bookssland.com » Fiction » PARUVUNASHTAM TELUGU - BR Sunkara (i can read books txt) 📗

Book online «PARUVUNASHTAM TELUGU - BR Sunkara (i can read books txt) 📗». Author BR Sunkara



PARUVUNASHTAM TELUGU

 

 

PARUVUNASHTAM TELUGU

(A Slander by Anton Chekhov ) 

 

రష్యన్ కథానిక


పరువునష్టం

 

అంటోన్ చెకోవ్

 

తెలుగు: బిఆర్ సుంకర

 

సెర్జీ కేపిటోనిచ్ అహినీవ్ చేతివ్రాత మాస్టరు. చరిత్ర-భూగోళం మాస్టరుతో అతడు తన కూతురి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి వేడుకలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. అందరు కూర్చునే గది ఆటపాటలు, పెళ్లి సండడితో అదిరిపోతుంది. క్లబ్ నించి బాడుగకొచ్చిన పనివాళ్లు నల్ల స్వాలోటైల్స్ మరియు మురికిగావున్న తెల్ల టైస్ తో గదుల్లో హడావుడిగా తిరుగుతున్నారు. ఆహూతుల అంతులేని సంభాషణలతో ఆ గదుల్లో చెప్పలేనంత సందడి నిండి ఉంది. పక్కపక్క సోఫాల్లో కూర్చున్న లెక్కల మాస్టరు, ఫ్రెంచ్ టీచర్, జూనియర్ టాక్స్ అసెసర్ ఒకరి మాటలకొకరు అడ్డువస్తూ మహోత్సాహంతో సంభాషణ కొనసాగిస్తున్నారు. బ్రతికుండగానే మనుషుల్ని పాతిపెట్టే కేసులని వర్ణిస్తూ, ఆత్మల గురించి తమ అభిప్రాయాలు వివరిస్తున్నారు. ఆత్మలున్నాయని నమ్మకపోయినా, ప్రపంచంలో మనిషికి అర్థం కానివి చాలా వున్నాయని మాత్రం అందరూ వొప్పుకున్నారు. ఆ తర్వాత గదిలో సాహిత్యం ఉపాధ్యాయుడు ఆగంతుకులతో, వచ్చేపోయేవారి మీద తుపాకితో కాల్చే హక్కు కూడా సెంట్రీకి ఉంటుందని కొన్ని కేసుల ఉదాహరణలతో సహా వివరిస్తున్నాడు. ఈ విషయాలు భయోత్పాదకమైనవే, అయినా కాదనటానికి వీలు లేనివని అంగీకరించాలి. సాంఘిక హోదా లేక, లోపలకి ప్రవేశం మూసివేయబడినవారు దూరం నించే కిటికీల్లోంచి లోపలకి చూస్తున్నారు.

 

అర్ధరాత్రి అవబోతోంది. ఆ ఇంటి యజమాని భోజనాలకు అన్నీ సవ్యంగా వున్నాయో లేదో చూడాలని వంటింటిలోకి వెళ్లాడు. వంటిల్లు నేల నుంచి పైకప్పు వరకు బాతులు, నీటిబాతులు, చేపలు, ఇంకా ఇలా చాలా వంటకాల వాసనలతో నిండి ఉంది. రెండు టేబుళ్ల మీద అనేక పాత్రలు, పానీయాలు, తేలిక తినుబండారాలు అన్నీ కళాత్మకత లేక అస్తవ్యస్తంగా పేర్చి ఉన్నాయి. వంట చేస్తున్న మార్ఫా ముఖం ఎర్రగా, అందంగానే ఉంటుంది, అయితే భారీ శరీరంతో, పీపాకి బెల్టు బిగించినట్లు ఉంటుంది.
“మార్ఫా! వంటల ఘమఘమలు నా నోరూరిస్తున్నాయి. వంటిల్లు మొత్తం నేనే తినేస్తానేమో అని అనిపిస్తుందనుకో! స్టర్జన్ చేపనోసారి మూతతీసి చూపించు.” అహినీవ్ చేతులు రుద్దుకుంటూ, పెదాలు చప్పరిస్తూ అడిగాడు.

 

మార్ఫా అక్కడున్న బల్లల దగ్గరకి వెళ్లి, జాగ్రత్తగా ఒక గ్రీజీ న్యూస్ పేపర్ని పైకి తీసింది. ఆ పేపరు క్రింద ఉన్న అద్భుతమైన డిష్ కనిపించింది. జెల్లీ మాస్క్ క్రింద కేపర్ మొగ్గలు, ఆలివ్స్ మరియు క్యారట్స్ అలంకరణతో పెద్ద స్టర్జన్ చేప ఒకటి కనిపించింది. అహినోవ్ ఆ స్టర్జన్ చేపని ఆకలితో చూసి, ఆశ్చర్యాన్ని నోరు వెళ్లబెట్టాడు. అతడి ముఖం వెలిగిపోయింది. కళ్లు పైకెత్తి, కొంచెం ముందుకొరిగి, పెదాలు చప్పరిస్తూ గ్రీజులేని చక్రంలా పెద్ద చప్పుడు చేసాడు. ఒక క్షణం ఆగి, ఆనందంతో చప్పట్లు చరిచాడు. మరోసారి పెదాలు చప్పరిస్తూ పెద్ద చప్పుడు చేసాడు.

 

“భలే ముద్దు! అందాల వంటమనిషి మార్ఫాని ముద్దాడుతున్నావా?” అని పక్క గదిలోంచి వినిపించింది. అప్పుడే అందమైన క్రాపుతో సహాయ ఉపాధ్యాయుడు వెంకిన్ తలుపు దగ్గర అహినీవ్ కి కనిపించాడు.

 

“ఎవరది? అహ్హా! మిమ్మల్ని కలవటం నాకు ఆనందంగా ఉంది! సెర్జీ కేపిటోనిచ్! మీరు భలే తాతగారు!” అని నవ్వుతూ అన్నాడు వెంకిన్.

 

“నేను ముద్దు పెట్టుకోడం లేదు... ఫూల్! నేను.. నేను.. నా పెదాలే చప్పరించాను... అంతే! ఈ చేప గొప్పగా వుందన్న ఆనందంలో ... నా పెదాలే చప్పరించాను. అంతేనోయ్!”అన్నాడు అహినీవ్.

 

“అయితే ఆ సంగతి ఆ చేపకే చెప్పండి” అని గలగలా నవ్వుతో వచ్చినట్టే క్షణంలో మాయమైనాడు.

 

అహినీవ్ సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు.

 

“వెధవని ఉరితీసెయ్యాలి. వాడు అందరి దగ్గరా దీన్ని కథలల్లి చెబుతాడు, నా పరువు తీస్తాడు. ఇక టౌనంతా నా గురించే మాట్లాడుకుంటుంది! ఇప్పుడెలా?” అహినీవ్ కంగారుగా ఆలోచించ సాగాడు.


అహినీవ్ భయపడుతూ మధ్య గదిలోకి వచ్చి, గోప్యంగా వెంకిన్ కోసం వెదికాడు. వెంకిన్ పియానో దగ్గర నిలబడి, కుర్రకారు పోజుతో క్రిందకి వొరిగి, ఇన్ స్పెక్టర్ వదినతో ఏదో గుసగుసలాడుతున్నాడు, ఆమె నవ్వుతూ ఉంది.

 

‘వెధవ... నా గురించే చెబుతున్నాడు! నా గురించే! కాల్చిపారెయ్యాలి! ఆవిడ నమ్ముతున్నది! ... అందుకే నవ్వుతున్నది! దేవుడా, నన్ను కాపాడు! కుదరదు, దీన్ని వ్వాపించనీయగూడదు... కూడదు, దీన్ని ఆపటానికి నేనేదైనా చెయ్యాలి! ... దీని గురించి నేనే అందరికీ చెబుతాను. అప్పుడు ఆ వెధవ మాటలు ఎవరూ నమ్మరు. వదంతులకి సమాధానం ఉండాలి’ అనుకున్నాడు అహినీవ్.

 

అతడు తల గోక్కున్నాడు, సిగ్గుతో ముడుచుకుపోతూ ఫ్రెంచ్ టీచర్ దగ్గరకి వెళ్లాడు. అతడితో అన్నాడు, “ నేను వంటకాలెలా ఉన్నాయో చూడాలని వంటింటిలోకి వెళ్లాను. మీకు చేపలంటే ఇష్టమని నాకు తెలుసు. అన్నిటి కంటె మిన్నగా ఉండే స్టర్జన్ చేపని మీకోసం వండించాను! అహ్హహ్హా! నేను చెప్పడం మరిచాను... ఇప్పుడే వంటింట్లోకి... ఆ స్టర్జన్ చేప కోసం... చిన్న కథ... ఆ స్టర్జన్ చేపని చూసి.. పెదాలు చప్పరించాను... అంతే! అప్పుడే ఆ ఫూల్ వచ్చి ‘భలే ముద్దు! అందాల వంటమనిషి మార్ఫాని ముద్దాడుతున్నావా?” అని అడిగాడు. అల్లరి వెధవ! ఆమె భయపడిపోతుంది, జంతువులన్నీ తన మీద ఉరికినట్టు! ముద్దట...ముద్దు! పిచ్చి మొద్దు!”

 

“ఎనరా పిచ్చి మొద్దు?” అని మధ్యలోకి దూరి లెక్కల మాస్టరు అడిగాడు.


“ఎవరా? వాడే! నేను వంటింట్లోకి వెళ్లానా.. అప్పుడా మొద్దు... ఆ పిచ్చి మొద్దు...”


మాటలు మింగేసాడు.


“కుక్కనైనా ముద్దు పెట్టుకుంటాను కాని, నేను మార్ఫానెందుకు ముద్దాడతాను? ” అంటూ అతడు చుట్టూ తిరిగి, తన వెనకనున్న జూనియర్ టాక్స్ అసెసరుని చూసాడు.
“వాడు వంటిట్లోకి వచ్చాడా? నా పక్కన నిలబడ్డ మార్ఫాని చూసాడా? అంతే, పిచ్చి మొద్దు... వెంటనే ఏవేవో ఊహించేసుకుని... కథలు అల్లి, ‘వంటమనిషి మార్ఫాని ముద్దాడుతున్నావా?’ అని నన్ను అడుగుతాడా! పిచ్చి మొద్దు... పిచ్చి మొద్దు... మార్ఫా కంటె ఒక టర్కీ కోడిని ముద్దాడటం నా కిష్టం! నాకూ నా భార్య ఉంది...వాడికి నోరెలా వచ్చింది ఇలా అభాండం వేయటానికి!!”


“ఎవరు వాడు?” స్కూల్ లో బైబిల్ బోధించే ప్రీస్ట్ అహినీవ్ దగ్గరకి వచ్చి అడిగాడు.


“మీకు చెబుతున్నాను కదా! నేను వంటింట్లో నిలబడి గమఘమలాడే ఆ స్టర్జన్ చేపని చూసి... పెదాల చప్పుడు చేసాను.. అంతే.. వాడు..”


మాటలు మింగేసాడు.


వచ్చిన అతిథులందరికి... అరగంటలో అహినీవ్- స్టర్జిన్ ఉదంతం అర్థమైపోయింది.

 

వెంకిన్ పేరు అహినీవ్ నోటి నుంచి రాలేదు. కాబట్టి అతడు అహినీవ్ మీద ప్రత్యక్ష దాడికి దిగలేదు.


‘వడెంతైనా చెప్పుకోనీయ్...ఇక ఎవరూ వాడి మాటలు నమ్మరు...నమ్మరు గాక నమ్మరు!’ అనుకున్నాడు అహినీవ్ తృప్తిగా.

 

‘ఇక చాలు...ఆపరా వెధవా! మాకు అంతా తెలుసు! ’ అని అంటారు...

 

ఈ ఆలోచనతో అహినీవ్ సంతోషించాడు.


ఈ ఆనందంలో అహినీవ్ ఆ రాత్రి పార్టీలో నాలుగు గ్లాసులు ఎక్కువే తాగాడు. కొందరు కుర్రాళ్లు అతన్ని మోసుకొచ్చి బెడ్ రూమ్ లో పడుకోబెట్టారు. ఆ రాత్రి అహినీవ్ పసిపాపలా హాయిగా నిద్ర పోయాడు. మర్నాటికి స్టర్జన్ సంఘటనని అందరూ మర్చిపోతారని అతడు ఆశించాడు. కాని, మై గాడ్! మనిషి ఒకటి తలిస్తే దేవుడు మరొకటి చేస్తాడంటారు. అలాగే జరిగింది. నరంలేని నాలుకకి వదంతులే ప్రాణం. అహినీవ్ తీసుకున్న ముందు జాగ్రత్తలు ఫలించలేదు.

 

సరిగ్గా ఒక వారం తర్వాత, ఖచ్చితంగా చెప్పాలంటే, బుధవారం మూడో పాఠం ముగిసిన తర్వాత – టీచర్స్ రూమ్ మధ్య అహినీవ్ నిలబడి ఉన్నాడు, విసేకిన్ అనే పిల్లవాడి విషభావాల స్వభావం గురించి చెప్పటానికి. హెడ్ మాస్టర్ ఆ పిల్లాడిని వదిలి, అహినీవ్ ని పక్కకి తీసుకెళ్లారు. ఆపై చీవాట్ల పర్వం ఇలా మొదలు పెట్టారు:


“చూడు సెర్జీ కేపిటోనిచ్ అహినీవ్! నన్ను మన్నించు... ఇది నా పని కాదు, అయినా నీవు తెలుకోవాలని చెబుతున్నాను... చెప్పటం నా బాధ్యత. చూడు, నువ్వు ఆ వంటమనిషితో ప్రేమలో పడ్డావని వదంతులు వినిపిస్తున్నాయి... ఆ విషయంతో నాకేమీ సంబంధం లేదు.... ఆమెతో నువ్వు సరసాలాడు, ముద్దులు పెట్టుకో, మరేదేనా చేయ్య...అది నీ ఇష్టం. కాని దాన్ని బాహాటంగా ప్రచారం మాత్రం చెయ్యకు. ఇది నా సలహా, నువ్వొక స్కూలు మాస్టరివి. కేరక్టర్ నిర్మించే బాధ్యతున్న ఒక మాస్టరివి.”
అహినీవ్ సిగ్గుతో తల వంచుకున్నాడు, నిశ్శబ్దంగా, నిరుత్సాహంగా. తేనెటీగల గుంపు దాడి చేసినట్టు, సలసల కాగే నీళ్ల బిందెని నెత్తిన బోర్లించినట్టు. ఇంటికి తిరిగి వస్తుండగా అందరూ తననే చూస్తూ నవ్వుతున్నట్లు అనిపించింది. ఇంటి దగ్గర మరో ప్రమాదం సిద్ధంగా ఉంది.


“సరిగ్గా తినటంలేదేం? నీ రహస్య ప్రేయసి గుర్తొచ్చిందా? మార్ఫా కోసం నీ గుండె పొంగి పొర్లుతుందా? నాకు అన్నీ తెలుసు. ఇరుగు పొరుగువాళ్లంతా నీ భాగోతం గురించే మాట్లాడుకుంటున్నారు... ముదనష్టపోడా! ”

 

భార్య తాండవ రూపం దాల్చి, చెంప వాయించింది. అహినీవ్ తినకుండా లేచి నిలబడ్డాడు, కాళ్ల క్రింద నేల కృంగిపోతున్నట్టనిపించింది. నెత్తి మీద టోపి, ఒంటిమీద కోటు లేకుండానే వెంకిన్ ఇంటికి వెళ్లాడు. వెంకిన్ అతన్ని ఆశ్చర్యంగా చూసాడు.

 

“వెధవా! టౌనంతా నన్ను అసహ్యించుకొనేలా ఎందుకు చేసావు? నా గురించి వదంతిని ఎందుకు వ్యాపింపజేసావు” అని కోపంగా అహినీవ్ అడిగాడు.


“ఏం వదంతి? మీరంటున్నది దేని గురించి?” వెంకిన్ అయోమయంగా చూసాడు.


“మార్ఫాని నేను ముద్దు పెట్టుకున్నానని వదంతి పుట్టించింది ఎవరు? నువ్వు కాదా? నువ్వే కదా? దొంగవెధవా! ” అహినీవ్ కోపంగా అరిచాడు.


వెంకిన్ అయోమయంగా, అసహనంగా, ఆవేశంగా అహినీవ్ ముఖంలోకి చూసాడు.


“అయ్యో! అయ్యయ్యో! మీ గురించి నేను ఒక్క మాట మాట్లాడిఉన్నా దేవుడు నన్ను క్షమించండు. నన్నునిలువునా పాతేయాలి, నా కళ్లు పీకేయాలి, నన్ను ఇల్లు వాకిలి లేని బికారిగా చేసేయాలి. కలరా కంటె భయంకరమైన రోగంతో నేను చావాలలి...” అని వెంకిన్ నిష్కల్మషంగా అన్నాడు. అతడికి అహినీవ్ అంటే అపారమైన గౌరవం. ఈ అప్రతిష్టకి అతడు కారణం కానే కాదు.

 

“అయితే ఎవరు?”

 

అహినీవ్ ఆశ్చర్యంలో జరిగిందంతా నెమరు వేసుకున్నాడు. అంతే! గుండెలు బాదుకున్నాడు.


    “ఈ పరువునష్టానికి కారణం ఎవరు?”

Imprint

Images: Sunkara Bhaskara Rao
Publication Date: 09-02-2017

All Rights Reserved

Free e-book «PARUVUNASHTAM TELUGU - BR Sunkara (i can read books txt) 📗» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment