అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗
- Author: Bhimeswara Challa
Book online «అప్రాశ్యులు - Bhimeswara Challa (e book reading free TXT) 📗». Author Bhimeswara Challa
రజని బాధతో కూడిన కంఠస్వరంతో “ముందర మా యింటి ప్రక్కవున్న డాక్టరుగారిని తీసుకొనిరండి. తరువాత తప్పెవరిదో పరిశీలిద్దాము” అంది.
డాక్టరువచ్చి చూచి కట్టుకట్టి “ప్రమాదమేమీ లేదు. నాలుగయిదురోజులలో తగ్గిపోతుంది. అదృష్టవంతులు” అన్నాడు.
డాక్టరుగారు వెళ్ళిపోయిన తర్వాత రజని మళ్ళి వంటింటిలోకి కుంటుకుంటూ వెళ్ళటం రామంచూచి “వద్దు రజనీ. నువ్వు ఈ పరిస్థితిలో వంట చెయ్యకూడదు. వంటవాడు చేస్తాడు'' అన్నాడు.
“నా పరిస్థితి యిప్పుడు మీ పరిస్థితికన్నా బాగానేవుంది రామం బాబూ! మీరనవసరంగా కంగారుపడకండి” అంది రజనీ,
ఆమె యిక చెప్పినమాట వినదని రామం మాట్లాడలేదు. జరిగిన ఈ దుర్ఘటనకుఅతనిమనస్సు ఎంతో దుఃఖంచింది. ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళే సాహసం లేక బయట కూర్చుని బాధపడసాగాడు. అది గ్రహించి వంటగదిలోంచి “ఒక్కరూ ఏం చేస్తున్నారక్కడ? ఇక్కడకు రండి” అంది రజని!
రామం నెమ్మదిగా లోపలికి వెళ్ళి మెదలకుండా ఒక మూలకూర్చున్నాడు. తప్పు చేసిన పిల్లవాడిలా మౌనంవహించాడు. ఆమె కాలికేసి వేదనతో చూస్తూ “ఇదంతా నా దోషమే అమ్మా! మాటలతోనో, చేష్టలతోనో నేను మొదట నుంచీ బాధపెడుతూనే వున్నాను” అన్నాడు.
ఆమె నవ్వుతూ “వీటన్నింటికీ ఏదో ఒక రోజున పగ తీర్చుకోకుండా వుండను. మీరేమి అనుమాన పడకండి. ఆడవారి పగ తాచుపాము పగ కంటే భయంకరమైనదని మీకింకా తెలియదు” అంది.
‘‘పగ దేనిమీద తీర్చుంటావు రజని! తుచ్ఛమైన ఈ ప్రాణం ఒకటే వుంది” అన్నాడు రామం.
ఆమె నవ్వుతూ “బాబోయి , అది తుచ్ఛమైనదంటేనేను ఒప్పుకోను. మీలాంటి సత్పురుషుల ప్రాణాలు అతి పవిత్రమైనవి” అంది.
రామానికి ఆమెమాటలు కోపం తెప్పించాయి. “అంతా నీ కెప్పుడూ పరిహాసమే రజనీ! నీతో ఏదైనా సీరియస్ గా మాట్లాడడానికి వీలు లేదు'' అన్నాడు.
“పరిహాసం కాకపోతే ఇంకేమిటి చెప్పండి ఈ అసందర్భపు మాటలు, ఏదో ప్రమాదం సంభవించింది. దానికి ఇంత రసాభాస ఎందుకు?” అంది ఆమె.
“కట్టుకట్టివున్ననీ కాలిని చూస్తూంటే నా హృదయంలో కాగడా పెట్టి కలచినట్లవుతోంది అమ్మా” అన్నాడు.
రామం మాటలకన్న అతని కంఠస్వరంలోని ఆవేదన ఆమెను క్షణకాలం కలవర పెట్టింది. కలవరపాటును కట్టి పెట్టి కోమల కంఠ స్వరంతో “ఇది చాలా చిన్న విషయం రామం బాబూ! త్వరలోనేగాయం మాసిపోతుంది, శరీరానికి తటస్థించే ప్రమాదాలన్నీ చిరకాలం వుండవు. కాని హృదయానికి సంభవిస్తే అది జీవిని కబళించి వేయగల శక్తి వుంటుంది. ఆ ప్రమాదాన్నుంచే మీరు ఎప్పుడూ మిమ్మల్ని రక్షించుకోవాలి” అంది.
“కాని అది ఎలా రజని! మార్గంకూడా చూపించు” అన్నాడు.
“ఒక వ్యక్తికి అనుకూలమైన మార్గం యింకొకరికి కాకపోవచ్చు. ఎవరికి వారే వెదకి వేసారి చివరకు గమ్యస్థానం చేరుకోవాలి. ఇందులోను నిజంగా నిస్సహాయురాలిని, నా సహాయం మీకేమీ లభించదు” అంది.
ఆమె మాటలలోని సారం గ్రహించాడు. వాటిల్లోని కాఠిన్యత, తిరుగు లేనినిశ్చయం అతన్ని చాలా బాధించాయి, తనను జాగ్రత్తపడమని ముందరే హెచ్చరించిందనుకున్నాడు.
రజని వంట ప్రయత్నం పూర్తి చేసేసరికి తలనొప్పి కూడా ప్రారంభమయింది తిన్నగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. రామానికి ఏమి చెయ్యాలో తోచక డ్రాయింగు రూములో కెళ్ళి కూర్చున్నాడు. అతనికి కొంచెం కోపంకూడ వచ్చింది. అతిధిని మర్యాద చెయ్యటంకూడ తెలియదు. నన్ను చులకన చేస్తోంది అనుకున్నాడు. బయటకు వెళ్ళిపోదామనుకున్నాడు. కాని కాళ్లు కదలలేదు. కొంత సేపటికి వంటవాడు వచ్చి “బాబూ! భోజనం తయారుగా వుంది. అమ్మగారు రమ్మనమంటున్నారు” అన్నాడు.
వంటవాడి చేత కబురు పంపించటం వల్ల రజనిమీద వున్న కోపం హెచ్చింది. కాని చేసేదేమీ లేక లోపలికి వెళ్ళాడు. రజని వొక కంచంనిండా భోజన పదార్థాలన్నీ పెట్టి వుంచింది. తన ముందర నొక చిన్న కంచంలో చాల అల్పంగా పదార్థాలు పెట్టుకుంది.
లోపలికి వెళ్ళిన వెంటనే “రండి! కూర్చోండి. నేను వంట చేశాను. కనుక నయినా కడుపు నిండా భోజనం అయినా చెయ్యండి” అంది.
రజనిమీద లోలోన రగులుతున్న కోపం ఈ మాటలతో విజృంభించింది. “కడుపునిండా భోజనం లేక నేనిక్కడకు వచ్చానా రజని? నేనసలు భోజనమే చేయను” అని కోపంతో కంచం ముందరకు తోసివేశాడు. క్షణకాలం రజనీముఖం వెలవెల బోయింది, కాని నెమ్మదిగా “మీరు భోజనం చెయ్యనంతమాత్రాన నాకేమైనా నష్టం కలుగుతుందనుకోవడం చాలా అవివేకం రామం బాబూ! మీరు యిలా అకారణంగా, అసభ్యంగా అలిగినంతమాత్రాన నేను మిమ్మల్ని బుజ్జగించి, బ్రతిమలాడి అన్నం తినిపిస్తాననుకోవడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరకు మిగిలేది నేను కొంచెం బాధపడటమే! అది మీరు మొదటి నుంచీ చేస్తూనే వున్నారు. ఇందులో కొత్త ఏమి లేదు” అంది.
శాంత గంభీరస్వరంతో పలికిన ఆ వాక్యాలు రామంలోని అహాన్ని సమూలంగా పెరికి వేసాయి. చింతాక్రాంత వదనంతో, వేదనాపూరిత స్వరంతో ఈరోజు ఎందుకో నా మనస్సులో నీమీద కోపంగా వుంది రజని. కారణం ఎంత వెదికినా కనబడ్డం లేదు. కాని ఒక విషయం మటుకు నీకు నేను చెప్పకుండ వుండలేను. ఈ యిల్లే నీ స్వగృహంగా నువ్వు భావించటం నేనెందుకో భరించలేకుండా వున్నాను” అన్నాడు.
రజని మందహాసం చేస్తూ స్త్రీలకు స్వగృహం లేనప్పుడు పరుల గృహాలనే స్వగృహాలుగా భావించుకోవాలి రామం బాబూ! ఇది మొదట్లోనే కాస్త నొప్పి కలిగిస్తుంది. తరువాత మాకిది అలవాటై పోతుంది. వివాహమయిన క్రొత్తలో స్త్రీలు భర్త యింటిలో పరులయింటిలో సంచరించినట్లు సంచరిస్తారు. పుట్టింటికోసం బెంగ పెట్టుకొని బాధపడతారు. కాని కొద్దికాలంలోనే పరిస్థితి పూర్తిగా మరిచిపోతుంది. పుట్టిల్లే పరాయి యిల్లయిపోతుంది. అక్కడ చాలా కాలం వుంటే ఆత్మగౌరవానికి ప్రమాదం సంభవించినట్లు భావిస్తారు.సంఘం కూడా వారిని చులకనగా చూస్తుంది” అంది.
రజని చెప్పిన ఆ ఉదాహరణ రామానికి నచ్చలేదు. “ప్రపంచంలో నీకు ఆత్మీయులు లేరంటే నే వొప్పుకోను, వాటి నన్నిటిని మీంచి యిది ఎందుకుప్రేమపాత్రమైంది” అన్నాడు.
“మీకు నేను మొదటే చెప్పాను. స్వగృహం లేనప్పుడు అద్దె ఇచ్చి మనం ఒక యింటిలో చేరుతాము. ఇంటిలో చేరే ముందు అనేక విషయాలు ఆలోచిస్తాము. ఈ యింటిలోకి ఎందుకు చేరాము, యిది ఎందుకుప్రేమ పాత్రమైంది యని అడిగితే మనం చెప్పడం కష్టం, అద్దె ఎక్కువ చేసినా ఆద్దె యిచ్చుకోలేక పోయినా, యివ్వడం యిష్టం లేక పోయినా యింటి వారు బయటకు వెళ్ళిపొమ్మన్నా యిల్లు వదలి పెట్టక తప్పదు. తరువాత వచ్చిన యింకొక యిల్లు దొరికితే సరేసరి లేకపోతే ఏ చెట్టునీడనో, ఏ రైల్వే ప్లాటుఫారంమీదనో తల దాచుకోక తప్పదు” అంది.
రజని మాటలు మళ్ళీ రామం కోపం రెచ్చగొట్టాయి. “నువ్వు ఆద్దె ఎంత యిస్తున్నావు రజని” అని అడిగాడు.
ప్రశ్న విని రజని క్షణకాలం స్తంభించిపోయింది, కమలని ఆ ప్రశ్న ఎవరయినా అడిగినట్లయిన క్రోధంతో మండిపడి చెంపదెబ్బ పెట్టి “మూర్ఖుడా సభ్యత, అసభ్యత తెలియని నీవంటి మొరటువానితో మాట్లాడమే భరించలేని అవమానం” అనేది. రజని కూడ సిగ్గుతో లోలోపల సిగ్గుతో దహించుకుపోయింది. ఆత్మనిగ్రహమనేది వుగ్గుపాలతో అలవడిన విద్య ఆమెకి. బలవంతాన మందహాసం చేస్తూ “ఈ రోజు నామీద మీకు నిజంగా కోపంగా వుంది, నేను చేసిన అపరాధ మేమిటో తెలియదు. అయినా ఈ ప్రశ్న మీలాంటి వారు వేయవలసినది కాదు. రామం బాబూ! సమాధానం చెప్పగలను, కాని వింటే బాధపడతారు, ఇంకొక సారి అడ గండి. ఇపుడు మీరు సరిగ్గా భోజనము, చెయ్యరు. కాలు భగ భగ మండుతున్నా, తలనొప్పిగా వున్నా నిజంగా మీకోసమే ఆప్యాయంగా వంట చేసాను . మీరు కడుపునిండా తినకపోతే నేను చాలా బాధపడతాను” అంది.
రామానికి అనుకోకుండా ఆ ప్రయత్నంగా నోరు జారిన ప్రశ్న అది. సిగ్గుతోటి, అవమాన తోటి, అసహ్యంతోటి లోలోన కుమిలిపోయాడు. రజని మందహాసం, శాంతస్వరం, మాటల్లోని ఆప్యాయతా గాయంమీద కారంజల్లి నట్లయింది. దుఃఖభరిత కంఠ స్వరంలో, వ్యాకుల వదనంతో నన్ను నేనేమి చేసుకోవాలో నాకే అర్థం కావటం లేదు రజని! నా నోటినుంచి ఆ మాటలు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు. నీ ఔదార్యము, కనికరము రంపపు కోత పెడుతున్నాయి రజని! నేను నీ కోపానికి కూడ అర్హుడను కానా!”.
రామం మాటలు వెళ్ళి తిన్నగా రజని హృదయంలో నాటుకుపోయాయి, తన శక్తి నంతా వినియోగించి వాటిని కూడబెరుకుతూ రజని అంది. “ఈ రోజు మీ మనస్సుబావు లేదు రామం బాబూ! ఆత్మనిండా, అశాంతి దీనిలో నిండి వున్నాయి.కడుపునిండా భోజనం చెయ్యండి. లేకపోతే నా మనస్సు చాలా బాధపడుతుంది
భోజనాలయింతర్వాత రజని ప్రసాద్ కి కావలసిన పదార్థాలు కారియర్ లో పెట్టుకొని బయలుదేరింది. రామం తనను కూడా ఆమెతో రమ్మంటుందేమోనని ఆశించాడు కాని రజని అలా అనలేదు. టాక్సీలో ఎక్కి వెళ్ళిపోతుంటే రామం మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం రజనీ! స్పప్నంలోఅని ఈసారి పారిపోతానంటే నేనూరుకోను. పరిహాసమాడకుండా సరియైన సమాధానం చెప్పి వెళ్ళాలి” అన్నాడు.
రజని “మీకెప్పుడు అలాంటి కోరిక కలిగితే అప్పుడు రండి. దానికి కూడ ఒక నిర్ణీత సమయం ఎందుకు చెప్పండి ? కాని ప్రసాద్ కి స్వస్థతచిక్కేవరకు ఎక్కువ కాలం నేను హాస్పటల్ లోనే వుంటాను” అంది.
రామం “వెళ్ళేముందు ఈ మాట విని వెళ్ళు రజని నా గురించి ఆలోచించే సమయంలో నా లోపాలను పరిగణించి నా కన్యాయం చెయ్యనని నాకు మాటయియ్యి.”
రజని “పరిగణించనని మాటియ్యను. కాని అన్యాయం చెయ్యనని మాట యిస్తాను యిక వెళ్ళండి అలస్యమవుతోంది” అంది.
చాప్టర్ 5
ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రాత్రింబవళ్బు రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, దృఢత్వము, మృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!” అన్నాడు.
“వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని”అంది.
ప్రసాద్ “నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని” అన్నాడు.
నవ్వుతూ “నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి” అంది.
“నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు.
“ఫలితం గురించి నేనేమీ మాట్లాడలేదు. ప్రయత్నం గురించిమాత్రమే" అంది.
“నన్ను బాగా అర్ధం చేసుకున్నావనుకున్న నువ్వుకూడ నాకన్యాయం చేస్తున్నావు రజని, అలాంటి మాటలు ఎలా అనగల్గుతున్నావు! నిజంగా నీకు నీకు ద్రోహంతలపెడ్తాననుకున్నావా!'' అన్నాడు.
రజని పక పక నవ్వుతూ “ఇన్నాళ్ళకు నీ నోటి వెంట యిలాంటి మాటలు వినే దురదృష్టం కలిగింది. నీమీద నాకు మిగిలిన ప్రేమానురాగాలలో సగం సర్వనాశనమయి పోయాయి. కమల గురించి కలలుకంటూ, రజనివద్ద రహస్యాలు వెల్లడి చేస్తున్నావు. ప్రసాద్ ఇప్పటికయినా మేలుకో” అంది.
ప్రక్కనే కూర్చునివున్న రజనిని హఠాత్తుగా వుద్రేకంతో తన వక్షస్థలం మీదికి లాక్కుని “నీమీద నాకు ప్రేమ నశించిందంటే నేను నమ్మను రజని. అది లేకపోతే నువ్వు నా మీదంత శ్రద్ధాసక్తులతో ఎందుకు సేవ చేస్తావు?” అన్నాడు.
రజని క్షణకాలం మాత్రమే ప్రసాద్ కౌగిలిలో యిమిడివుంది. నెమ్మదిగా పట్టు విడిపించుకుని “నువ్వే కాదు ప్రసాద్, ఆప్తులెవరయినావుంటే ఈవిధంగానే చేద్దును. అయినా మన యిద్దరి మధ్య వున్న బంధం, ఆంగీకారం. యింకాతెగిపోలేదు. అంతవరకు నా ధర్మం యిదే. నీకు స్వస్థత చిక్కినవెంటనే తెగతెంపులు చేసుకొని నిన్ను వదలి వెళ్ళిపోతాను” అంది. మాటలు ఎంతో సహజంగా, మృదువుగా వున్నాయి. వాటిల్లో కోపం గానీ, ఏవగింపు కాని ఏమాత్రము లేవు. భయంకరమైన నిశ్చయం కనబడింది. ప్రసాద్ దానికి తిరుగు లేదని గ్రహించి, “దాని కేమైనా ప్రత్యేక కారణముందా రజని! ఇందులో నా దోషమేమైనా వుందా?
“కారణమేమీ అక్కరలేదని మనము మొదటే అనుకున్నాము, ఉన్నా చెప్పవలసిన అవసరంకూడ లేదు. మన యిద్దరికి పూర్వం వున్న భావాలు యిప్పుడు లేవనీ నీకు తెలుసు. నాకు తెలుసు. ఇది చాలా సహజమైనదనీ, సమంజసమనీ నీకు తెలుసు. ఇందులో విచారించవలసినది కూడ ఏమీ లేదు. సహజీవనం తప్ప మిగిలినవి యథాప్రకారంగానే సాగుతాయి. రజని ఎప్పుడూ ఎవరి సొత్తుగా లేదు. యిక ముందుకూడ ఎవరి సొత్తు కాదు?'' అంది గంభీరంగా.
ప్రసాద్ తన జీవితంలో ఒక ఆధ్యాయం ముగిసిపోయిందని ఆఖరికి గ్రహించాడు. మిగిలినదేదో వదులుకుందామని “మన బంధం విడిపోయినంత మాత్రాన నామీద నువ్వు కక్ష పూనుతావా రజని” అన్నాడు.
“ఆలా నేను చెయ్యలేననికూడ నీకు తెలుసు ప్రసాద్, నా చేత చెప్పిద్దామని అడిగావు. అయినా నేను చెప్పుతాను. నీమీదవున్న ప్రేమానురాగాలు నశించిపోయాయి. గౌరవాభిమానాలు కాదు. అవి సకాలం సజీవంగానే వుంటాయి. అంతే ఇక దీని విషయం ఆపి వెయ్యి” అంది.
ఆనాడు హాస్పటల్ నుంచి తిరిగి వచ్చినప్పటినుంచి కమల మనస్సులో బాధపడసాగింది. తన అసభ్య ప్రవర్తనకు ఎంతో నొచ్చుకుంది. ప్రసాద్ వంటి ఆత్నబలంగల వ్యక్తి, తనను చూడడానికని, అంత బాధతో ఈనాడు బయటకు వచ్చి కన్నీరు కార్చిన దృశ్యం ఆమె హృదయంలో హత్తుకు పోయింది.
కన్నీరును అసహ్యించుకొనే అతనుకూడ కన్నీరు కార్చడంతో అతను ఎంత బాధపడ్డాడో ఆమె గ్రహించింది. ఆవ్యాజమైన కరుణ, జాలి ఉప్పెన వలె పొంగిపొర్లే ఆ అభాగిని హృదయంలో, కమలాకరంతో కలసి ఒక రోజున వుదయం ప్రసాద్ ని చూడటానికి బయలు దేరింది. కాని దారిలో కమలాకరం "ఏదో అర్జంటు పనుంది. ఆఫీసుకి త్వరగా వెళ్లాలి నేను సాయత్రం చూస్తాను నువ్వు వెళ్లు.” అని కమలను హాస్పటల్ వద్ద విడిచి వెళ్ళిపోయాడు. కమల “నేను కూడ సాయంకాలమే వెళ్తాను” అంది.
కమలాకరం భార్యను మందలించి ఇంతదూరంవచ్చి వెనుకకు వెళ్ళవలసిన అవసరం యేమిటి! రజనికూడ లోన వుంటుంది. ఆమె రోగిని వదలి ఒక్క క్షణంకూడ వుండదు” అన్నాడు.
అయిష్టంగానే కమల లోనికి వెళ్ళింది. రజని లోపల వుండేటట్లు అనుగ్రహించమని వెయ్యి దేవుళ్ళను ప్రార్థించింది మనస్సులో.కాని ఆమె ప్రార్థన పెడచెవినపడింది. తలుపు తెరచి వుంది. రజని గదిలో లేక పోవడం గమనించి వెనుకకు పోదామనుకొనే సమయంలో ప్రసాద్ ఆమెని చూసాడు, క్షణకాలం దిగ్భ్రాంతుడై పోయాడు. కాని వెంటనే “రా, కమలా! రా” అన్నాడు.
కమల భయవిహ్వలయై లోనికివచ్చి దగ్గరవున్న కుర్చీలో కూర్చుంటూ “నేను కమలాకరం కలిసి వచ్చాము. ఇక్కడకు వచ్చి పనివుందని ఆఫీసుకి వెళ్ళిపోయాడు. రజని యిక్కడ వుంటుందనుకున్నాను” అంది.
ప్రసాద్ నవ్వుతూ “ఈ తడబాటు ఎందుకు కమలా? నువ్వేమి తప్పుపని చెయ్యటం లేదు. నువ్వు యిక్కడకు వచ్చినది నన్ను చూడటానికా లేక రజనిని చూడటానికా?” అన్నాడు.
కమల “రజని కూడ వుంటుందనుకున్నాను. నాకు రాను రాను ఆమెమీద గౌరవాభిమానాలు ఎక్కువవుతున్నాయి. అద్భుత వ్యక్తి విచిత్ర వనిత” అంది అసందర్భంగా.
ప్రసాద్ క్షణకాలం మౌనం వహించి ''కాదని నేననను. కానీ ఆమె అవసరం నాకుతీరిపోయింది కమలా! యింకొకటి అవసరం వచ్చింది” అన్నాడు.
“అవసరం వచ్చినంత మాత్రాన అది తీరుతుందనుకోవడం అవివేకం ప్రసాద్ బాబూ ! వ్యక్తుల దృక్పధాలు వేరైనప్పుడు వ్యక్తుల అభీష్టాలూవేరుగానే వుంటాయి. బాటలు వేరుగానే వుంటాయి, గమ్యస్థానాలు వేరుగానే వుంటాయి” అంది.
“నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమేమోనని సందేహము కలుగుతుంది. లేకపోతే నువ్వానాడు నన్ను అలా అవమానించి వుండేదానివి కాదు. పాషాణ హృదయాన్ని పదిల పరుచుకొని కారులో బయట కూర్చునివుండేదానిని కాదు. తోటి మానవుని యెడ నీ కనీసధర్మాన్ని కూడ ఆనాడు నువ్వు మరచిపోయావు కమలా! దానికి నిన్నెన్నడు నేను క్షమించను, ఆ సంఘటన జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నిన్ను నేను అసహ్యించుకుంటూ వుంటాను” అన్నాడు.ప్రసాద్ “ముఖం క్షణకాలం ఏవగింపుతో నిండిపోయింది.
అది చూసి కమల భరించలేక పోయింది, “మరి మీరు అలా ఎందుకు చేసారు? నామీద కోపం చేతకదా మీరు ఆ అపాయంలో చిక్కుకున్నారు. ఆనాడు మీరు తాజమహల్ వద్ద కనుపించకపోతే నేననుకున్నాను. ఈ విషాద నాటకంలో యిదే నా అంతిమమట్టం. ఈ పాపంకూడ నా మెడకే చుట్టుకుంటుందా? అని. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అయినా వొక విధంగా అలా జరిగితేనే మంచిదేమోననిపిస్తు వుంటుంది అప్పుడప్పుడూ, దానికి నేను పరోక్షంగానే బాధ్యురాలిని, నా కర్తవ్యం నేను నెరవేర్చలేనేమోననే భయం తీరిపోయింది. నా హృదయంలో ఈ భరించలేని బరువూ సహించలేని ఈ చిత్రహింస ఆనాటితో అంతమైపోను. బాధాకరమైన స్మృతి ఒక్కటే ఆఖరకు మిగిలేది”అంది.
కమల తన మరణాన్నికాంక్షిస్తోందని విని ప్రసాద్ లోలోన చాలా భయపడ్డాడు, “నీ పాతివత్యానికి నన్ను బలి చేస్తావా కమలా? ఆది మినహా నీకిక జీవితంలో వేరే కర్తవ్యంథర్మమూ లేదా?” అన్నాడు.
“ఉన్నాయో లేవో నాకు తెలియదు. కాని నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది అదొక్కటే. ఆ ధర్మానికి యితర విధులకీ వైరుధ్యం ఏర్పడితే నేను నా సర్వస్వము వినియోగించి ఆ మొదటి దానినే రక్షించుకుంటాను. ప్రాణప్రదంగా నేను కాపాడుకుంటాను” అంది.
ఆ మాటలు అంటూవుంటే కమల నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి.ఆతీక్షణతని ప్రసాద్ భరించ లేకపోయాడు.
“కమలా! నేను నా జీవితంలో ఇంతవరకు ఓటమిని రుచి చూడలేదు. నన్ను తిరస్కరించిన స్త్రీలు నాకగు పడ లేదు కాని నేను నీ చేతుల్లో ఓడిపోతానేమోనని భయంగా వుంది” అన్నాడు.
కమల ఏదో మాట్లాడుతూ వుంటే లోపలికి ఒక పది మంది యువకులు, వొక యువతి లోనికివచ్చి వినయపూర్వకంగా నమస్కరించారు. యువతి ఎంతో ఆవేదనతోను నమ్రతతోను ముందుకు వచ్చి“మామయ్యా!మీరు ప్రమాదంలోచిక్కుకున్నారని యిప్పుడే మాకు తెలిసింది. అంతా ఎంతో ఆందోళనపడ్డాము, చూడటానికనివచ్చాము, దైవం మమ్మల్ని రక్షించాడు. లేకపోతే ఈ అనాధుల గతి ఏమయ్యేది?”అంది.
పదునెనిమిది సంవత్సరాల యువతి ఆమె. చామన ఛాయ, విశాలనేత్రాలు, అవయవాల్ని విడివిడిగా పరీక్షించి చూస్తే ఏమంత రూపసికాదనిపిస్తుంది. కాని కమలని ఆశ్చర్య పరచినదేమంటే ఆమెలోని సంపూర్ణత్వము శ్రావ్యమైన కంఠ స్వరమూను. మిగతా యువకులంతా అమెకంటే చిన్నవారులా కనబడుతున్నారు. వారంతా కూడా ఎంతో వినియపూర్వకంగా నిలబడియున్నారు.
ప్రసాద్ “ చంద్రికా! నిన్ను చూడాలని యిక్కడకు వచ్చిన పదిరోజులనుంచి నాలో కోరికగా వుంది. కాని మీకుపరీక్షరోజులనీ, యీ విషయం మీకు తెలియకుండావుంటేనే మంచిదని రజని చెప్పింది. అందుకనే కబురు పంపలేదు. నిన్నటితో అన్నీ అయిపోయాయికదా? ఎలా వ్రాసారు?.”
అంతా ఏకకంఠంతో బాగా వ్రాసామన్నారు. అంతవరకు ప్రసాద్ కమల అక్కడ వున్న సంగతే మరచిపోయాడు.అప్పుడది గుర్తించి కమలను వారికి పరిచయం చేసి “వీరంతా అనాథ విద్యార్థులు కమలా! వీరందరినీ నేను పెంచుకుంటున్నాను” అన్నాడు.
కమలకు ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అతి సామాన్యమైన వారిదుస్తులు, వేష భాషలు ఆమెలోని మాతృత్వ అనురాగపు గట్టులు తెంచి వేసాయి.
చంద్రికని ఆప్యాయంగా దగ్గర కూర్చో పెట్టుకొని “చంద్రిక ! చక్కటి పేరు. ఏం చదువుతున్నావు తల్లీ ?” అంది కమల.
“తల్లీ” అనే సంబోధన చంద్రిక కళ్ళల్లోకి కన్నీరు తెచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ “అయిదు సంవత్సరాల క్రితంవరకు నాకు అక్షరజ్ఞానం లేదు. అంతా మామయ్య చలువ. అప్పటినుంచి పట్టుపట్టి చదివించారు. ఈ సంవత్సరమే ఇంటర్ పరీక్షకు వెళ్ళాను, నిన్ననే పరీక్షలయిపోయాయి. వీరంతా కూడా నాలాటి వారే. మా అందరి కోసమని ఒక యిల్లు అద్దెకు తీసుకున్నారు. అన్ని ఖర్చులు వారే పెట్టుకుంటున్నారు. లేకపోతే నాకు బిచ్చమెత్తుకోవటమే గత్యంతరం” అంది.
“ఆ గత్యంతరం లేకుండా ఆదుకునేవారు వారొక్కరే కాదు చంద్రిక ఇక ముందునుంచి. నేను కూడా వున్నానని మరచిపోకు” అంది కమల.
చంద్రిక గద్గదస్వరంతో “అక్క!” అని కమల గాఢాలింగనంలో యిమిడిపోయింది.
“నువ్వదృష్టవంతురాలివి చంద్రికా. కమల ఆదరము, అనురాగము అంత సులభంగా లభించవు. వాటికోసం రాత్రింబగళ్బు, తపస్సు చేస్తున్న వ్యక్తులు చాలమంది వున్నారు. కాని వారికెప్పుడూ అది ఆమడదూరంలోనే వుంటోంది'' అన్నాడు ప్రసాద్.
మాటల అర్థం కమల గ్రహించింది. చంద్రిక గ్రహిస్తుందేమోనన్న భయంతో మాటలు మార్చి “జీవితంలో నీకు మీ మామయ్య నేర్పలేని విషయాలు నువ్వు స్వతహాగా నేర్చుకోలేని విషయాలు చాలా వున్నాయి. వాటిని నీకు స్త్రీ లే నేర్పాలి. అందుకుతగినవ్యక్తి రజనికంటె ఇంకెవ్వరు లేరు. అల్పురాలినైనా అవసరం వస్తే నేను వున్నాను” అంది.
“మామయ్య నా కెప్పుడు ఏవిధమైన బోధనా చేయలేదు. వారు ఏదైనా చెబితే అక్షరాలా పాటిస్తానని వారికి తెలుసు రజని వద్దనే నేను విద్యాభ్యాసం చేసుకున్నాను” అంది.
“అది మంచిదే చంద్రిక! కాని మీ మామయ్య ఎదుట ఇంకొకమాట చెపుతాను. వారు నీతో ఎప్పుడైనా చెప్పేరో లేదో నాకు తెలియదు. కాని వారు చాలాసార్లు అంటూవుంటారు. కృతజ్ఞతకు మన జీవితంలో చోటే లేదు” అని “అది వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుతుంది” అని. నేను జీవితంలో కృతజ్ఞతకు చోటు లేదంటే అంగీకరించను, కాని ఒక విషయం ఎప్పుడూ
Comments (0)