bookssland.com » Juvenile Fiction » Alocimpajese Katha Telugu BR Raksun - Fernando Sorrentino (electronic book reader .txt) 📗

Book online «Alocimpajese Katha Telugu BR Raksun - Fernando Sorrentino (electronic book reader .txt) 📗». Author Fernando Sorrentino



Aalochimpajese Katha Telugu

Aalochimpajese Katha Telugu

ఆలోచింపజేసే కథ (అర్జెంటినా కథ)

 Telugu: BR RAKSUN     

 

 

An Enlightening Tale

by 

Fernando Sorrentino

 

 


అతడు చాలా నిజాయితీపరుడైన భిక్షగాడు. ఒక రోజు  ఒక పెద్ద భవంతి ముందు నిలబడి,  వీధి తలుపు తట్టాడు. వంటవాడు బయటకి వచ్చి, తలుపు తీసాడు, "చెప్పండి, ఏమి కావాలో శెలవియ్యండి మహాశయా!" అన్నాడు.

 

"దానం, భగవంతుని దయకి ప్రతిరూపంగా!" అన్నాడు భిక్షగాడు.

 

"దీన్ని నేను ఈ ఇంటి యజమానురాలికి చేరవేయాలి."

 

వంటవాడు వెళ్లి భిక్షగాడి మాటలు ఇంటి యజమానురాలికి చేరవేసాడు. ఆమె చాలా పిసినారి. అయినా భిక్షగాడి మీద ఆమె జాలి పడింది.

"జరేమియా, ఆ మంచి మనిషికి ఒక రొట్టె ముక్క ఇవ్వు, ఒక్కటే సుమా. వీలయితే నిన్నటి రొట్టెలలోనిది ఒకటి!"

జరేమియాకి యజమానురాలి మీద భక్తి ఎక్కువ. కాబట్టి యజమానురాలి అభిమానం చూరగొనాలని ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. ఉన్న రొట్టెలలో బాగా ఎండిపోయిన రాయిలాంటి ఒక రొట్టెని తెచ్చి భిక్షగాడికి ఇచ్చాడు.

 

"ఇదిగో మహాశయా! మా యజమానురాలు నీకు ఇమ్మన్న రొట్టె!" అతని మాటలలో మొదట కనిపించిన మర్యాద పదం ఇప్పుడు మాయమయింది. 

మీకు బదులు నీకు అనే మాట చోటు చేసుకుంది.

"భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నాయనా!" అని భిక్షగాడు దీవించాడు.

జరేమియా ఆ భారీ ఓక్ తలుపు మూసివేసాడు. భిక్షగాడు ఆ ఎండు రొట్టెని చంకలో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లి పోయాడు. భిక్షగాడు తాను రాత్రి, పగలూ గడిపే కాళీ చోటుకి వచ్చాడు. ఆ చెట్టు క్రింద నీడలో కూర్చున్నాడు. ఆ ఎండు రొట్టెని కొంచెం కొంచెంగా కొరుక్కుని సంతోషంగా తినసాగాడు. రొట్టె ఎండిపోయినా చాలా రుచిగా ఉంది.  అలా తింటూ ఉండగా మధ్యలో పళ్లక్రింద ఏదో గట్టిగా పడినట్టు అనిపించింది. ఏమిటా అని చేత్తో తీసి చూసాడు. అది ఒక బంగారు ఉంగరం. ముత్యాలు, వజ్రాలతో.

"ఏమి అదృష్టం! దీన్ని అమ్మితే వచ్చే డబ్బుతో చాలా కాలం నాకు తిండి సమస్య ఉండదు!" అని భిక్షగాడు మనసులోనే చాలా ఆనందపడిపోయాడు.

కాని అతడి నిజాయితీ వెంటనే మేల్కొంది. "లేదు. దీని యజమాని ఎవరో తెలుసుకుని, దీన్ని వాళ్లకి అందజేస్తాను!" అని భిక్షగాడు గట్టిగా నిశ్చయించుకున్నాడు.

ఉంగరం లోపల జె. ఎక్స్. అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. భిక్షగాడు తెలివితక్కువ వాడు కాడు, సోమరి అంతకంటె కాడు. దగ్గరలోని ఒక స్టోర్ దగ్గరకి వెళ్లి, టెలిఫోన్ బుక్ అడిగి తీసుకున్నాడు. టౌన్ మొత్తం మీద ఎక్స్ ఇంటి పేరుతో ఒకేఒక కుటుంబం ఉంది. క్సొఫైనా కుటుంబం.

 

                                

<  2  >

 

 

సంతోషంతో క్సొఫైనా కుటుంబాన్ని వెదుక్కుంటూ బిక్షగాడు బయలుదేరాడు. ఆ ఇంటి దగ్గరకి వెళ్లే సరికి ఆ భిక్షగాడి ఆశ్చర్యం మరింతగా పెరిగింది. కారణం ఏ రొట్టెలో ఆ ఉంగరం దొరికిందో, ఆ రొట్టెని ఆ ఇంటివాళ్లే ఇచ్చారు. అతడు ఆనందంగా ఆ ఇంటి తలుపు తట్టాడు. జరేమియా బయటకి వచ్చి, "ఏమి కావాలి మహాశయా!" అని ఎప్పటిలాగే అడిగాడు.

 

"కాస్సేపటి ముందు మీరు దయతో నాకు ఇచ్చిన రొట్టె ముక్కలో నాకు ఈ ఉంగరం దొరికింది.!" అని ఉంగరం ఇచ్చేసాడు.


జరేమియా ఆ ఉంగరాన్ని భిక్షగాడు నుంచి తీసుకున్నాడు. "దీన్ని నేను ఈ ఇంటి యజమానరాలికి చేర వేయాలి." అని లోపలికి వెళ్లాడు.

 

ఇంటి యజమానురాలికి విషయం చెప్పి, ఏమి చెయ్యమంటారు అని అడిగాడు."నేను అదృష్టవంతురాలినే.  ఈ ఉంగరం మూడు రోజుల ముందు పోయింది అని  అనుకున్నాను. ఆ రోజు నేను పిండి కలిపేటప్పుడు ఈ ఉంగరం దానిలో ఇరుక్కుని ఇప్పుడు దొరికింది. దీని మీద జె. ఎక్స్. అని నా ఇనీషియల్స్ ఉన్నాయి కదా?జె. ఎక్స్. అంటే జోసర్మినా క్సోఫైనా. నా పేరే. ఇది దొరకటం ఆనందంగా ఉంది."


తర్వాత యజమానురాలు వంటవాడివైపు చూసి, " జరేమియా, వెళ్లి ఆ భిక్షగాడు బహుమతిగా ఏమి అడిగితే అది ఇవ్వు. మరీ ఖరీదైనది కాకుండా చూడు." అంది.

జరేమియా వీధి తలుపు దగ్గరకి తిరిగి వచ్చి, ఆ భిక్షగాడితో, "మహాశయా! మీరు చేసిన మంచి పనికి మీకు ఏమి బహుమతిగా కావాలో చెప్పండి."అన్నాడు.

 

"ఒక రొట్టె ముక్క. నా ఆకలి తీర్చేది." అన్నాడు భిక్షగాడు.

యజమానురాలి అభిమానం చూరగొనాలని ఎదుకు చూసే జరేమియా ఒక ఎండు రొట్టెని వెదికి తీసాడు. అది చాలా గట్టిగా, రాయిలా ఉంది. దాన్ని తెచ్చి భిక్షగాడికి ఇచ్చాడు.

 

"ఇదిగో మహాశయా! మీరు అడిగిన రొట్టె !"

 

"భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నాయనా!" అని భిక్షగాడు దీవించాడు

 

జరేమియా ఆ భారీ ఓక్ తలుపు మూసివేసాడు. భిక్షగాడు ఆ ఎండు రొట్టెని చంకలో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లి పోయాడు. భిక్షగాడు తాను రాత్రి, పగలూ గడిపే కాళీ చోటుకి వచ్చాడు. ఆ చెట్టు క్రింద నీడలో కూర్చున్నాడు. ఆ ఎండు రొట్టెని కొంచెం కొంచెంగా కొరుక్కుని తినసాగాడు. రొట్టె ఎండిపోయినా చాలా రుచిగా ఉంది.  అలా తింటూ ఉండగా మధ్యలో పళ్లక్రింద ఏదో గట్టిగా పడినట్టు అనిపించింది. ఏమిటా అని చేత్తో తీసి చూసాడు. మళ్లీ ఒక బంగారు ఉంగరం. ముత్యాలు, వజ్రాలు పొదిగినది. .

 

 

 

                              <  3  >

 

 

ఆ ఉంగరం లోపల జె. ఎక్స్. అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. భిక్షగాడు  ఆ ఉంగరాన్ని తీసికెళ్లి  ఆ ఇంట్లోని జోసర్మినా క్సోఫైనాకి అప్పగించాడు. బహుమతిగా బట్లర్ జరేమియా  ఇచ్చిన మూడవ ఎండు రొట్టె ముక్కని తీసుకున్నాడు. మళ్లీ దానిలో ఒక ఉంగరం....

ఆ ఉంగరాల అదృష్టం ప్రతి రోజూ ఆ భిక్షగాడిని వెదుక్కుంటూ వస్తున్నది. ప్రతి రోజూ ఆ ఉంగరాన్ని తీసుకు వెళ్లి జోసర్మినా క్సోఫైనాకి అప్పగించటం, బహుమతిగా ఒక ఎండు రొట్టెని తీసుకోవటం పరిపాటి అయిపోయింది.

ఆ విధంగా ఆ భిక్షగాడికి బ్రతికినన్నాళ్లు ఆ ఇంటి నుంచి ఉంగరాలతో ఎండు రొట్టెలు దొరుకుతూనే ఉన్నాయి. అలా రోజుకొక్క రొట్టెతో అతడు తిండి సమస్య లేకుండా హాయిగా బతికాడు. 

 

                                 ****

 

Imprint

Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 08-13-2015

All Rights Reserved

Free e-book «Alocimpajese Katha Telugu BR Raksun - Fernando Sorrentino (electronic book reader .txt) 📗» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment