క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
యశో అమె చెవిలో ఏదో చెప్పింది.
‘‘ఏమిటి యశో. ఆయనని అలా నిలబెట్టేశావు. ఆయనకు నన్ను పరిచయం చెయ్యవా?’’అమె నవ్వుతూ అంది.
యశో నన్ను సరళకు పరిచయం చేసింది. కొంటెతనంలో యశో కంటె ఆమె ఒక ఆకు ఎక్కువే చదివిందని గ్రహించాను.
ముగ్గురమూ కూర్చున్నామూ. సరళ నా గురించి చాలా ప్రశ్నలు వేసింది, అన్నింటికి నేను సమాధానం చెప్పాను. ఇక ప్రశ్నలు అయిపోయాయి. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కృత్రిమమైన నిశ్శబ్దం గదినిండా వ్యాపించింది. దానిని భంగపరుస్తూ యశో,
‘‘హాక్ మన్స్ కి ఎప్పుడు వెళ్దాం? ఈ సాయంకాలం నీకేమైనా పనివుందా? మీ నాన్న నిన్ను ఇంటికి కాపలా కాయమనలేదు కదా?’’ అంది.
‘‘లేదు యశో, నాన్న గారు ఈ వేళ పొద్దున వెళ్లిపోయారు. రెండు నెలలదాకా తిరిగిరారు. ఈ లోపున ఈ ఇంటికి నేనే యజమానురాలిని,’’ అంది సరళ నవ్వుతూ.
‘‘అరే, ఎంత శుభవార్త. అన్నీ కలిసొచ్చాయి. రామంబాబు రావటం మీ నాన్న బెడ్డింగు చుట్టటం ఒక సారే జరిగాయి. అయితే సాయంకాలం ప్రొగ్రాం మారదు కదా?’’ అంది యశో.
‘‘సరే అలాగే చేద్దాం, సాయంత్రం మిమ్మల్ని తీసుకుపోతాను,’’ అని, ‘ఇప్పుడే వస్తాంటూ’ సరళ లోపలికి వెళ్లిపోయింది.
కాసేపటిలో ఒక ప్లేటులో యాపిల్స్, టీ ట్రే పట్టుకు వచ్చింది. యశో ఒక యాపిల్ తీసుకుని కొరకటం మొదలుపెట్టింది. నేను తినటానికి తటపటాయిస్తూవుంటే యశో కనిపెట్టింది.
‘‘అరే, మీరు తినటంలేదే? ఎందుచేత? ఓహో, సరళా, ఒక కత్తి పట్టుకురా ఈయనకి, యాపిల్ ని ముక్కలుగా కోసి నోటికందిస్తే గాని తినరుకాబోలు,’’ అంది తను.
ఆ అప్రస్తుత మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. సరళ లేచి లోపలికి వెళ్లబోతే నేను వద్దన్నాను. అయినా ఆమె లోపలికి వెళ్లి కత్తి తెచ్చింది. యశో యాపిల్ ని కోయడానికి వుద్యుక్తురాలైంది. దాంతో నా కోపం మిన్నంటింది.
“యశో, నీవు ఆ యాపిల్ ను ముక్కలుగా కోసావంటే, నేను యాపిల్ నే కాదు, ఆసలేదీ ముట్టుకోను,’’ అన్నాను పరిసరాల్ని మరచిపోయి.
యశో, సరళ నాకేసి బిత్తరపోయి చూస్తున్నారు. నామాటలు నాకే ఎంతో కటువుగా వినిపించాయి.
‘‘ముక్కలుగా కోయడానికి చాలా టైం పడుతుంది తినటానికి కావాలంటే నేను నీకు కోసిపెడ్తాను,’’ అన్నాను లేని చిరునవ్వు తెచ్చుకుని.
‘‘ధన్యురాలినయానుగా ఇంకేంకావాలి. మీ ఇష్టం వచ్చినట్లే చేయండి,’’ అంది యశో చిన్నబోయిన ముఖంతో.
ఇంకొక అరగంట పోయిన తర్వాత మేమిద్దరం బయలుదేరి వచ్చాము. సరళ సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పింది. ఇంటికి తిరిగి వస్తూ నా అసభ్య ప్రవర్తనకు నేను చాలా బాధపడ్డాను. వచ్చినప్పటి నుంచీ యశోకి ఏదో కష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాను. ఈ సారి క్షమాపణ చెప్పుకోవాల్సిన విధి నాదనిపించింది.
‘‘యశో, నేను అలా ప్రవర్తించాలనుకోలేదు. నన్ను క్షమించాలి ఈ సారికి,’’ అన్నాను.
‘‘ఇందులో క్షమించటానికి ఏముంది చెప్పంది. మీలో ఇంత కోపం దాగివుందని నాకింతవరకూ తెలియదు. భవిష్యత్తులో జాగ్రత్త పడతాను,’’ అంది యశో.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అయినా ఆమె నాకేమీ అవదు, అది నాపూచీ, సుశీ స్థానం ఈమెకు నేను అర్పించలేను అనుకున్నాను.
చాప్టర్ 9
ఒక వారం రోజులు దొర్గిపోయాయి. ముస్సోరి వాతావరణం నా శరీరానికి సరిపడింది. శరీరారోగ్యంతోపాటు మనస్సుకూడా బాగయింది. యశో నన్ను పిక్నిక్ స్థలాలకి తీసుకుని వెళ్లేది. అప్పటికి ఆమె నన్ను ఏ విధంగా భావిస్తోందో తేటతెల్లమయింది. ఎవరో ‘బాదల్ బాబు’ అనే ఒక పురుషుడిని ఊహించుకుంది, ఈమె నన్ను మొదటిసారి చూసిన ఆ అశుభముహూర్తాన నేనే అతగాడినని ఈమెకు తట్టింది.
“నమస్కారమండి” అన్నప్పుడు నేను పడిన తడబాటు ఈమె నమ్మకాన్ని దృఢతరం చేసింది. ఈమె మెదడులోంచి ఈ మిథ్యను ఎలా పోగొట్టటం? కాలమే ఈ సమస్యకి పరిష్కారం తీసుకువస్తుందని ఆశించాను. ఆమె నామీద ప్రదర్శించే అనురాగం, శ్రద్దా అవాంఛనీయమని ఆమెకు చూపించుదామనుకున్నాను. లేక మనస్సులో నాకు తెలియకుండానే ఆమె యెడఅభిమానం దాగియుందేమో? యశోకి సుశీ విషయం తెలిసివుంటుందనే ఆలోచనతో నన్ను నేనే మోసపుచ్చుకునే వాడిని, అలాకాకపోతే ఆమెకు ఇదంతా ఎందుకు చెప్పను?
ఆరోజు రాత్రి కూడా పదిగంటలకల్లా లైట్లు ఆరిపోయాయి. కాని నిద్రాదేవత వచ్చే సూచనలేమి లేమి. మరణించి సుశీ, జీవించివున్న యశో వీరిద్దరి రూపాలు మనోనేత్రం ముందు మెదలసాగాయి. వీరిద్దరి మధ్యా నా కర్తవ్యమేమిటి? సుశీ ఒక నాటి రాత్రి అన్న మాటలు చటుక్కున జ్ఞప్తికి వచ్చాయి. ‘‘నేను ఎన్నటికైనా మీదాన్నే. కానీ మీరు నావారే అనటానికి ధైర్యం చాలటంలేదు. అయినా మీరు నావారే’’. ఆమె అనుమానపడినట్లే ఆమెకు అన్యాయం జరుగుతుందా? నా చేతులకి ఆమె ఆందనంత మాత్రాన ఆమెకి ద్రోహం చేస్తానా? ఇలాంటి ఆలోచనలతో నిద్దరపట్టక బయటికి వచ్చాను.
వెన్నెలరాత్రి ఎంతో ప్రశాంతంగా ఉంది. చాలాసేపు దానిని చూస్తూనుంచున్నాను. హఠాత్తుగాదృష్టి వరండా చివర సోఫామీద పడింది. అక్కడ ఎవరో పడుకున్నట్టు కనబడింది. దగ్గరకు వెళ్లి చూశాను. టేబుల్ మీద తలమోపి యశో పడుకుని ఉంది. వెన్నెల కాంతిలో ఆమె ముఖం సృష్టంగా కనబడుతూవుంది. తెల్ల రాళ్ల మీద ప్రవహించే సెలయేరువలె ఆమె కన్నుల్లోంచి అశృవాహినులు సాగి వస్తున్నాయి.
‘‘యశో, ఇక్కడ పడుకున్నావేమిటి? ఏమిటి ఇదంతా?’’ అన్నాను నెమ్మదిగా
యశో చివాలున లేచి నా గుండెలమీద వాలిపోయింది వెక్కివెక్కి ఏడుస్తూ. నేను ఆశ్చర్యాన్వితుడనయి పోయాను. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయినా స్త్రీ కన్నీరు చూస్తే నా మనస్సు కరిగిపోయింది.
‘‘ఏమిటి యశో? ఏం జరిగిందో చెప్పు? నేనేమైనా నీకు కష్టం కలిగించానా?’’ అన్నాను యశో తల నిమురుతూ.
‘‘నా దు.ఖ కారణం నేను నోటితో చెప్పలేను. అది కూడా తెలియని అమాయకులా మీరు? దేనికైనా ఒక హద్దువుంది బాదకబాబూ,’’ అంది యశో ముఖం పైకెత్తి.
మరుక్షణంలోనే తుఫానులా తన గదిలోకి వెళ్లిపోయింది. హత బుద్ధుడనూ, అప్రతిభడనూ అయిపోయి అక్కడనే నిల్చుండిపోయాను. రాత్రి చాలా సేపువరకూ దుర్నివార్యమై పొంగివస్తూన్న దు.ఖాన్ని బలవంతాన అణచుకోవటానికి ఆమె చేస్తూన్న ప్రయత్నాలు నాకు పక్క గదిలోకి వినబడుతూనే ఉన్నాయి.
ఆమె దుఃఖ కారణం ఆ పరమాత్మకే తెలుసు. అందరినీ దుఃఖ పెట్టేది అతగాడేగా?
ఒక వారం రోజుల వరకూ నాకు ఈమెలేదు; ఈమెకు నేనులేను. ఈ కొద్దికాలంలో జన్మజన్మలకీ మరుపురాని సంబంధం ఎలా ఏర్పడింది? నా ఇష్టంలేకుండా ఈ వుచ్చులోకి ఎందుకు కాలుపెట్టాను? గడిచిన వారంరోజుల నుంచీ జరిగిన సంఘటనలను పర్యావలోకించి చూస్తే నాకు ఒకే ఒక సత్యం పొడచూపింది.
నేను ఒక ప్రవాహంలోపడి కొట్టుకుపోతున్నాను. ఎదురీదటం హాస్వాస్పదమైన సంగతి. గమ్యస్థానం నాకు తెలియదు. మునుగుతానో తేల్తానో నాకంతకంటే అ స్పష్టంగా ఉంది. ఇక మిగిలింది నా కర్తవ్యంయేమిటి?
చాప్టర్ 10
మానవుడు తలచేది ఒకటి, దైవం చేసేది వేరొకటి, అనే వాక్యంలో ఎంత సత్యం ఇమిడి వుందో నాకప్పుడు బాగా విదితమైంది. కాకపోతే ఈ జరిగినదానికి నేనెలా సంజాయిషీ ఇచ్చుకోవాలి? కలలోకూడా ఊహించని ఈ విషయాన్నీ, ఈ సంఘటనలనూ నేనెలా సమర్ధించగలను.
జరిగింది జరిగిపోయింది; జరుగవలసింది జరుగుతుంది, అనే నిర్బలులూ, నిస్సహాయులూ పలికే వాక్యాల్లో నేనెందుకు తల దాచుకుంటాను. నాస్తికుడివి అనే అభియోగానికి నేనెందుకు జవాబివ్వాలి?
రోజులు గడిచిపోతున్నాయి. స్థలానికీ, సంఘటనకీ లంకె ఎప్పుడూ ఉంటుంది. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క పురుషుడు తిరస్కరించలేని రమణీయమైన రమణిప్రేమ, ఇంకొకపక్క అద్వితీయమైన ప్రకృతి శోభ, ఈ ప్రబల శక్తుల బారినుంచి నన్ను కాపాడేదెవరు? రానురాను యశో ఆదరానికీ, ప్రేమకీ కట్టుబడిపోతున్నాను. ఆమె అనురాగానికీ, ఆదరణకీ, ప్రేమకీ హద్దుమించి కృతజ్ఞుడనయి పోయాను. స్నేహం, కరుణ, మార్దవం గట్టుతెంచుకుని ప్రవహించాయి. హృదయపు గోడలకు చిల్లులు పడ్డాయి.
గతాన్ని మరచిపోయి ఈ యువతితో ఎందుకు సుఖించకూడదు. భూతకాలంలో నాకు జరిగిన అన్యాయానికి వర్తమాన భవిష్యత్కాలాలలో నన్ను నేను ఎందుకు శిక్షించుకోవాలి? భవిష్యత్తులో యశో నన్ను మరచిపోయి తన పూర్వపు జీవితాన్ని గడపలేదనే విషయం స్పష్టమవజొచ్చింది. ఆమె నన్ను సంపూర్ణంగా నమ్మింది. పవిత్రమూ నిష్కళంకమూ, నిర్మలమూ అయిన అనురాగం నామీద కురిపించేది. ఒక క్షణంలో ప్రేమ స్వరూపిణిగా ఉండేది; మరొక క్షణంలో కొంటెపిల్లగా ఉండేది.
ఆనాడు చాకలికి నా బట్టలు వేసింది. వాడు వెళ్లిపోయిన తర్వాత యశో పకపకా నవ్వటం మొదలుపెట్టింది. ఆమె నవ్వు వింటూంటే జలజలా ప్రవహించే సెలయేరులు జ్ఞాపకానికి వస్తాయి. ఎందుకు నవ్వుతుందో అని ఆమెవైపు దృష్టి ప్రసరించాను. యశో నాకు మొదటిరోజు సరళ ఇంటికి వెళ్లక మునుపురాసిన చీటీ చేతిలో పట్టుకుని నవ్వుతూంది. అది మరచిపోయి చొక్కా జేబులో పెట్టినట్టున్నాను. అది ఆమె కంటపడింది. కాని నాకు ఇందులో నవ్వవలసిన విషయం ఏమీ కనబడలేదు.
‘‘ఎందుకు నవ్వుతున్నావు యశో?’’ అన్నాను.
‘‘ఇదేమైనా ప్రేమలేఖ అనుకున్నారా? భద్రంగా జేబులో దాచుకున్నారు. మీకు కోరికగా వుంటే నాతో చెప్పలేకపోయారా? ఒక పెద్ద ప్రేమలేఖ రాసి రాజేంద్రచేత ఇచ్చి ‘డూన్’ లో పోస్టు చేయించేదానిని,’’ అంది యశో, బలవంతాన నవ్వు ఆపుకుంటూ.
ఆ నవ్వు యశో కళ్లల్లో నీరు తెప్పిస్తే ఆ మాట నాకు కోపం కలిగించింది.
‘‘చాలు యశో. నీకు దేనిని గురించి పరిహాసమాడాలో తెలియదు,’’ అన్నాను.
“సరేలెండి, అప్పుడే కోపం వచ్చేసినట్టుంది మీకు, నాకు దేనికి పరిహాసమాడాలో తెలియదన్నారు, మీకు దేనికి కోపగించుకోవాలో తెలియదు,’’ అంది కళ్లు తుడుచుకుంటూ.
తరువాత ఆ చీటీ పట్టుకుని తనలోతాను ఆలోచించుకుంటూ నేలమీద కూర్చుంది.
‘‘ప్రేమలేఖ ఎలా ఉంటుందో తెలియనే తెలియదు, రాయడానికి ఎవరూలేందే. ఇదిగో ఇప్పుడు వచ్చారు. మీరు రాస్తారా? చాలా పెద్దది రాయాలి తెలుసా,’’ అని, నాకేసి చూస్తూ నవ్వింది.
కాని మరుక్షణంలోనే ముఖం వెలవెలపోయి ఆమె భయవిహ్వల అయింది. మంచం మీద కూర్చుని ఏదోనా అనుమానాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడింది.
‘‘మనకి ప్రేమలేఖలు రాసుకోవాల్సిన ఆగత్యం ఎందుకు కలుగుతుంది. చెప్పండి బాదకబాబు? మనమెప్పుడు ఒకరిని విడిచి ఒకరము ఉండం కదా; ఏమంటారు?’’ అంది.
నేనేమీ మాట్లాడలేదు. ఆ అమాయకపు ముఖంలోని ఆత్రుతను చూస్తూంటే నా మనస్సు విచలితమైంది. ఇలాంటి ప్రేమను నేనెల తిరస్కరించగలను?
యశో నన్ను కదుపుతూ అంటూంది. ‘‘ఏమిటండి, ఏమీ మాట్లాడరేమిటి? అక్కడేముందని చూస్తూ ఉన్నారు? నాకు భయం వేస్తుంది’’
‘‘మరీ నువ్వు నన్నింత నమ్మటం మంచిదికాదు యశో. నేనెలాంటి వాడినో నీకేమి తెలుసు, మనది కొద్దిరోజుల పరిచయం,’’ అన్నాను, రుద్దకంఠంతో.
‘‘మీరు అలా అనకండి బాదకబాబూ; నాకు చాలా బాధ కలుగుతుంది,’’ అంది.
మరుక్షణంలోనే యశో దు.ఖపు తెరలను చెదరగొట్టింది.
‘‘ఇవేళ నుంచీ మీరన్నట్టు మిమ్మల్ని మరీ అంతగా నమ్మను, బాదకబాబు. అది సరే, ఈ ఉత్తరం మీరే తీసుకోండి,’’ అని దాన్ని నా జేబులో పడేసి నవ్వుతూ బయటికి వెళ్లిపోయింది.
చాప్టర్ 11
రాజేంద్ర ఆహ్వానాన్ని పురస్కరించుకుని నేనూ, యశో, సరళా ఒక రోజు ముస్సోరిలోనే వన్నవాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎప్పటిలాగే, సరళ కారుకు సారథ్యం వహించింది. ఆనాడు జరిగిన ప్రతి చిన్న విషయమూ నాకు ఈనాటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకంటే మా నలుగురి జీవితాల్లో ఆ దినం ఒక మైలురాయి లాంటిది.
ఒక చక్కని బంగాళా పోర్టికోలో సరళ కారు ఆపింది, బయటనించే తెలుస్తోంది అది రాజేంద్ర 'రెసిడెన్స్ కమ్ క్లినిక్' అని. బంట్రోతు మమ్మలిని లోపలలికిపంపుతూ రాజేంద్ర స్నానం చేస్తున్నాడని చెప్పేడు.
మేము డ్రాయింగ్ హాల్లోకూర్చుండగా కొద్దిసేపటికి రాజేంద్ర లోపలినుంచీ వచ్చాడు,
‘‘క్షమించండి రాంబాబు. ఆలస్యం చేశాను. తలవని తలంపుగా వచ్చారు. యశోనికూడా తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది,’’ అన్నాడు నాతో చేయి కలుపుతూ.
‘‘యశోని నేను తీసుకు రావటంకాదు రాజేంద్ర, ఆవిడే నన్ను తీసుకువచ్చింది,’’ అన్నాను.
‘‘అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. యశో ఇక్కడకు వచ్చి సంవత్సరం దాటిపోయింది,’’ అన్నాడు యశో వైపు చూస్తూ.
యశో అతనికేసి చూడటంలేదు, గోడమీద బల్లి పురుగులను కబళించటానికి పొంచివున్న దృశ్యాన్ని తదేకంగా చూస్తూంది.
ఇంతలో, లోపలినుంచి ఒక ఇరవై సంవత్సరాల యువకుడు వచ్చాడు.
‘‘దిల్ బహదూర్. ఇంకొక నలుగురికి ఈ రోజు వంట చెయ్యాలి. ఇప్పుడు టీ తీసుకురా,’’ అన్నాడు రాజేంద్ర.
‘‘చాలా మంచివాడు. బాగా వంటచేస్తాడు, ప్రాణం తీయాలన్నా, ప్రాణప్రదంగా సేవ చేయాలన్నా నేపాలీలను మించినవారు ఉండరు,’’ అతను లోపలికి వెళ్లిపోయాక అన్నాడు తను.
‘‘ఇలా ఎన్నాళ్లు బాధపడతారు రాజేంద్రబాబు; పెళ్లి చేసుకోకూడదా?’’ అంది సరళ నవ్వుతూ.
‘‘పెళ్లి చేసుకుంటే మాత్రం నాకు కలిగే లాభం ఏమిటి?’’ అన్నాడు రాజేంద్ర.
‘‘పెళ్లి చేసుకున్నారంటే అభేద్యమైన ఇనుప కవచం మీకు లభిస్తుంది. మీరు ఏంచేసినా లోకం తప్పుపట్టదు. మీరు ఎన్ని పాపాలు చేసినా కప్పిపోతాయి. అందులో మీరు ధనికులు, ఇకనేం?’’ అంది సరళ హఠాత్తుగా ఆవేశపడి.
అందరమూ సరళ కేసి నిశ్చేష్టులయి చూస్తూన్నాం. అంత హఠాత్తుగా వివాహం సంగతి ఎత్తి అంత ఆవేశంగా మాట్లాడుతుందని మేమెవరమూ అనుకోలేదు.
‘‘మీరంతా నన్ను క్షమించాలి నా ఆవేశానికి. ముఖ్యంగా మీరు రాజేంద్రబాబూ; నేనన్న మాటలు మీ గురించికాదు, మీరు అన్యథా తలచకండి. వివాహపు బంధనం అవిచ్ఛిన్నమైనదని భావించి బలి అయిపోయిన ఒక ప్రాణ స్నేహితురాలు జ్ఞాపకమొచ్చింది. అది చాలా విషాదగాధ, చెప్పమంటారా?’’ అంది మరల సరళ.
‘‘చెప్పు సరళా; తప్పకుండా చెప్పు, విని చేయగలిగిందేమీ లేకపోయినా అలాంటివి జరుగుతూ ఉంటాయని తెలుసుకోవడం మంచిది,’’ అన్నాను నేను.
సరళ ‘లఖియా’ కధ మొదలు పెట్టింది.
“లఖియా నా బాల్య స్నేహితురాలు, నాకు యశోతో పరిచయం అయ్యేటప్పటికే తను కాపుర నరకంలోకి తోయబడింది. తనకి పదహారేళ్లేడు నిండకుండానే పెళ్ళిచేసారు వాళ్ళ పెద్దలు. ఈ సంఘటన జరిగి మూడేళ్లయింది ముస్సోరిలోనే, అప్పటికి లఖియాకు వివాహమై నాలుగు సంవత్సరాలై ఉంటుంది చక్కటి రూపం వెన్నలాంటి హృదయం అమృత కలశంలాంటి మనస్సు ఆమెది. భర్త కూడా అందగాడే కానీ క్రూరుడు; లోకంలోని దుర్గుణములన్నీ అతనిలోనే ముర్తీభవించాయి. లఖియాని చాలా కష్టం పెట్టేవాడు అన్నింటినీ ఆమె సహించేది. లఖియా కోసం అప్పుడప్పుడు వాళ్లఇంటికి వెళ్లేదాన్ని, నన్ను మంచి చేసుకోవటానికి ప్రయత్నించేవాడు. ఎందుకో అతనిని చూస్తేనే నాకు భయం వేసింది. ఒక రోజు సాయంకాలం ఆమె ఇంటికివెళ్లాను. లఖియా లోపల ఉంది. నేను లోపలికి వెళ్తూంటే నా వెనుక తలుపు మూసిన చప్పుడయి నేను తిరిగి చూశాను. లఖియా భర్త చేసినపని అది, నావైపు నడిచి వస్తూ, ‘సరళా. నీతో కాస్త మాట్లాడాలి’ అన్నాడు. నానోట మాటరాలేదు. ఎంత ధైర్యంగాఉందామనుకున్నా కాళ్ళు వణకసాగాయి. ఇంతలో లఖియా లోపలి నుంచి వచ్చింది.
‘‘నువ్వు ఇక్కడకు ఎందు వచ్చావు, లోపలికి పో,’’ అన్నాడు అతను వుద్రేకంతో.
‘‘పోను, సరళ నాకోసం వచ్చింది,’’ అంది లఖియా దృఢంగా.
కోపంతో ముఖం అంతా ఎర్రబడి పోయి, ‘పోవా’ అని హూంకరించాడు.
లఖియా ఈ సారి జవాబివ్వలేదు. హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని ‘‘సరళా. నువ్వు పెరటి గుమ్మంగుండా బయటికి వెళ్లిపో. నా కోసం వీరిని క్షమించు,’’ అని నన్ను బయటికి తోసేసి గడి వేసింది.
ఇదంతా క్షణకాలంలో జరిగింది. నా కళ్లు స్వాధీనం తప్పాయి. ఎలాగో పెరటి గుమ్మంగుండా బయటికి వచ్చేసరికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ లఖియా అసహాయ అర్తనాదం వినబడింది. వీధి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి చైతన్యరహితమైన అమె శరీరం నా కాళ్లకు తగిలింది. నా కేకవిని మా డ్రైవరు రామన్న పరుగెత్తుకు వచ్చాడు. లఖియాను కారులో పడుకొబెట్టాం. రామన్న కోపాన్ని ఎంతో కష్టంమీద శాంతిపచేశాను. ఇంటికి తీసుకొచ్చాను. డాక్టరు ఎంత ప్రయత్నించినా మానవత్వంలేని ఆమె భర్త డొక్కలో తన్నిన తాపులకి ఆమెకు రాత్రంతా స్పృహరాలేదు. మరునాడు తెలివొచ్చి తన ఇంటికి తాను వెళ్లిపోతానంది. బహుశా ఓపికవుంటే వెళ్లేది. నేను ఆ కిరాతుడి వద్దకు పంపనందుకు లఖియా నామీద చాలా కోపపడింది. తనకు కొంచెం స్వస్థత చిక్కినవెంటనే భర్త వద్దకు పంపించి వేస్తానని వాగ్దానం చేసిన తర్వాత మందులు, ఆహారం తీసుకోవటం మొదలుపెట్టింది.
లభియాని ఎంతో వేడుకునేదానిని. భర్తకు విడాకులివ్వమని, ఆ బాధ్యత నేను వహిస్తానని, దానికి ఆమె కెనలేని కోపంవచ్చింది.
‘నువ్వు నా సోదరివి కాబట్టి నీ నోట ఆ మాటవిని సహించాను. సరళా, కాని నువ్వైనా ఆ మాట మళ్లీ అనవద్దు. భర్త ఎన్నటికీ భర్తే. నా మెడలోని ఈ పుస్తెని తెంచే శక్తి మానవమాత్రునికి లేదు. కాని నా భర్తను నేను పొందగలననే విశ్వాసం నాకుంది. నేను ఎన్నడూ ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ఏ పాపము చెయ్యలేదు. అలాంటప్పుడు భగవంతుడు జీవితాంతం ఎందుకు శిక్షిస్తాడు. ఈ విధంగా నా భర్త అనురాగం నాకు తిరిగి లభిస్తుందనే విశ్వాసం నాకు ఉంది. నన్ను భగవంతుని పాదపద్మముల వద్ద వదలి, నువ్వు నిశ్చితంగావుండు సరళా. అదే నేను నీ నుండి కోరేది’’ అంది చివరకు..
ఈ మాటలు చెప్తూ సరళ కంఠం అవరుద్ధమయిపోయింది. కళ్లలోంచి కన్నీరు తొంగి చూస్తూందేమో అనుకున్నాను. కాని ఒక క్షణంలో ఆమె తనను తాను సంబాళించుకుంది తిరిగి చెప్పటం ప్రారంభించింది.
ఒక వారం రోజులకి ఆమెకు కొంచెము స్వస్థతకి వచ్చింది. లేచి తిరగటం మొదలుపెట్టింది. కాని పక్కలో పోట్లు పూర్తిగా పోలేదు. అయినా ఆమె వెళ్లిపోతానంది. ఇంకా కొన్నాళ్లుండమని ఎంతో ప్రార్థించాను.
‘‘ఇంకా ఇక్కడే ఉన్నానంటే ఆయన తిరిగి నన్ను రానీయడు. నన్ను ఎన్నటికీ క్షమించడు,’’ అంది.
నా నోట మాట రాలేదు. క్షమించవలసింది లఖియానా లేక లఖియా భర్తా? అర్ధాంగిని సృహతప్పేటట్టు తన్నినందుకు అతగాడు ఈమెని క్షమించాలట.
‘‘నీ అభిప్రాయం నాకు తెలుసు. కాని నాకు ఆయన అభిప్రాయాలు కూడా తెలుసు. క్షంతవ్యం లేనిదైనా వారిని నువ్వు క్షమించాలి. రేపే నేను వెళ్లిపోతాను నా భర్త వద్దకు, అనారోగ్యం కారణంగా పుట్టింటికి వచ్చి కొన్నాళ్లున్నాను. ఆరోగ్యం బాగుపడింది. ఇక తిరిగి పోవాలి,’’ అంది లఖియా నా ఊహలను గ్రహించి.
ఆ మరునాడే లఖియా వెళ్లిపోయింది. తర్వాత చాలాకాలం వరకూ ఆమె సంగతి తెలియలేదు. ఆమె మా ఇంటికి రాలేదు. వాళ్లఇంటికి వెళ్లడానికి నాకు భయం మానేసాను. అప్పుడప్పుడు తానే మాయింటికివచ్చేది. తను ఆ కసాయివానితో కాలం ఎలా గడుపుతుందో అని ఆశ్చర్యపోయేదాన్ని.
ఆఖరికి లఖియాను కలుసుకోకుండానే నేను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. రెండు నెలలు తర్వాత తిరిగి వచ్చాక రామన్న చెప్పాడు, లఖియా భర్త పోయాడని, తను ఇల్లువాకు తెగనమ్మి, అతని అప్పులన్నీ తీర్చ, కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్లిపోయిందని.
అతనైతే తన పాపాలని మూటగట్టుకుని, లఖియాను విధవను చేసి నరకంలోకి పోయాడు కాని ఆమె బాహ్యప్రపంచంలోకివెళ్లిందా లేక ఈ ఇల విడిచే వెళ్లిపోయిందా అనే అనుమానం అప్పుడప్పుడు కలిగేది. నన్ను ఎక్కువగా బాధించే సంగతేమిటంటే; తన సోదరి ఒకామె, ఆమెను ప్రేమించే తోటి స్త్రీ ఒకామె, జీవించే ఉన్నదనే విషయం లఖియా మరచిపోయిందని. నన్ను వదలి తనను దైవం తన పాదపద్మముల వద్ద నిశ్చితంగా ఉండమందో! లేక ఆ దైవం ఈమె ఇన్నికష్టాలు పడుతూ ఉంటే ఏం చేస్తూన్నట్లు? ఆమె చేసిన అపరాధం ఆయనని నమ్ముకోవటమేగా. లఖియా బతికివుంటే తిరిగి నా వద్దకు వస్తుందనే ఆశతో చాలా కాలం నిరీక్షించాను. రానురాను అదికూడా క్షీణించిపోయింది.
సరళ ‘కథ’ చెప్పటం ముగించింది.
ముగ్గురమూ ఆ గాధ చెప్తూన్నంతసేపు ఏదో మైకంలో ఉన్నట్టు విన్నాము. యశో కళ్లవెంట అనర్గళంగా కన్నీరు స్రవిస్తూంది.
“అంతే సరళా, నువ్వు చెప్పిందే నిజం, కష్టాలు సహించేవాళ్లనే సమాజమూ, దైవమూ కష్టాలు పెడతారు. నువ్వు నీ కర్తవ్యం నీవు చేయగలిగింది చేశావు. అదే చాల,.’’ కొంతసేపటికి కన్నీళ్లు తుడుచుకుంటూ యశో అంది,
‘‘దైవం చేసే అన్యాయానికి మనమేం చేయలేం యశో. కాని సంఘపు అన్యాయాన్ని మనం సహించకూడదు. లఖియా దుఃఖానికి ముఖ్యకారణం ఏమిటి? ఒక అపరిచిత వ్యక్తిని ఎవరినో వివాహమాడింది. అదే మూలకారణం. తనకు తెలిసిన వ్యక్తిని వివాహమాడినట్లైతే ఇవన్నీ తప్పును. హిందూ సమాజం స్త్రీకి చాలా అన్యాయం చేస్తూంది. స్త్రీకి యుక్తవయస్సు రాకుండానే, అసలు బాల్యంలోనే, వివాహం చేస్తారు. భర్తను మొదటిసారిగా వివాహపు మంటపం దగ్గర చూస్తుంది ఆడది. తనను చిన్నతనం నుంచీ ప్రేమించిన వ్యక్తులు చాలా మంది ఉంటారు, తలిదండ్రులు, అక్కచెళ్లెళ్లు, అన్నదమ్ములు, స్నేహితులు., అయినా, వివాహితస్త్రీ వారందరినీ విడిచి వారియెడ తన ఆప్యాయత మరచి, భర్త పుస్తెకట్టిన మరుక్షణం నుంచీ అతనిని వీరందరికన్నా మిన్నగా ప్రేమించాలంటారు,” అంది సరళ.
“దీన్ని స్త్రీవాదం అనవచ్చు,” అన్నాను
“కాని, నేనే శ్రీకారం చుట్టేనను,” అని నవ్వి, తన ఉపన్యాసం కొనసాగింది, “అంతేకాదు, అప్పటివరకూ తను ప్రాణప్రదంగా కాపాడుకుంటూన్న తన సర్వస్వాన్ని భర్తకు సమర్పించాలంటారు. ఎవరో నల్లగానో, లేక తెల్లగానో ఉన్న ఈ నూతన వ్యక్తి అవసరం తనకేమిటి? ఎందుకు ఇతగాడికి తను అన్నీ సమర్పించాలి? జీవితం మధ్యలో హఠాత్తుగా ఎక్కడనుంచీ వూడిపడ్డాడు ఈయన. అందరికంటె మిన్నగా ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నలగురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఆలోచించిన వారికి జవాబులు దొరకవు. తర తరాల నుంచీ వస్తూన్న అర్ధంలేని ఈ తతంగానికి ఎదురు తిరగరు. దారీ తెన్ను కనబడక ఇతరులను అనుసరిస్తారు. చనిపోయే లోపున పిల్లల్ని కని, వారికి కూడా తమ తీరులోనే వివాహం జరిపిస్తారు మన ఆడవాళ్లు. ఈ ఆడదాని నాటకానికీ ఇప్పటికైతే ఆఖరి అంకంలేదు, బహుశా ఎప్పటికీ ఉండదేమో! కాలగర్భం నుంచీ జన్మించింది గనుక ఆమె
Comments (0)