bookssland.com » Humor » Asoukaryamaina Padaka (Telugu) BR Raksun - Guy de Maupassant (easy books to read in english txt) 📗

Book online «Asoukaryamaina Padaka (Telugu) BR Raksun - Guy de Maupassant (easy books to read in english txt) 📗». Author Guy de Maupassant



Asoukaryamaina Padaka

ఫ్రెంచి కథ  

 

 గై డి మపాసా 

 

 

అసౌకర్యమైన పడక

 

 

 

 తెలుగు అనువాదం:

సుంకర భాస్కర రావు

 

 

అది ఆకురాలు కాలం. పికార్డిలోని చాటౌలో స్నేహితులతో హంటింగ్ వినోదం గడపటానికి వెళ్లాను. నా స్నేహితులకి ప్రాక్టికల్ జోక్స్ అంటే మహా ఇష్టం. వారిలో ఎవరికి అది ఇష్టం కాదో తెలుసుకోవటం నాకు అంతగా ఇష్టం లేదు.

 

నేను రాగానే వాళ్లు నాకు మహా వైభవంతో రిసెప్షన్ ఇచ్చారు. ఇది నా మనసులో సందేహాన్ని మేల్కొలిపింది. వాళ్లు రైఫిల్స్ పేల్చి స్వాగతం పలికారు. ప్రేమగా నన్ను కౌగలించుకొనన్నారు. నాకు అలా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. నన్ను అపహాస్యం పాలు చేయటం ద్వారా ఏదో గొప్ప వినోదం నా నుంచి ఎదురు చూస్తున్నట్లుగా.

 

నాలో నేను అనుకున్నాను:

 

"ముసలి పిల్లీ జాగ్రత్త! వాళ్లు నీకోసం ఏదో పెద్ద ప్లానే రెడీ చేసి ఉంటారు."

 

మధ్యాహ్న భోజన సమయంలో ఈ సంతోషం మరింత ఎక్కువగా, అవధులు దాటినట్లు, నాకు కనిపించింది: "ఇక్కడ చాలా మంది కావలసినదాని కంటె ఎక్కువ వినోదాన్నే ఎదురు చూస్తున్నారనుకుంటాను, ఏ కారణం లేకుండానే. వీళ్లు నా కోసం ఏదో ఒక మంచి జోక్ సిద్ధం చేసి ఉంటారు. ఆ జోక్ కి నేను బలి కావలసిందేనా?... తస్మాత్ జాగ్రత్త!"

 

ఆ సాయింత్రం ప్రతి ఒక్కరూ నవ్వులు కేరింతలతో గడిపారు. అంతా మితిమీరిన, హద్దులు దాటిన రీతిలో. నాకు గాలిలో ప్రాక్టికల్ జోక్ వాసన కనిపించింది, ఆటలో కుక్క ఎగిరే బంతి వాసనని పసికట్టినట్లుగా. అయితే అది ఏమిటి? నేను గమనిస్తున్నాను, అవిరామంగా. విశ్రాంతి లేకుండా.

 

అయితే ఒక్క మాట కూడా నా నోటి నుండి రానీయలేదు. ఒక్క హావభావం కూడా నా సందేహాన్ని బయటపెట్టనీయ లేదు. ప్రతి ఒక్కరూ నాకు సందేహించ వలసిన వస్తువుగానే కనిపించసాగారు. చివరికి పనివాళ్ల ముఖాలు కూడా నాకు ఏమాత్రమూ నమ్మకం కలిగించనివిగా కనిపించ సాగాయి. నేను వాళ్లనీ సందేహంగానే చూడసాగాను.

 

రాత్రి విశ్రాంతి సమయం వచ్చింది; ఇంట్లో అందరూ నన్ను రూమ్ దగ్గర వదలటానికి వచ్చారు. ఎందుకు?

 

వాళ్లు నాకు "గుడ్ నైట్.." చెప్పారు. నేను గదిలోకి వెళ్లి, తలుపు వేసేశాను, అలాగే కాసేపు అక్కడే నిలబడి పోయాను. ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. నా చేతిలో కొవ్వొత్తి వెలుగుతూ ఉంది.

 

నాకు వరండాలోంచి నవ్వులు, గుసగుసలు వినబడుతూ ఉన్నాయి. సందేహం లేదు, వాళ్లు నన్నుగమనిస్తూ ఉన్నారు. ఒకసారి నేను నా చూపుల్ని చుట్టూ ఉన్న గోడలు, ఫర్నిచర్, సీలింగ్, హేగింగ్స్, నేల మీదకి తిప్పి పరిశీలించాను. సందేహించవలసినదిగా నాకు ఏదీ కనిపించలేదు. నా తలుపు బయట మనుషులు అటూ ఇటూ తిరుగుతున్న శబ్దాలు వినిపించాయి. వాళ్లు తాళం రంద్రం నుంచి నన్నే చూస్తున్నారని అనిపించింది.

 

నాకొక ఆలోచన వచ్చింది: "నా చేతిలోని కొవ్వొత్తి అకస్మాత్తుగా ఆరిపోయి, నన్ను చీకట్లోకి నెట్టేస్తుందేమో. "

 

నేను ఫైర్ ప్లేస్ దగ్గర ఉన్న మేంటెల్ పీస్ దగ్గరకి వెళ్లి, దానిమీద ఉన్న అన్ని కొవ్వొత్తులు వెలిగించాను. ఆ తర్వాత నా చుట్టూ మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాను. కాని సందేహించాల్సిందిగా ఏదీ కనిపించలేదు. నేను చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకి నడిచాను. అతి జాగ్రత్తగా అపార్ట్ మెంట్ ని పరిశీలించ సాగాను. ఏమీ లేదు. నేను ప్రతి వస్తువునీ పరీక్ష చేసాను, ఒకదాని తరువాత ఒకటిగా అక్కడ ఉన్న అన్నిటినీ. అయినా ఏమీ కనిపెట్టలేక పోయాను.

 

నేను కిటికీ దగ్గరకి వెళ్లాను. షట్టర్లు, పెద్ద పెద్ద ఉడెన్ షట్టర్లు తెరిచి ఉన్నాయి. నేను వాటిని చాలా జాగ్రత్తగా మూసేసాను. కర్టెన్లు వేసేసాను, విశాలమైన వెల్వెట్ కర్టెన్లు మూసేసాను. ఇంకా వాటి ముందు ఒక కుర్చీ కూడా వేసాను, బయట నుంచి ఎలాంటి భయం లేకుండా.

 

తర్వాత జాగ్రత్తగా కూర్చున్నాను. చేతి కుర్చీ చాలా గట్టిగా ఉంది. బెడ్ మీదకి వెళ్లే సాహసం మాత్రం చేయ లేకపోయాను. కాని రాత్రి గడిచిపోతూ ఉంది; నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానని అనిపించింది, నేను చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసాను. వాళ్లు నన్ను రహస్యంగా గమనిస్తూ ఉంటే, నాకు అనిపించింది, వాళ్లు తమ జోక్ ఫలప్రదం కావటానికి ఎదురు చూస్తూ ఉండాలి, నేను భయపడి అరవగానే వాళ్లు గలగలా నవ్వుకోవాలి కదా! పర్యవసానం ఏదైనా కానీయ్ అనుకొని, బెడ్ మీదకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాని నాకు బెడ్ సందేహించాల్సిందిగా కనిపించ సాగింది. నేను కర్టెన్లు వేసేసాను. అవి ఇప్పుడు సురక్షితంగా కనిపించాయి.

 

అయినా సరే, ఏదో ప్రమాదం పొంచి ఉంది. నెత్తి మీద చన్నీటి షవర్ పడి నన్ను నిలువెల్లా తడిపెయ్యవచ్చు. లేదా బహుశా నేను లేచి చూసేసరికి నేను నేల మీద బెడ్ మీద తేలుతూ నీటిలో మునిగిపోతూ ఉండవచ్చు. నేను నా అనుభవంలోని అన్ని ప్రాక్టికల్ జోక్స్ జ్ఞాపకాలని మనసులోనే నెమరు వేసుకోసాగాను. నేను వాటికి చిక్కి అభాసుపాలు కావటం నాకు ఇష్టం లేదు. నాకు అనిపించింది, అవును! వాటికి నేను తప్పకుండా చిక్కకూడదు! తప్పకుండా చిక్కకూడదు!

 

అప్పడే నా మనసులో ఒక జాగ్రత్త నేనున్నాను పద ముందుకు అంటూ గుర్తుకొచ్చింది. అది సురక్షితమైన భద్రతగానే నాకు కనిపించింది. నేను మ్యాట్రెస్ ని చివర్ల నుంచి పట్టుకొని జాగ్రత్తగా నావైపుకి లాక్కున్నాను. బెడ్ షీట్ మరియు మిగతా బెడ్ క్లోత్స్ తో అది నా వైపుకి వచ్చింది. దానిని సరిగ్గా రూమ్ మధ్యకి లాగి, జాగ్గత్తగా నా బెడ్ ని రెడీ చేసుకున్నాను. అది సరిగ్గా ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉంది. ధాన్ని నేను మళ్లీ జాగ్రత్తగా నాకోసం తయారు చేసుకున్నాను. ఇలా నేను సందేహిస్తున్న మంచం మరియు దాని పరిసరాల నుంచి జాగ్రత్తగా దూరంగా ఉండేలా చేసాను. ఇప్పుడు అన్ని కొవ్వొత్తులనీ ఆర్పేసి, తడుముకుంటూ వచ్చి నా బెడ్ షీట్ లోకి దూరి వెచ్చగా పడుకున్నాను.

 

అయినా వెంటనే పడుకోలేదు. కనీసం ఒక గంట మెలుకువగానే ఉండి, ఎక్కడ చీమ చిటుక్కమన్నా సరే అదేమిటో చూసేందుకు సిద్ధంగా ఉన్నాను. చాటౌలో అంతా సరిగ్గానే ఉన్నట్లు అనిపించింది. నిద్ర పోయాను.

 

అలా నేను చాలా గాఢ నిద్రలో చాలా సేపు ఉండి ఉంటాను. అకస్మాత్తుగా నా మీద ఏదో బరువైన వస్తువు  వచ్చి నా మీద పడటంతో, ఆ తాకిడికి నేను కంగారు పడ్డాను. అంతేనా, వేడి వేడి ద్రవ పదార్థం నా ముఖం మీద, మెడ మీద, ఛాతీ మీద పడటంతో మంటపుట్టి, ఆ బాధలో నేను అప్రయత్నంగానే గావు కేక పెట్టాను. అప్పుడే ఒక భయంకరమైన శబ్దం. సైడ్ బోర్డ్ లోని ప్లేట్లు, సాసర్లు అన్నీ ఒకే సారి నా మీద పడి, నా చెవులు పనిచేయనంతగా శబ్దం చేసినట్లు అనిపించింది.

 

నా మీద పడ్డ బరువు నన్ను అణిచేస్తున్నది. అది నన్ను ఊపిరి కూడా తీసుకోనివ్వటం లేదు. నేను కదల లేక పోతున్నాను. నా మీద పడ్డది ఏమిటో తెలుసుకోవటానికి నేను నా చేతులు చాపి తడిమి చూసాను. నా చేతికి ముక్కు, నోరు, చెవులు తగిలాయి. అప్పుడు నా శరీరంలోని బలాన్నంతా కూడదీసుకుని ఆ ముఖం మీద బలంగా ఒక పిడి గుద్దు గుద్దాను. దాన్ని రెండు తడి చేతులు అడ్డుకోవటం చూసి, తడిసిన బెడ్ షీట్ నుంచి ఒక్క ఉరుకన లేచి, తెరిచిన డోర్ నుంచి కారిడార్లోకి పరిగెత్తాను. ఆ తలుపు ఎలా తెరిచి ఉందో తెలీదు.

 

అరె, హెవెన్స్! బాగా తెల్లారిపోయిందే, ఎంత వెలుగు! ఈ శబ్దాలకి నా స్నేహితులు నా అపార్ట్ మెంట్ దగ్గరకి పరిగెత్తుకు వచ్చారు. నేను నేల మీద పరిచిన బెడ్ మీద నాకు మార్నింగ్ టీ మరియు బ్రేక్ ఫాస్ట్ ని తీసుకు వస్తూ, కాలికి బెడ్ అంచు తగిలి, బెడ్ మీద బోర్లా పడి, ఏం జరిగిందో తెలియక అయోమయంగా ఆ ప్లేట్ల మధ్య బోర్లా పడుకుని చూస్తూ పనివాడు కనిపించాడు. వాడు అవన్నీ తన ముఖం మీదకి బదులుగా నా ముఖం మీద పారబోసాడు.

 

నేను అతి జాగ్రత్తతో విండో షట్టర్లు మూసేసి, బెడ్ ని గది మధ్య నేల మీద పరిచి, ఇలా ఈ గది మధ్య పవ్వళించటం చేత, నేను ఏదైతే జరగకూడదని ప్రయత్నిస్తున్నానో ఆ ప్రాక్టికల్ జోక్ నా కారణంగానే నిజమైంది.

 

ఆహా, ఆ రోజంతా వాళ్లు ఎంతగా నవ్వుకున్నారో చెప్పలేను! 

 

[END]

 

 

Imprint

Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 07-23-2015

All Rights Reserved

Free e-book «Asoukaryamaina Padaka (Telugu) BR Raksun - Guy de Maupassant (easy books to read in english txt) 📗» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment