ACP KI PHONE Telugu - SUnkara Bhaskara Rao (philippa perry book .TXT) 📗
- Author: SUnkara Bhaskara Rao
Book online «ACP KI PHONE Telugu - SUnkara Bhaskara Rao (philippa perry book .TXT) 📗». Author SUnkara Bhaskara Rao
ACP KI PHONE
Sunkara Bhaskara Rao
Mahatma Gandhi once said that I will not let anyone walk through my mind with their thirty feet. John Steinbeck once said that “power does not corrupt. Fear corrupts… perhaps the fear of loss of power.” Here is a story about a phone call to ACP that corrects the corruption spreading in the society.
ఆమె చాలా సాధారణంగా ఉంటుంది. సగటు మనిషి ఎలా ఉంటుందో అలా. ఆమె పేరు అమల. అమల అంటే ఎవరికీ తెలియదు. ఆమెని చూస్తే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. గుర్తు పట్టేలా ఉంటాయి ఆమె పనులు. గుర్తు పట్టేలా ముద్ర వేయాలని ఆమె అనుకోదు, కాని ఆమె పనులతో ఆమె ముద్ర జనం మీద పడుతూ ఉంటుంది.
అందరిలా అమల ఆ షాపులోకి కొన్ని సామానులు కొనటానికి వెళ్లింది. డబ్బు ఇచ్చి చిల్లర కోసం ఎదురు చూసింది. “చిల్లర లేదు.” కౌంటరులోని వ్యక్తి నిర్లక్యంగా అన్నాడు.
ఆ తరువాత, తన బాధ్యత తీరిపోయినట్లు తరువాత వ్యక్తికి బిల్లు వేస్తున్నాడు. “చిల్లర లేదంటే ఎలా? నీ దగ్గర చిల్లర కనిపిస్తూనే ఉంది.” అంది అమల.
“లేదంటున్నాను కదా! వెళ్లమ్మా, పెద్ద బేరం కొన్నావులే.” కౌంటరులోని వ్యక్తి మరింత నిర్లక్యంగా అన్నాడు.
అమలకి కోపం తారా స్థాయికి చేరుకుంది. “చిల్లర లేకపోతే నీ సామాను నాకు వద్దు. నీ సామాను తీసుకుని నా డబ్బు తిరిగి ఇచ్చెయ్యి! ”అంది అమల.
“బిల్లు వేసాక సామాను వెనక్కితీసుకోబడదు.” కౌంటరులోని వ్యక్తి ఏమి చేసుకుంటావో చేసుకో అన్నట్లు మరింత నిర్లక్యంగా అన్నాడు. “అయితే నేను ఎసిపికి ఫోన్ చేయక తప్పదు. ”అంది అమల.
“ఏమిటమ్మా బెదిరిస్తున్నావా? తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదిరినట్లు మేము బెదరము. ఏమి చేసుకుంటావో చేసుకవమ్మా! “
కౌంటర్లో కూర్చున్నది ఆ షాపు యజమాని యాదగిరి. కాస్త మొరటు మనిషి. బాగా సంపాదిస్తున్నాడు. చిల్లర ఎగ్గొట్టడంలోనే అతనికి రోజూ కొన్ని వేలు మిగులుతుంది.
అమలకి కోపం మరింత పెరిగింది.
అక్కడ గోడకి పెద్ద మేకు కొట్టి, దానికి ఆ షాపు యజమానిని వేలాడదీసి, క్రింద ఇతడు చిల్లర ఇవ్వడు అని పెద్ద పెద్ద అక్షరాలలో రాయించాలన్నకోరిక ఆమెలో కలిగింది.
అమల మొబైల్ తీసింది. ఎవరికో ఫోన్ చేసింది. “ఏమిటి నిజంగానే ఎసిపికి ఫోన్ చేస్తున్నావా? వాళ్లకంత తీరిక ఉండదమ్మా. ఇంటికెళ్లి ఫోను నిదానంగా చేయమ్మా తల్లీ!“ యాదగిరి పరిహాసంగా చూస్తూ అన్నాడు.
చిల్లర కోల్పోయిన మరికొందరు అక్కడ మౌనంగా నిలబడి అమలవైపు ఆశగా చూసారు. వాళ్లకి యాదగిరి మీద పీకలదాకా కోపం ఉన్నా ఏమీ చేయలేక ఇన్నాళ్లూ సహిస్తున్నారు. ఇవాళ ఆ సంగతి తేలుచకోవాలని వాళ్లూ ఎదురు చూస్తున్నారు.
కాస్సేపటిలో ఎసిపి రామచంద్రరావు జీప్ అక్కడ ఆగింది. అందరి దగ్గరా కంప్లైంట్ తీసుకున్నారు. ఎవరికి ఇవ్వల్సిన చిల్లర వాళ్లకి ఇచ్చేసారు. యాదగిరిని జీప్ లో కూర్చోబెట్టారు. దుకాణంకి తాళాలు పడ్డాయి. అందరూ అమల వైపు ఆరాధనగా చూసారు. అమలకి ఆనందంగా ఉంది. ఓ చీడపురుగుని ఏరి పారేసినందుకు.
*****
ఆమె యాదమ్మ. వాళ్లాయన సిటీ బస్సు డ్రైవరు. గంపెడు పిల్లలు, బండెడు సంసారం. కష్టంగా ఈదుకొస్తున్నారు ఆ దంపతులు.
ఆమల ఉండే వీధిలోనే యాదమ్మ ఉంటుంది. యాదమ్మ అమల దగ్గరకి వచ్చి నీళ్లు నములుతున్నది. ఏమైనా డబ్బు అవసరం వస్తే యాదమ్మ అలాగే చేస్తుంది.
“ఏమిటి యాదమ్మా, డబ్బులు ఏమైనా కావాలా?” అమల అడిగింది
“డబ్బులొద్దమ్మా, నీ సాయమే కావాలి. ” అంది యాదమ్మ.
యాదమ్మ కూతురు నిర్మల మంచి మార్కులతో ప్లస్ టూ పాసయ్యింది. కాలేజిలో చేర్చాలంటే పదివేలు డొనేషన్ కట్టాలని కాలేజి ప్రిన్సిపాల్ ఖచ్చితంగా చెప్పేసింది. యాదమ్మ భర్త అన్ని లోన్లు వాడేయటం చేత ఎక్కడా అప్పు పుట్టే అవకాశం అతనికి లేదు. అమలని అడిగితే ఇస్తుంది. కాని డోనేషన్ అంటే ఇవ్వదు. అందుకే డబ్బు అనకుండా సాయం అని అంది.
“యాదమ్మా, నీ తెలివికి మెచ్చాను. అప్పుల్లో కూరుకు పోకుండా నీ తెలివి నీకు సాయమే చేస్తుందిలే. పద. ”
యాదమ్మ, నిర్మలని తీసుకొని అమల ఆ కాలేజికి వెళ్లింది. అరగంట అయ్యాక ప్రిన్సిపాల్ దర్శనం అయ్యింది.
“యాదమ్మా, డొనేషన్ కట్టకపోతే కుదరదని చెప్పాను కదా! ఈవిడెవరు?” అంది ప్రిన్సిపాల్.
“వాళ్లు డొనేషన్ కట్టలేరమ్మా! అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి కదా? సీటివ్వండి అమ్మా!” అంది అమల.
“మా రూల్సు వోప్పుకోవు. ఇంతకీ మీరెవరు?” అంది ప్రిన్సిపాల్.
“నేనూ మీలాంటి దానినే. ఇరుగుపొరుగుని. ” అంది అమల. “అలాగా, ఇరుగుపొరుగు మాటలు వింటే మా కాలేజిని మేము మూసుకోవాలి. ” అంది ప్రిన్సిపాల్.
అమల ఎంత బ్రతిమాలినా ఆమె అంగీకరించలేదు. అమల ఎసిపికి ఫోన్ చేసింది.
ఎసిపిని చూడగానే ప్రిన్సిపాల్ కాస్త కంగారు పడింది. అతనికి ముఖ్య మంత్రితో చాలా దగ్గర సంబంధం. ఆ విషయం ఆమెకి బాగా తెలుసు.
“యాదమ్మ మా వీధిలోనే ఉంటుంది. మీరు ఈ సహాయం చేస్తే మీ కాలేజీకి మంచి పేరు వస్తుంది కూడా. అమల మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నది. ” అని ఎసిపి రామచంద్రరావు అమలని ఆమెకి పరిచయం చేసాడు.
“ఆమె మీ గురించి చెప్పలేదు. లేకపోతే ఈ పని కోసం మీరు ఇక్కడివరకు రావలసి వచ్చేది కాదు. ”అంది ప్రిన్సిపాల్ చాలా గౌరవంగా.
నిర్మలకి సీటొచ్చింది. యాదమ్మ మనసు కుదుటపడింది. అమల సంతోషించింది.
*****
అమలకి ఏమి చేయాలన్నా ఎసిపి రామచంద్రరావు సహాయం వెంటనే దొరుకుతున్నది. కారణం ఆమె ఎసిపి భార్య.
ఆరోజు డైనింగ్ టేబుల్ దగ్గర అమల రామచంద్రరావు మధ్య ఒక చిన్న సంభాషణ ఇలా జరిగింది- “ నాకు ఒక్కొక్కసారి సందేహం వస్తుంది – నేను నీకు సేవ చేసుతన్నానా లేక ప్రభుత్వానికా అని. ” అన్నాడు ఎసిపి.
“నాకు కాదు, మీరు చేస్తున్నసేవ ప్రజలకు. కాబట్టి ప్రభుత్వానికి సేవ చేస్తున్నట్లే. ” అంది నవ్వుతూ అమల.
“నేను నీ ఫోన్లో లేక పోతే?” నవ్వుతూ అడిగాడు ఎసిపి.
“మంచి మనసుతో పాటు అధికారం బలం కూడా ఉన్నవారు తమరొక్కరేనా? మీరు కాకపోతే మరొకరు దొరికేవారు.”
“ఎసిపి కాకపోతే ఏకంగా ఏ ప్రెసిడెంటో, పిఎమ్మో... ఎవరికి తెలుసు చిన్న చీమ కూడా ఏకంగా సింహమే కావచ్చు కదా!” అన్నాడు రామచంద్రరావు నవ్వుతూ.
“ముందు భోంచేయండి. మాటలు తర్వాత. ” అంది చిరుకోపంతో అమల.
_The End_
ImprintText: Sunkara Bhaskara Rao
Images: -
Editing: Sunkara Bhaskara Rao
Translation: -
Publication Date: 06-27-2015
All Rights Reserved
Comments (0)