రామం కాస్త కంగారుపడ్డాడు. "అబ్బే అదేమీ లేదు. చీకట్లో కూర్చున్నారు మీరు" అన్నాడు.
నవ్వుతూ "చీకటంటావేమిటి రామం?. పుచ్చపువ్వులాంటి యీ పండువెన్నెలని. నీకేదో మతి భ్రమ కలిగినట్లుంది" అన్నాడు కమలాకరం.
మాట తప్పిద్దామని లేనిమాట తెచ్చుకుని, "కలిగిందేదో కలిగింది గాని, మీరింకలేవండి. మిమ్మల్నందరినీ కూడా తీసుకురమ్మని రజని ఆదేశించింది. అంతా స్వార్థపరులు. ఆవిడ అక్కడ వుంది. మీరు యిక్కడ కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక ప్రసాద్ యెక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఒకళ్ల ధ్యాస యింకొకళ్లకి లేదు. అంతా కలసి వచ్చేం. తర్వాత యిక్కడ ఏవరికి వారే యమునా తీరే అంటే ఎలా.. మధ్యన నా మీద పడిందిదంతా?" అన్నాడూ.
“రామం మనసులో యీర్ష్య దహించుకుపోతుంది. వెన్నెల వేడిమి పుట్టిస్తోంది. యీ చల్లదనం చికాకు కలిగిస్తోంది. బ్రహ్మచారులతో బాధే యిది. వారికి లభించని సుఖమితర్లకి లభిస్తే వోర్చలేరు" అంది కమల నవ్వుతూ.
"అలాంటి అన్యాయపు మాటలు మాట్లాడకండి మాబోటి వారిని చూస్తే మీకంతా పరిహాసమే. వివాహం వ్యక్తులని స్వార్ధపరుల్ని చేస్తుంది. స్త్రీల దృక్పధంలొ ప్రపంచమంతా మరుగునపడి, వారు వారి భర్త మిగులుతారు. ఇక వీరు దేనిని గురించి పట్టించుకోరు" అన్నాడు.
"రజని యిక్కడ వుంటే చప్పట్లు చరిచి నవ్వుతూ శబాష్ రామంబాబు అనును. మీరనిన యీ మాటలు రజనికి శోభిస్తాయి. మీ నోటివెంట వస్తే చాలా అసహజంగా వున్నాయి" అంది కమల పకపక నవ్వుతూ.
"మీరలా అనుకోవచ్చు,కాని రజని మాత్రం అసహజపు మాటలు అనదని నాకు నమ్మకం" అన్నాడు రామం.
కమలాకరం వీరిద్దరి సంభాషణ ఎంటొ కుతూహలంతో వింటున్నాడు. కమల మాటలలోని చురుకుతనం అతనికిఆశ్చర్యం కలగజేసింది. ఆమె మాటలు రామానికి కొంచెం బాధ కలిగించాయని గ్రహించి, “అదేదో ఆవిడనే అడిగి తెలుసుకుందాము పదండి. ఆవిడ ఎక్కడుంది ?” అన్నాడు.
ముగ్గురు కలిసి రజని వున్న ప్రదేశానికి వచ్చారు. వారు వచ్చేసరికి రజని గాఢ నిద్రలో వుంది. వెన్నెలలో ఆదృశ్యం ఎంతో మనోహరంగా వుంది. ఖాంతము. సంపూర్ణత ఆమె సుందరవదనంలో తాండవిస్తున్నాయి. పరిపూర్ణమైన ఆమె అవయవాలు నిద్రలో నిండుగా కాన వస్తున్నాయి. చిత్రకారుడు మక్కువతో చిత్రించిన చిత్రంలా గోచరించిస్తోంది. శిల్పి జీవితమంతా కష్టపడి సంపూర్ణత్వం సాధించిన చలువ రాతి విగ్రహంలా కనబడింది. రెండుమూడు నిమిషాలు ముగ్గురూ మైమరచి అదృశ్యం చూచారు. కమలాకరం కూడా తనను తాను మరచిపోయి నిశ్శబ్దుడై నిలబడిపోయాడు.
రజని, అని పిలచినా జవాబు లేదు. “గాఢనిద్రలో పున్నట్లుంది. యీ సుందర దృశ్యాన్ని ఎంత చూచినా తనివి తీరటం లేదు. ఆమె నిద్ర లేపి అంతా పాడు చెయ్యటం నా కిష్టం లేదు” అంది కమల.
రామం దగ్గరకు వెళ్లి రజనీ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుతో రజని వులిక్కిపడిప్రసాద్ అని గట్టిగా అంది - కళ్ళు విప్పకుండానే. ఆమాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. కాని వెంటనే అక్కడ, కమలా, కమలాకరం వున్నారని తెలుసుకొని “కాదు రజనినేను” అన్నాడు.
రజని కళ్లు తెరచి వారి ముగ్గురినీ చూచి “పాడుకల వచ్చింది.” అని మధ్యలో ఆగిపోయి “ప్రసాద్ యేడి” అంది.
“ఎంత వెదికినా కనబడలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఇక్కడకు మనం వచ్చిన తర్వాత ఎవ్వరికి కనబడినట్లు లేదు” అన్నాడు రామం.
కమల జరిగినది చెప్తామని ప్రయత్నించింది. కాని ఎందుకో ఆమెకు అది చెప్పకుండా వుంటేనే మంచిదనిపించి మౌనంగా వుండిపోయింది. ఆ తర్వాత అరగంట సేపు అందరు ప్రసాద్ కోసం అంతా గాలించారు. కాని జాడ ఏమి తెలియలేదు. చివరకు పార్కు చేసిన కారువద్దకు వెళ్ళి చూస్తే అక్కడ అది కూడా తెలియలేదు.
కారు
Comments (0)