TERICHINA KITIKI (Telugu) BR Raksun - Hector Hugh Munro (story read aloud .txt) 📗
- Author: Hector Hugh Munro
Book online «TERICHINA KITIKI (Telugu) BR Raksun - Hector Hugh Munro (story read aloud .txt) 📗». Author Hector Hugh Munro
ఇంగ్లండ్ కథ
తెరిచిన కిటికీ (తెలుగు)
సాకి
అనువాదం:
సుంకర భాస్కర రావు
"నటెల్ గారూ, కూర్చోండి. మా ఆంటీ కాసేపటిలో వస్తుంది, ఈ లోపల మీ వివరాలు నాకు చెప్పవచ్చు" చురుగ్గా కనిపిస్తున్న, పదిహేనేళ్లైనా దాటని ఆ అమ్మాయి మాటలలో గొప్ప ఆత్మవిశ్వాసం తొంగిచూసింది.
ఆమె ఆంటీ గారి గౌరవానికి భంగం కలగకుండా, ఆ చిన్నారి మేనకోడల్ని పొగుడుతూ ఫ్రాంటన్ నటెల్ తన వివరాలన్నీ చాలా కరెక్ట్ గా చెప్పటానికి ప్రయత్నించాడు. తనకు బొత్తిగా తెలియని కొత్తవాళ్ల దగ్గర ఉంటూ, తాను తీసుకోబోయే ‘నరాల చికిత్స’ ఎంతవరకు విజయవంతంగా కొనసాగుతుందా అన్న సందేహం మాత్రం ఒకసారి అతని మనసులో కదం తొక్కింది.
పల్లె వాతావరణం కోసం తను ఈ ఊరికి వెళ్లటానికి సిద్ధపడ్డాడు. అక్క తనని ఓదార్చుతూ అంది, "అక్కడ నీకు ఎలా ఉంటుందన్నది నేను ఊహించగలను. నీతో మాట్లాడటానికి ఎవరూ దొరక్కపోవచ్చు. నీ మనసు ఒంటరితనంతో వికలం కావచ్చు. అందుకే అక్కడ నాకు తెలిసిన అందరికీ నీ గురించి పరిచయం చేస్తూ, ఈ ఉత్తరాలు రాసి ఇస్తున్నాను. నాకు తెలిసినంత వరకు లేదా గుర్తున్నంత వరకు అక్కడ కొందరు చాలా మంచివాళ్లు ఉన్నారు. "
ఆ పరిచయ ఉత్తరాల్లో ఒకటి తీసుకోబోతున్న ఈ ఇంట్లోని మిసెస్ సాపిల్టన్ ఆ ‘మంచివాళ్ల గ్రూపు’లోకి వస్తుందా లేదా అన్నది ఒక్కటే ఫ్రాంటన్ మనసులో కదులుతున్న ప్రస్తుత ఆలోచన.
"ఇక్కడవాళ్లు మీకు చాలా మంది తెలుసా సార్?" ఆ మేనకోడలు వివరాలు అడిగింది.
ఇది చాలా ముఖ్యమైన ఒక గడసరి ప్రశ్న. ఇంత ముఖ్యమైన సమాచారం అందుకునేందుకు, ఆమెకి మరియు అతనికి మధ్య కొన్ని నిశ్శబ్ద క్షణాలు గడిచాయి.
"అబ్బే, ఒక్కరు కూడా లేరు. మా అక్క కొన్నాళ్లు ఇక్కడ రెక్టరీలో ఉండేది, అదీ నాలుగేళ్ల క్రితం. ఆమె ఇక్కడ ఉండే కొందరికి నన్ను పరిచయం చేస్తూ కొన్ని ఉత్తరాలు ఇచ్చింది." అన్నాడు ఫ్రాంటన్.
చివరి సంగతి చెప్పేటప్పుడు అతని గొంతులో నీరసం, విచారం కనిపించాయి.
"అంటే, మీకు మా ఆంటీ గురించి బొత్తిగా ఏమీ తెలియదన్నమాట?" ఆ అపార ఆత్మవిశ్వాసపు అమ్మాయి తన విచారణను మరింత ముందుకి కొనసాగించింది.
"ఆమె పేరు, చిరునామా తప్ప నాకు ఇంకేమీ తెలియదు" ఆ అపరిచిత అమాయకప ఆగంతకుడు నిజాన్ని నిరభ్యంతరంగా అంగీకరించాడు. మిసెస్ సాపిల్టన్ వివాహితే కదా, ఆమె వితంతువు గాని అయివుంటుందా అని అతడు ఆలోచిస్తున్నాడు. ఆ గదిలో ఏదో చెప్పడానికి వీలుకాని, ఒక్క మగపురుగు కూడా లేని పరిస్థితి ఎందుకు ఉందా అని అతడికి సందేహం వచ్చింది.
"మా ఆంటీ ఈ భయంకరమైన దుర్ఘటనని మూడేళ్ల క్రితం ఎదుర్కొంది. మీ అక్క ఉండగానో లేదా ఆమె వెళ్లిపోయాకనో కావచ్చు." అని చల్లగా చెప్పింది మేనకోడలు.
"ఆమెకి దుర్ఘటనా?" ఫ్రాంటన్ ఆశ్చర్యంగా అడిగాడు.
ఈ ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో దర్ఘటనలకి తావు లేదని అతని అపార విశ్వాసం.
"ఈ అక్టోబర్ మధ్యాహ్న సమయంలో ఈ కిటికీని ఎందుకు తెరిచి ఉంచామని మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు కదా?" ఆ మేనకోడలు అడిగింది, బయట మైదానాన్ని విశాలంగా చూపిస్తున్న ఆ గదిలోని తెరిచిన కిటికీ వైపు చూస్తూ.
"సంవత్సరం మొత్తంలో ఈ సమయం చాలా వెచ్చగా ఉంటుంది. ఈ కిటికీకి ఆ దుర్ఘటనకి ఏమైనా సంబంధం ఉందా?" అని ఫ్రాంటన్ ఆశ్చర్యంగా అడిగాడు.
"మూడేళ్ల క్రితం ఒక రోజున, మా ఆంటీ భర్త అంటే మా అంకుల్ మరియు ఆమె ఇద్దరు యువ సోదరులు హాల్ లోని డోర్ వరకు వెళ్లక, ఈ కిటికీలోంచే పగలు షూటింగ్ కి వెళ్లారు. ఈ కిటికీలోంచి వెళ్లటం రావటం వాళ్లకి మామూలే. షూటింగ్ కి వెళ్లిన వాళ్లు తిరిగి రానేలేదు. షూటింగ్ మూర్ ని దాటి, వాళ్లకి ఇష్టమైన షూటింగ్ మైదానం లోనికి వెళ్లే సమయంలో, ఒక ఊబి నీటి గుంట ఆ ముగ్గురినీ నిర్దాక్షిణ్యంగా మింగేసింది. అది భయంకరమైన వేసవిలోని ఒక చలి రోజు. మిగతా రోజుల్లో సురక్షితంగా ఉండే ఆ రోజులలో ఈ రోజు మాత్రం అకస్మాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా ప్రమాద ఘంటికలు మోగించింది. వాళ్ల శరీరాలు దొరకలేదు. ఆ దుర్ఘటనలో ఇదొక భయంకరమైన సంగతి." ఇది చెబుతూ ఉండగా ఆ చిన్న పిల్ల గొంతుకలో ఆమెలోని ఆత్మ విశ్వాసం లోపించింది. ఆ స్వరంలో ఆ క్షణం అపార మానవత్వం తొణికిసలాడింది.
"పాపం మా ఆంటీ వాళ్ల కోసం రోజూ వాళ్లు తిరిగి వస్తారన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్లు గాని, వాళ్లతో వెళ్లిన చిన్న బ్రౌన్ స్పానియల్ కుక్క గాని క్షేమంగా వెళ్లిన ఈ కిటికీలోంచే తిరిగి వస్తారని మా ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే బాగా చీకటి పడే వరకు ప్రతి రోజూ ఈ కిటికీని తెరచి ఉంచటం జరుగుతూ ఉంది. పాపం ఆంటీ రోజూ వాళ్లాయన తెల్లని వాటర్ ప్రూఫ్ కోటు భుజాన వేసుకుని ఎలా వెళ్లిందీ, ఆమె తమ్ముడు రొన్నీ ఆమెని రోజూలా ఆటపట్టిస్తూ 'బెర్టీ, వై డు యు బౌండ్?' అని పాడుకుంటూ వెళ్లిందీ నాకు చెబుతూ ఉంటే, నా గుండె తరుక్కు పోతూ ఉంటుంది. ఇలా చెప్పేటప్పుడు ఆమె చాలా విచారంగా మారిపోతుంది. సరిగ్గా ఇలాంటి సాయింత్రాలలోనే. వాళ్లు నిజంగానే ఈ కిటికీలోంచి లోపలకి నడుచుకుంటూ వస్తున్నట్లు నాకు మనసులో అనిపిస్తూ ఉంటుంది..."
ఆ మేనకోడలు ఏదో తెలియని భయంతో చిన్నగా వణికింది. ఇంతలో ఆమె ఆంటీ లోపలికి వచ్చి, తను రావటం కాస్త ఆలస్యం అయిందని బోలెడు క్షమాపణలు చెప్పసాగింది.
మిస్టర్ నటెల్ గురించి తెలుసుకున్న తరువాత ఆమె నటెల్ ని చూస్తూ, "వేరాతో మీకు చక్కగా కాలక్షేపం అయి ఉంటుంది కదా?" అని అంది.
"చాలా సరదా పిల్ల" అని ఫ్రాంటన్ అన్నాడు.
"ఈ కిటికీ తెరచి ఉండటం వల్ల మీకు ఇబ్బంది ఉండదని అనుకుంటాను," మిసెస్ సాపిల్టన్ చిరునవ్వు చిందిస్తూ అంది.
"మా ఆయన, నా సోదరులు షూటింగ్ కి వెళ్లారు. వాళ్లు ఎప్పుడూ ఈ కిటికీలోనుంచే వెళ్తారు, లోపలకి వస్తుంటారు. వాళ్లకి నీటి బాతుల షూటింగ్ అంటే మహా సరదా. ఇవాళ వాటి కోసమే వెళ్లారు. వాళ్లు తిరిగి రాగానే నా అందమైన కార్పెట్ ని తమ బురద కాళ్లతో తొక్కి పాడు చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా మీ మగాళ్లు మారరు కదా?" ఆమె అంది నవ్వుతూ.
నటెల్ మౌనంగా ఆమె మాటలు వినసాగాడు.
ఆమె సరదాగా షూటింగ్ గురించీ, పక్షుల సంఖ్య తగ్గిపోవటం మరియు శీతాకాలంలో నీటి బాతులు విరివిగా దొరకటం మొదలైనవాటి గురించి మాట్లాడటం మొదలు పెట్టింది. ఫ్రాంటన్ కి ఇదంతా చాలా భయంకరంగా ఉంది. ఫ్రాంటన్ భయోత్పాదకం కాని, శాంతియుత విషయాల మీదకి ఆమె మాటలని మళ్లించాలనే గొప్ప విఫల ప్రయత్నం చేసాడు, కాని ఆమె అతని మాటలని పెద్దగాపట్టించుకో లేదు. ఆమె కళ్లు నిరంతరం ఫ్రాంటన్ తలమీద నుంచి ఆ తెరిచిన కిటికీ మీదనే ఉండటం, ఇంకా ఆ కిటికీ లోంచి వెళ్లి బయట విశాలమైన ఆ మైదానం మీద ఉండటం ఫ్రాంటన్ గమనించాడు. ఇది ఆ దుర్ఘటన వార్షికోత్సవ సమయం అనీ, తాను ఆ సమయంలోనే ఇక్కడికి రావటం నిజంగా చాలా దురదృష్టకరమైన దైవయోగం అని ఫ్రాంటన్ అనుకున్నాడు.
"డాక్టర్లు అందరూ నాకు పూర్తి విశ్రాంతి కావాలని అన్నారు, ఎలాంటి మానసిక ఉత్తేజం, భయం, శారీరిక మానసిక హింసతో కూడిన సంఘటనలకి నేను దూరంగా ఉండాలని గట్టిగా చెప్పారు. " అన్నాడు ఫ్రాంటన్.
పూర్తిగా అపరిచితులు, అనుకోకుండా పరిచయమైన కొత్తవాళ్లు మన అనారోగ్యాలు, అస్వస్థతలు మరియు వాటి కారణాలు-నివారణలు గురించి అస్సలు పట్టించుకోరు అనే ప్రచారంలోని ఒక వదంతిలో నిజం ఎంత వరకు ఉంది అనేదాని గురించి ఆలోచనలో పడ్డాడు.
"డైట్ విషయంలో మాత్రం వాళ్లు ఏకాభిప్రాయం వెలిబుచ్చలేదు," అని ఫ్రాంటన్ వివరించాడు.
"లేదా?" అని మిసెస్ సాపిల్టన్ కాస్త ఆశ్చర్యంగా అంది. అయితే చివర్లో ఆమె ఆవలింత ఆ ప్రశ్నని పూర్తిగా కప్పేసి కనిపించకుండా చేసింది. తర్వాత అకస్మాత్తుగా మహా ఉత్సాహంతో ఆమె ముఖం వెలిగిపోయింది ... కాని అది ఫ్రాంటన్ చెప్పినదానికి మాత్రం కాదు
"ఇదిగో వచ్చేసారు వాళ్లు!" అంది ఆమె, "సరిగ్గా టీ టైం కి వచ్చేసారు, వాళ్లు పూర్తిగా వళ్లంతా మట్టితో నిండిపోయి, మురికిగా కనిపిస్తున్నారు - కళ్లు తప్ప.. చూడండి!" అంది ఆమె.
ఫ్రాంటన్ చిన్నగా తుఫానులో చిక్కిన చిగురుటాకులా వణికి పోయాడు. సానుభూతి చూపుతున్నట్లుగా మేనకోడలు వైపు విచారంగా చూసాడు. సరిగ్గా అదే సమయానికి ఆ పిల్ల భయం నిండిన కళ్లతో కంగారుగా కిటికీలోంచి బయటకు చూడ సాగింది. ఫ్రాంటన్ చెప్పలేని భయం మరియు వణికించే షాక్ తో తన కుర్చీలోనే గిర్రున తిరిగి, అకస్మాత్తుగా కిటికీలోంచి వాళ్లు చూస్తున్నవైపు బయటకి చూసాడు.
సంధ్య చీకటి ముసురుకుంటున్న ఆ మసక వెలుగులో మైదానంలో నడుచుకుంటూ ముగ్గురు ఆ కిటికీవైపే వస్తున్నారు. వాళ్ల భుజాల మీద తుపాకులు వేలాడుతూ ఉన్నాయి. వారిలో ఒకరి భుజం మాత్రం అదనంగా ఒక వేలాడుతున్న వైట్ కోట్ బరువు మోస్తూ కనిపించింది. వాళ్ల కాళ్ల దగ్గిర అలసిపోయిన ఒక బ్రౌన్ స్పానియల్ కుక్క కనిపించింది. నిశ్శబ్దంగా వాళ్లు ఆ ఇంటికి దగ్గరగా వచ్చారు, అప్పుడు ఒక యువ కంఠం ఆ మసక చీకటిలో ఒక పాటని అందుకుంది: " నేనన్నాను కదా, బెర్టీ, వై డు యు బౌండ్? " అని.
ఫ్రాంటన్ కంగారుగా తన టోపి, స్టిక్ అందుకుని, బలంగా హాల్ డోర్ వైపు పరుగులాంటి నడకతో చేరుకుని, తలుపులు బడాలున తెరిచి జోరుగా ముందుకు దూసుకుపోయాడు. అతన్ని ఢీకొనే ప్రమాదం నుండి కాపాడటం కోసం ఎదురుగా వస్తున్నఒక సైకిల్ వ్యక్తి పక్కకు తప్పుకొని, పక్కనున్న ఆ పల్లంలోకి జర్రున జారిపోయాడు.
కిటికీలోంచి లోపలకి వస్తూనే వైట్ మెకింటోస్ భుజాన వేసుకున్న వ్యక్తి, "ఇదిగో వచ్చేసాం డియర్" అన్నాడు. "ఎగిరే ధూళి ఎక్కువగానే ఉన్నా చాలా వరకు పొడిగానే ఉంది. మేము లోపలికి రాగానే కంగారుగా ఒక వ్యక్తి బయటకు వెళ్తున్నాడు, ఎవరతను?" అని అడిగాడు.
"చాలా ప్రత్యేకమైన వ్యక్తి, మిస్టర్ నటెల్, " అంది మిసెస్ సాపిల్టన్, "అతడు తన అనారోగ్యం గురించే మాట్లాడతాడు. మీరు రాగానే గుడ్ బై కాని, అపాలజీ కాని చెప్పకుండా విచిత్రంగా వెళ్లిపోయాడు. అతన్ని ఎవరైనా చూస్తే ఏదో దయ్యాన్ని చూసాడేమో అని అనుకుంటారు."
"మన స్పానియలే దీనికి కారణం అని అనుకుంటాను," మేనకోడలు చల్లగా చెప్పింది," కుక్కలంటే తనకి చాలా భయం అని అతడు నాకు చెప్పాడు. ఒకసారి కొన్ని ఊరకుక్కలతో అతడు గంగానది ఒడ్డున ఎక్కడో ఒక శ్మశానంలో వేటకెళ్లాడట. శవాన్ని పాతిపెట్టటానికి అప్పుడే తీసిన ఒక గోతిలోపడి, ఒక రాత్రంతా తల మీద రకరకాల పురుగులు ఎగురుతూ, గీపెడుతూ, గుమికూడుతూ బృందగానం చేస్తుండగా, నరక యాతన పడ్డాడట. ఎవరైనా అంతగా భయపడిపోవటానికి ఈ ఒక్క సంఘటన చాలు కదా!"
క్షణాల్లో మిస్టరీని బిగించి వదిలి, వినేవాళ్ల గుండెలు ఠారెత్తించటమే ఆ మేనకోడలి ప్రత్యేకత.
[THE END]
ImprintText: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 07-17-2015
All Rights Reserved
Comments (0)