క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
కొంతసేపటివరకూ గురువుగారు శిష్యురాలిని అనుగ్రహించలేదు. చివరకి యశో దగ్గరికి వెళ్లి నమస్కరించింది.
‘‘వచ్చావా సుందరీ, నీ రాక కోసం చూస్తున్నా,’’ అన్నారు గెడ్డం రాసుకుంటూ.
అప్పుడు మాకేసి తన చెయ్యి చూపిస్తూ యశో చెప్పిన పిదప, అయన తలూపితే మమ్మల్ని రమ్మని సైగ చేసింది.
అప్పుడు, సరళ ననేనుఆయన దరిచేరి వినయంగా వంగి నమస్కరించాము, అంటే, యశో ముందర చెప్పినట్టు చేశాము.
‘‘శుభం, నూతన దంపతుల్లా ఉన్నారు. చిరకాలం యీ పవిత్రబంధంలో ఇమిడి ఉండండి నాయనలారా,’’ అన్నారు చిరునవ్వు నవ్వుతూ.
కథంతా అడ్డం తిరిగింది. ఇదెక్కడ గురువు ఈయన. నేను యశో వైపుచూశాను. కత్తివాటుకునెత్తురుచుక్క లేక ఆమె ముఖం వెలవెలబోతూంది. సరళ తనలోతాను నవ్వుకుంటూంది.
‘‘కాని స్వామీజీ, వీరిద్దరూ దంపతులు కారూ...’’ అని యశో ఏదో చెప్పబోతూంటే స్వామీజీ అడ్డువచ్చారు.
‘‘అయినా ఏమీ ఫర్వాలేదమ్మా. త్వరలోనే దంపతులవుతారు. నామాటకు తిరుగు ఉండదు,” అన్నారు.
యశో నోట మాట రావటంలేదు. పెదిమలు కదులుతున్నాయి కాని మాటలు వినబడలేదు. ఇప్పుడు సరళ రంగంలోకి ప్రవేశించింది.
‘‘కానీ నాకు భర్త ఉన్నాడు స్వామీజీ. వారిని వదలిపెట్టి వీరిని కట్టుకోమని తమరి మీ ఆజ్ఞగా భావించనా?’’ అంది సరళ.
ఇంత సూటిగా అడిగేటప్పటికి గురువుగారు చప్పబడ్డారు.
‘‘ఏదైనా నా మాటకు తిరుగుండదు,’’ అన్నారు సాలోచనగా.
‘‘అప్పుడు ఈయన్ని మీ ఆశీర్వచనానికి మావారిగా తీసుకు రావచ్చా?’’ అంది సరళ వదిలిపెట్టక.
సరళ మాట నాకు నచ్చలేదు, చాలా దూరం పోతోందనుకున్నాను. ఈ మాటలతో యశో మరీ కుంగిపోతున్నట్టు కనబడింది. అక్కడ ఉన్న సన్యాసినులు వింతగా చూస్తున్నారు ఈ వాగ్యుద్ధాన్ని.
‘‘ఏది ఏమైనాకాని నా మాటకు తిరుగు ఉండదమ్మా’’ అన్నారు గురువుగారు కాస్త కంగారుపడుతూ.
జవాబు చెప్పబోతున్న సరళను నేను వారించాను కాని, యశోకి ఏమనాలో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
‘‘ఇక సెలవు తీసుకుంటాము స్వామిజీ ,’’ అన్నాను.
ఈమాట అనేసరికి ఆయనకి ఊపిరి పీల్చుకోవడానికి సందు దొరికింది.
‘‘మంచిది ఇంకా కొన్నాళ్లు ఉంటావనుకుంటాను. మళ్లీ ఎప్పుడైనా కనబడు నాయనా,” అన్నారు.
అంటే ఆ ఆహ్వానం కేవలం నాకు మాత్రమే, సరళకు కాదు.
బయటకి వచ్చిన వెంటనే సరళ మొదలుపెట్టింది.
‘‘మా భలే గురువుగారు, మిమ్మల్ని మళ్లా కలుసుకోమన్నారు. ఈయన గెడ్డం లాగి చూడండి, ఉంటుందో వూడుతుందో,’’ అంది.
నేనేమీ మాట్లాడలేదు, నేను యశో గురించే ఆలోచిస్తున్నాను. ఆమెకి కలిగిన క్షోభ నేనే గ్రహించాను. ఒక వైపు గురువుగారి ఎడ ఆమెకు గల అపార విశ్వాసం, ఇంకో వైపు ఆయన భయానక శాపం. ఇప్పుడు తను నా వ్యక్తిత్వాన్ని నమ్మాలా , లేక గురువుగారి వాక్సుద్ధిని విశ్వసించాలా? ఈ బూటకపు గురువు, యశోని ఈ అడకత్తిరిలో పడేసి ఎంత మనోవ్యధకు గురిచేసాడు! నా ‘అమ్మీ’ ఎల్లా భరించగలదీ మనో వేదన?
‘‘మీరు కూడా ఆయన మాటలకి విలువ ఇస్తున్నారా? మిమ్మలను లేవదీసుకు పోతానని భయపడుతున్నారా రామంబాబూ?’’ అంది నా మొహాన్ని చూసి సరళ.
సరళ స్వభావమేమో నాకు తెలుసు, ప్రతీదీ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పుతుంది, అయినా యశో మానసిక సందిగ్ధత ఆమె కెలా తెలుస్తుంది?
‘‘అది కాదు సరళా. నేను యశో గురించి ఆలోచిస్తున్నాను. ఆ ఆశీర్వాదం ఎంత భయంకరమైందో చూడు,’’ అన్నాను.
సరళ నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూసింది.
‘‘భయంకరమా. ఇందులో నాకు భయంకరమైనదేదీ కనబడలేదు రామంబాబూ. మీరంతా ఒక దొంగ సన్యాసి మాటలకి ఎందుకు విలువ ఇస్తున్నారో నాకర్థం కావటం లేదు. చక్కటి ఈ రోజును పాడు చేశాడు. ఈ దొంగ గురువు,’’ అంది తను.
సరళతో ఇక వాదించటము అప్రయోజకమూ, అసందర్భము అని నేను ఊరుకున్నాను. ఈమె గురువు గారిని అనవసరంగా ఉసి కొల్పిందనే కోపం కూడా వచ్చింది. ఆ కోపం ఎంత అసమంజసమో నాకు అప్పుడు తెలియదు. నేనేమి మాట్లాడలేదు. ఇద్దరం అక్కడ నుంచి లఖియా కుటీరం వద్దకు వచ్చేశాము.
‘‘కాస్సేపు లోపలికి వెళ్లి కూర్చుందాము రామంబాబు .. యశో అప్పుడే రాదుకదా’’ అంది సరళ.
ఆమెకు ఇంకా కోపం తగ్గలేదు.
“ఉహూ ఇప్పుడు నేను పోతాను,” అన్నాను.
నా కంఠంలో అనవసరమైన కాఠిన్యత ఉందేమో, సరళ కాసేపు అలాగే నుంచుండి పోయింది.
“రామంబాబూ... నాక్కూడా కొంచెం పని ఉంది. సాయంత్రం రాజేంద్ర వస్తాడనుకుంటాను సామాను సర్దుకోవాలి,’’ అంది తను.
‘‘సరే సరళా. అలాగే కానీ, వెళ్లే ముందు కనబడతావు కదూ?’’అన్నాను.
‘‘కనబడతాననే అనుకుంటాను, లేకపోతేమటుకూ నష్టమేముంది,” అంది.
ఆ సమాధానం నన్ను దిగ్భ్రాంతుడ్ని చేసింది.
“రామంబాబూ, మనము బతకాల్సిన రోజులు చాలా ఉన్నాయి,’’ అని లోపలికి వెళ్లిపోయింది.
నేను కాసేపు అలాగే నుంచుని, వెళ్లిపోవటానికి బయలుదేరుతూంటే హఠాత్తుగా లఖియా ఎదురైంది.
‘‘అరే, ఇదేమిటి రామంబాబూ. ఒంటరిగా బయట నుంచున్నారు. లోపలికి పదండి,’’ అని లోపలికి దారితీసింది.
అనుకోకుండానే ఆమె వెంట నేనూ బయలుదేరాను. తలుపు తోసి లోపలికి వెళ్లేటప్పటికి సరళ మంచం మీద పడుకుని ఉంది. తలుపు చప్పుడు వినికూడా లేవలేదు.
‘‘సరళా, ఏమిటి ఇప్పుడు పడుకున్నావు. లే.. రామంబాబు వచ్చారు,’’ అంది లఖియా.
సరళ అప్పుడు ముఖం పైకెత్తింది. ఆ ముఖం చూసి నేను ఆశ్చర్యచకితుడనయ్యాను. రెండు మూడు నిమిషాల క్రితం చూసిన దానికి, దీనికి పోలికేలేదు. ముఖమంతా ఎర్రగా గీచిన కందలాగ ఉంది. సిగ్గుతో కుంగిపోతూన్నట్టు ఉంది. బొట్టంతా నుదిటి పైనుంచి చెదిరిపోయింది. తలలోని సన్నజాజి దండ క్రింద పడిపోయింది.
ఆ పరిస్థితిలో చూశాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. ‘‘ఇప్పుడు కాదు, లఖియా మరోసారి వస్తాను. ఇప్పుడెళ్లి పడుకుంటాను,’’ అని బయటకి వెళ్లిపోయాను.
బయటకి వచ్చిన వెంటనే ఎవరో తరుముకు వస్తున్నట్టు గబగబా నడిచాను. ఆ సరళ ముఖమే నన్ను తరుముకు వస్తున్నట్టనిపించింది. దాని అర్థం ఏమిటి? సరళ మనసులో విపరీతమైన కోరికలు దాగిఉన్నాయా?
లోపలికి వచ్చి చాలాసేపటి వరకూ మంచం మీద కూర్చుండిపోయాను. గురువు గారి ఆశీర్వాదం, సరళ ఆయనతో అన్న మాటలు, యశో వ్యాకులపాటు, సరళ ఎర్రటి ముఖం ఇవన్నీ కలసి నన్ను చాలా కలవరపరిచాయి. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఈ గురువు దొంగ సన్యాసా? లేక భవిష్యను చెప్పగల యోగిపుంగవుడా? రెండవదే నిజమైతే నేనింత నీచుడను?
ఎంతసేపు అలా ఉన్నానో సరిగా తెలియదు. తలుపు చప్పుడుతో మళ్లీ ప్రపంచంలో పడ్డాను. యశో లోపలికి వచ్చింది. ఆమె ముఖం నేనూ ఊహించిన దానికన్నా ఉత్సాహంగానే ఉంది.
‘‘మిమ్మల్ని చూసిన నిన్నటి సుదినం ఇవాళ ఎంత దుర్దినంగా మారింది! తప్పంతా నాదే, కర్మ కాలి, మీ ఇద్దరినీ ఒకేసారిగా నమస్కరించమని చెప్పాను. అయినా ఫర్వాలేదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాటి ఫలితం పోతుందని చెప్పారు గురువుగారు,’’ అంది నా పక్క మంచం మీద కూర్చుని.
‘‘ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి తప్పు ఎవరు చేశారు. తప్పేమైనా ఉంటే అది మీ గురువుగారిదే,’’ అన్నాను.
‘‘అబ్బే, గురువుగారి తప్పేమీ లేదు ఇందులో, నేనూహించలేదు, బహుశ , స్వాభిమానం వల్ల ఆయన తన మాటాల్ని తిరిగి తీసుకోవడానికి సందేహించారు. కాని నా కెంతో భయం వేసింది. ఆ మాటలు వింటుంటే, ’’ అంది నా చేయి తన చేతిలోకి తీసుకుంటూ.
“గురువుగారి మీద ఇంత విశ్వాసం ఎందుకు కలిగింది నీకు,’’ అన్నాను కంఠస్వరంలో కోపం వ్యక్తం చేస్తూ.
నాకుయశో తన మౌనంచే సమాధానమిప్పించింది
‘‘అయితే ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఏమవుతుంది యశో. ఆయన శాపం ఫలిస్తుందంటావా? నా మీద నీ కంత అపనమ్మకమా?’’ అన్నాను ఊరుకోక.
‘‘ఛీ, అలా అనకండి, మీ మీద నాకు నమ్మకం లేకపోవడ మేమిటీ. అది కాదు ప్రాయశ్చితం చేసుకోకపోతే వాటి చెడు ప్రభావం ఉండిపోతుంది, అంతే, ’’ అంది.
‘‘చెడు ప్రభావం ఉండిపోతే ఏమవుతుంది యశో,’’ అన్నాను అసహనంగా.
“ఊరుకోండి మీరు. మీకివన్నీ తెలియవు. అయినా చేసేదానిని నేను, మీరుకాదు కదా. అలాంటప్పుడు మీకెందుకు బాధ?’’ అంది.
ఇంక నేను వూరుకున్నాను. ఈ మూఢ విశ్వాసానికి హద్దులేదు.
మరునాడు ఉదయం తన భార్యను తీసుకు వెళ్ళడానికి రాజేంద్ర వచ్చాడు అయితే చిన్నపిల్లలా లఖియాని వదలి వెళ్లనని సరళ చాలా పంతం పట్టింది. రాజేంద్రకి కొంచెం కోపం కూడా వచ్చింది కాని సరళ అక్కడ ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. తనని వారానికి ఒక సారి తీసుకు రమ్మన్నా తీసుకొస్తా నన్నాడు. తరువాత లఖియా నచ్చచెప్పగా, సరళ ఆరోజే వెళ్ళడానికి సిద్ధపడింది.
మధ్యాన్నం భోజనం చేస్తున్నంత సేపూ సరళ నాతో మాట్లాడలేదు,
‘‘మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?’’ అంది వెళ్లిపోయేముందు నాదగ్గరకు చేరి.
“ఇది నువ్వు నన్ను అడగాల్సిన ప్రశ్నకాదు సరళా. ఇక్కడ నేనొక అతిథిని మాత్రమే,’’ అన్నాను.
“రామంబాబు, మీకు నేనే సలహాలు ఇవ్వాల్సిన దానిని కాదు. అయినాకాని ఇది చెప్తాను. తన శక్తికి మించిన పనిని ఎవరి వద్దా ఆశించకండి. మానవ బలహీనతకు కాస్త చోటివ్వండి. ఇదివరకొక సారి చెప్పాను, తప్పులేకుండా మీరు ఎవరిని శిక్షించలేదు. అదే ఈనాడు మీకు తిరిగి గుర్తు చేస్తున్నాను,’’ అంది.
చాప్టర్ 19
క్రమబద్ధంగా నా జీవితం నడవసాగింది. చేసే పనిలేదు; బాధ్యత లేదు; విచారం లేదు, కాలంతోపాటు దొర్లిపోవటమే మిగిలింది. అదే చేశాను. పొద్దున లేచేటప్పటికి యశో గంగలో స్నానం చేసి వచ్చి కాఫీ కాస్తూ వుండేది. అప్పుడప్పుడు నేను కూడా ఆమెతో గంగవద్దకు వెళ్లేవాడిని. ఆమె స్నానం చేస్తూంటే నేను పువ్వులు కోస్తూ వుండేవాడిని. నన్ను వాసనలేని పుష్పాలనే కోయమనేది.
‘‘అంటే నేను కూడా ఒక వాసనలేని పుష్పాన్నా, అమ్మీ, అన్నాను’’ ఒకసారి.
‘‘కాదు, దానికి వ్యతిరేకం మీరు, మీలోని సువాసనే ఇతరులను ఆకర్షిస్తుంది. అందంకాదు,’’ అంది యశో నవ్వి.
స్నానం చేసి ఆమె దైవపూజకు పుష్పాన్ని కోసేది. నేను కోసిన పుష్పాన్ని జత చేసి ఎంతో ఇష్టంగా తన తలలో తురుముకునేది.
మధ్యాహ్నం భోజనాలైన తర్వాత యశో గుడికి వెళ్లిపోయేది. మళ్లీ సాయంకాలం వరకు వచ్చేది కాదు. ఆ సమయంలో నేను ఒంటరిగా గడపాల్సి వచ్చేది. సాధారణంగా ఆమె దగ్గర ఉన్నంతసేపు శరవేగంతో కాలం గడచిపోయేది. ఇద్దరం పలు విషయాలు చర్చించేవాళ్లం. ఆమెతో చాల విషయాల్లో నేను ఏకీభవించే వాడిని కాదు. కాని అన్నింటిలోనే ఆమెని వ్యతిరేకించలేదు, గౌరవించేవాడిని. చాలా వాటిలో నా అభిప్రాయాలని కొనసాగించాలనుకునేది. జీవితంలో నేను చాలా మంది స్త్రీలను చూశాను, పలువురు స్త్రీల పరిచయ భాగ్యం నాకు లభించింది. సుశీ, యశో, లఖియా వీరందరి పట్ల దైవం కఠినంగా వ్యవహరించాడు. దైవం మీద నా విశ్వాసం మరింత సడలింది. పుష్పంలాంటి సుకుమారి లఖియాకి ఒక పశుప్రాయుడైన భర్తని అంటగట్టేడు. స్ఫటికంలాంటి ఆమెను విధవని కూడా చేశాడు.
‘‘రామంబాబూ, సుందరి మీ గురించి చాలా సంగతులు చెప్పింది. కాని ఈ విషయం మీరే చెప్పాలి. యశో ప్రేమను తిరస్కరించగల శక్తి మీకెక్కడిది? అది తప్పుకాదా?’’ అంది ఒకనాడు లఖియా సూటిగా.
‘‘నేను తిరస్కరించానని నువ్వు ఎలా అనుకున్నావు లఖియా? అలా అయితే నేనిక్కడ ఎందుకు ఉంటాను చెప్పు. వివాహ బంధనారహితంగా స్త్రీ పురుషులు ఒకరికొకరు లభించలేరా? ప్రేమించుకునే స్త్రీ పురుషుల మధ్య దాంపత్యం మినహా వేరే ఔన్నత్యానికి తావు లేదా?’’ అన్నాను జవాబు కోసం కాస్త తడుముకుని.
లఖియా ఏమీ మాట్లాడలేదు.
‘‘యశో నీకు సుశీ గురించి చెప్పిందా?’’ అన్నాను నేనే కాసేపాగి.
“అవును అంతా చెప్పింది,” అంది.
“అయితే నేను చేసినదే ఉత్తమమైనది కదా? ఆమెని నేనెలా మరువగలను. వివాహ బంధనం అవిచ్ఛిన్నమైందని నువ్వంటావు. ఎక్కడనుంచి వచ్చింది ఆ బంధనానికి అంత శక్తి? యశో ఒకసారి అంది, ‘ఇతరులు మీకు లభించవచ్చు కాని, ఇతరులకు మీరు లభించలేరు’ అని. ఇప్పుడనిపిస్తోంది అది నిజమేననీ, ” అన్నాను ఆవేదనగా.
చాలాసేపు లఖియా మాట్లాడకుండా ఊరుకుంది.
“రామంబాబూ. ఈ విషయంలో మీమాటే నిజమనిపిస్తోంది,” అంది సాలోచనగా.
సరిగ్గా అదే సమయానికి ‘ఆనాటి’ యశో తిరిగి వచ్చింది.
“ఏమిటి, లఖియావద్ద చాడీలు చెప్తున్నారు,’’ అంది నవ్వుతూ
‘‘చాడీలు చెప్పేవారైతే బాగానే వుండును సుందరీ. వీరిని వంటరిగా వదిలి ఇంత సేపు వెళ్లిపోతూన్నావు కదా. ఈయన ఒక్కరూ ఏం చేస్తారు చెప్పు,’’ అంది లఖియా మందహాసంగా.
“నేనేం చెయ్యను లఖియా? అవతల గురువుగారు, ఇక్కడ ఈయన, మధ్య నేను నలిగిపోతున్నాను,’’అంది యశో అసహాయంగా.
“గురువుగారికి సేవ చెయ్యడానికి చాలామంది వున్నాము. వీరికైతే నీవొక్కరివే కదా,” అంది లఖియా.
యశో కాస్త సిగ్గుపడింది.
‘‘సరే అమ్మీ. కాస్త కాఫీ చూడు, కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి,’’ అన్నాను.
చాప్టర్ 20
యశో ఒకరోజు గురువుగారి దగ్గరకు చాలా ముందరగా వెళ్లిపోయింది. ఎందుచేతో ఏమీ తోచడంలేదు. అయినా లఖియా కూడా యశో వచ్చేవరకూ రాదు. అందుకని ఆమె దగ్గరికి నేనే బయలుదేరాను.
“లఖియా,” అని పిలిచాను తలుపు వద్దకు వెళ్లి.
‘‘లోపలికి రండి రామంబాబూ. తలుపు తెరిచే ఉంది,” తక్షణమే జవాబు వచ్చింది.
తలుపు తోసుకుని లోపలికి వెళ్లాను.
తను చీర కట్టుకుంటూ ఉండడం చూసి నేను వెనకంజ వేయబోయాను, కానీ తను అలానే నాకేసి తిరిగి మందహాసంచేస్తూ అంది,
"రండి నాకు మీరేమీ పరాయివారు కాదు”.
ఎందుకోగానీ ఆ స్థితిలో చూసిన ఆమె అద్వితీయసౌందర్యం ఆమెపై నాకున్న అపార ఆప్యాతను ద్విగుణీకృతంచేసింది.
“కూర్చోమండానికి ఒక్క కుర్చీ అయినా లేదు, చాపమీద కూర్చోండి రామంబాబూ,” అంది ‘అరిగిన’ చీర కొంగు సవరించుకొంటూ.
నా మనస్సు చివుక్కుమంది.
“నువ్వలా అన్నావంటే చాపమీద కూడా కూర్చోను ఒట్టినేల మీద చతికిలపడతాను. అయినా, నువ్వు కూర్చోగాలేంది నేనెందుకు కూర్చోలేను చెప్పు,” అన్నాను.
“వద్దు అంతపని చెయ్యకండి చాపమీదే కూర్చోండి, ”అంది నవ్వుతూ.
చాపమీద కూర్చుని, ఒక సారి ఇళ్లంతా కలయచూశాను. యశో కుటీరం నిరాడంబరంగా ఉంది. లఖియా కుటీరంలో దారిద్ర్యం కనబడుతూంది. ఒక మూల పూజ సరంజామా ఉంది. దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. గదికి వెనుకవైపు ఒక దండెం వేలాడుతూ ఉంది. దాని మీద తెల్లటి చీరలు మూడున్నాయి. గదిలో చిన్న పెట్టైనా లేదు. అటువంటి గదిలో చాపమీద కూర్చుని లఖియా తన ‘అరిగిన’ చీర కట్టుకుంటూన్న దృశ్యం ఊహించుకుంటే ఎంత బాధ కలుగుతుంది? ఆమెకున్నవన్నీ తెల్లటి చీరలే. అందులో ఖరీదైన దొక్కటి కూడా లేదు. తోటి స్త్రీలంతా రంగు రంగుల చీరలు కట్టుకుని, పువ్వుల జాకెట్లు వేసుకుని ఘుమ ఘమా సంపంగి, సన్నజాజి వాసన వెదజల్లుతూ నడవగ లుగుతూంటే, వారందరినీ మించిన సౌందర్యరాశి, గుణవంతురాలైన ఈమెకి ఇది ఎందుకు ప్రాప్తించింది? తల మీద పువ్వు వుండటానికి వీల్లేదు. ముఖం మీద కుంకుమ పెట్టుకోవ డానికి వీల్లేదు. ఎందుచేత? భార్య చనిపోతే భర్త ఈ కఠోర నియమాలని ఎందుకు ఆచరించడు. ఆడవాళ్ళకి ఏ పాప ఫలం ఇది? దుష్ట శిక్షణా, శిష్ట రక్షణా విధులను నెరవేర్చే ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేశాడు?.
ఈ తరహా ఆలోచనలన్నీ క్షణకాలంలో నా మెదడులో మెదిలాయి. అప్రయత్నంగా నిట్టూర్పు విడిచాను.
‘‘నా మీద మీకు జాలి కలుగుతోందికదూ రామంబాబూ?’’ అంది.
“నీకు వైధవ్యంతో పాటు దారిద్ర్యం కూడా సంప్రాప్తించాలా?” అన్నాను.
మనస్సులోని బాధతో ఉబికిన మాటలవి.
“రామంబాబూ, కోపగించి పరిస్థితులను మార్చగలమా చెప్పండి,’’ అంది.
“నిరపరాధికి అన్యాయం జరుగుతూంటే కూడా చూస్తూ ఊరుకోమంటావా లఖియా? అయినా యశోని అనాలి, ’’ అన్నాను కోపంగా.
“ఇందులో సుందరి దోష మేమిలేదు, నేనే తన సహాయానాన్ని కాదన్నాను. దానికి తానెంత బాధ పడుతూందో నాకు తెలుసు,’’ అంది.
యశో ఉదార హృదయం లఖియా ఆత్మాభిమానం నా హృదయాన్ని కలసి కదలించగా, అప్పుడు వారిరువురికి మనోవందనం చేసాను.
“నువ్వు మమ్మల్ని నీకేమి చెయ్యనివ్వక పోవచ్చు లఖియా. అయినా బాధాకరమైన పరిస్థితిని ఏవగించుకోవటంలో తప్పేముంది,’’ అన్నాను.
‘‘మీరన్నది నిజమే. అన్యాయం జరుగుతూంటే సహించకూడదు. కానీ దైవం అకారణంగా ఎవరినీ శిక్షించడు రామంబాబూ. ఏ తండ్రికీ తన బిడ్డలని శిక్షించటం ఇష్టంగా వుండదు,’’ అంది.
‘‘అయితే ఏ దోషం లేకుండా నిన్ను దైవం ఎందుకు శిక్షిస్తున్నాడో చెప్పు,’’ అన్నాను.
‘‘దీనిని మీరు శిక్ష అంటారా? అంటే అనండి. నేను మీరనుకునేటంత నిర్దోషిని కాను రామంబాబూ. నా వైవాహిక జీవితంలో నాకు అనేక కష్టాలు ఎదురు వచ్చాయి. నా భర్త నన్ను ఆదరించక పోయి ఉండవచ్చు అయినా ఆయనని నేను హృదయపూర్వకంగా ఎన్నడూ ప్రేమించ లేకపోయాను. అగ్ని సాక్షిగా వివాహమాడిన భర్తని ప్రేమించటం నా విధి, .కానీ నేనలా చేయలేకపోయాను. అన్నింటినీ సహించేదానిని కాని ఆత్మార్పణ చేసుకో లేకపోయాను. బహుశా అందుకనే నాకు ఈ శిక్ష లభించింది,’’ అంది.
నా చెవులకు ప్రపంచం కూలిపోతుందా అనిపించింది. నాకు మాట రాలేదు. లఖియా జీవితంలోని కష్టాలు, అప్పటి ఇబ్బందులు తెలియవు నాకు, ఆమె చూపిన క్షంతవ్యమే కాని ఆమె చేసిన తప్పులేమీ ఎరుగను. ఆమె సర్వస్వమూ అతనికి అప్పగించింది. క్షుద్రమైన అతని జీవితానికి వెలుగు తీసుకువచ్చింది. అతనిని క్షమించింది కాని హృదయపూర్వకంగా ప్రేమించలేక పోయింది. అదేనా ఆమె చేసిన మహాపరాధం!
‘‘మంచితనానికీ, అమాయకత్వానికీ కేరాఫ్ అడ్రస్ లఖియా. కష్టాలన్నీ నీనెత్తిన వేసుకుని తరించుదామనుకుంటున్నావు. అంతేకాని మరేమీకాదు,’’ అన్నాను.
తన ప్రవర్తన మీద నాకు కోపం వచ్చిందని లఖియా గ్రహించింది.
‘‘అయితే మీకు తరించటం, స్వర్గం పోవటం మొదలైన వాటిలో నమ్మకముందా?’’ అంది.
‘‘లేదు, కొంచెమైనా లేదు,’’ అన్నాను.
‘‘కానీ నాకు నమ్మకం ఉంది, రామంబాబూ. అవన్నీ మిథ్య అయితే నేను కూడా మిథ్యే, ఆ దృష్టితో చూస్తే ప్రపంచమంతా మిథ్యే. సృష్టిలో మానవుని బుద్దికి అంతుబట్టని విషయాలున్నంతకాలం, మానవాతీతమైన పరమశక్తి ఒకటుందని మనం గ్రహించాలి. ఆ శక్తినే మనము రకరకాలుగా పిలుస్తాము. దైవం, విధి, కర్మ అంటాము. చివరకు అన్నీ ఒకటే. అయితే మీరు దైవాన్ని కూడా గుర్తించరా?’’ అంది.
‘‘దైవాన్ని నేను గుర్తిస్తాను లఖియా. కాని దైవపు పోకడలు నాకర్థం కావు. దైవపు బుద్ధికుశలతతో నాకు నమ్మకం సన్నగిల్లుతోంది,’’ అన్నాను.
‘‘అక్కడే మీరు పొరపాటు పడుతున్నారను కుంటాను రామం బాబు . దైవమేమి ఒక నియంత కాదు. దైవాన్ని అంగీకరించినట్లైయితే అతని తీరు కూడా మీరు అర్ధం చేసుకోవాలి. తన ఇష్టాలకీ, చేష్టలకీ ఏమీ సంబంధం లేదు. అదొక పోస్టాఫీసులాంటిది. కొంతమందికి శుభలేఖలు వస్తాయి, మరికొంత మందికి చావు కబురు వస్తుంది. ఎవరి ఖర్మ వారిది. ఇది గ్రహించడమే మానవుని బుద్ధికుశలత,’’ అంది.
“ఇంతకీ నువ్వనేది భగవంతుడికిహృదయం లేదంటావు అంతేగా?” అన్నాను.
“ఒక విధంగా అది నిజమేకానీ, మనము ‘హృదయవిహీను’డను మాటను నిందాపూరితంగా వాడుతాము. మంచితనమూ, చెడుతనమూ మనం హృదయంతో ముడిపెడతాము. అందులో సంశయం లేదు,” అంది.
ఇక ఏమనాలో నాకు తెలియలేదు. లఖియా తర్కశాస్త్ర పారాయణురాలని నాకు తెలియదు.
‘‘అయితే చెప్పు లఖియా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? కాలేజీలో నేర్చుకున్నావా? లేక వేదాలూ, పురాణాలూ చదివేవా? “అన్నాను.
లఖియా నవ్వింది.
‘‘లేదు రామంబాబూ. కాలేజీకి ఏమిటి, ఎన్నడూ స్కూలు కైనా వెళ్లలేదు, కాని ప్రపంచంలోని ఉత్తమ స్త్రీలలో ఒకామెను నేను తల్లిగా పొందగలిగాను. అది నా అదృష్టం,’’ అంది.
‘‘అది నీ అదృష్టమేకాదు, మా అందరి అదృష్టమూ కూడాను. లేకపోతే నీలాంటి అద్భుత వ్యక్తి మాకు లభించక పోనేమో?’’ అన్నాను.
లఖియా ముఖం సిగ్గుతో జేవురించింది.
‘‘వద్దు రామంబాబూ. మీరేమి నన్ను పొగడకండి. నేను చాలా అల్పురాలిని. అల్పులను ప్రశంసిస్తే అహంభావం అవతరిస్తుంది. అయినా మీకు నా గతజీవితం పూర్తిగా తెలియదుకదా,’’ అంది.
‘‘నువ్వొకనాడు వాగ్దానం చేశావు అది అంతా చెప్తానని, అయినా నీమీద నాకున్న సదభిప్రాయం మారేటట్లు అయితే అది చెప్పవద్దు. నాకు వినాలనే కోరికలేదు,’’ అన్నాను.
‘‘సదభిప్రాయం సహృదయం లోంచి జనిస్తుంది కనుక నిశ్చిన్తగా చెప్తాను. వినండి రామంబాబు,’’ అంది.
చాప్టర్ 21
ఎవరిని దుర్భాషలాడని భాషలో, ఎంతో సున్నితంగా లఖియా ఆత్మకథ సాగింది. తనలాగా అంత విపులంగా చెప్పడం నా చేతకాదు, అందుచేత పాఠకులకు దాన్ని క్లుప్తంగా, నాకు తెలిసిన తీరులో విన్నవిస్తాను.
ఆఖరికి మరణ శయ్యమీద లఖియా భర్తకు జ్ఞానోదయం కలిగింది.
‘‘నేను బతికి ఉన్నంతకాలం నిన్ను బాధ పెట్టాను లఖియా, నా తర్వాతనైనా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా భార్యవయినందుకు నా పాపాలు నీకేమీ అంటకూడదని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను,’’ అని తల నిమురుతూ చెప్పాడు.
అప్పుడు భర్తను తనకు దక్కించమని ఎంతో ప్రార్థించింది, కానీ దైవం అతడి నుంచి వేరుచేశాడు. చివరికయినా భర్త ఆదరణ లభించింది అతని అనురాగం పొందింది అందుకే అంతకంటె ఆనందకరమైన రోజులు తన జీవితంలో లేవు అనుకుంటుంది.
ఇల్లువాకిలీ అమ్మి, భర్త అంత్యక్రియలు చేసి అప్పులు తీర్చింది లఖియా. తరువాత నుదుట కుంకుమ చెరుపుకుని, తెల్ల చీర కట్టుకుని, నాలుగు మూటలతో గడప దాటింది లఖియా, కానీ ఎక్కడకు వెళ్లాలి? తిండిలేకపోతే పస్తువుండవచ్చు కానీ, అందమైన స్త్రీలకోసం అర్రులు చాచే క్రూరమృగాలున్న ఈఅరణ్యంలో వుండటానికి తలుపువున్న ఒక ఇల్లు వుండాలి. కానీ ఆ నీడనిచ్చే వ్యక్తి ఎవరు? తటుక్కున తల్లి ఒక నాడు చెప్పినమాట జ్ఞప్తికి వచ్చింది లఖియాకి, ‘ఎప్పుడైనా కష్టాల్లో వుంటే మామయ్య దగ్గరకు వెళ్లమ్మా, కాదనడు.’
లఖియా మామయ్య ఢిల్లీలో వున్నాడు. అయిదు సంవత్సరాల క్రితం భార్య హఠాత్తుగా కాలం చేసింది, ముగ్గురు కూతుర్లని, యిద్దరు కొడుకుల్ని భర్త మీద, గాలి మీద వదలి. అప్పట్నించి ఆయన అష్టకష్టాలు పడుతున్నాడు. ఏభై ఏళ్లు దగ్గిరకి వచ్చాయి. ఒక్కడూ ఏం చేయగలడు? ఒక వంటమనిషిని కుదుర్చుకుని, తల్లిలేని ఆ అనాధలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అటువంటి అక్కడకు ఆమె చేరింది. ఎన్నో ఏళ్ల తరువాత కలసిన మామయ్య, మేనకోడలికి చాలా ఆప్యాయంగా స్వాగతం పలికాడు.
లఖియాకి సోదంతా చెప్పి కంటతడి పెట్టుకున్నాడు.
“నువ్వు వచ్చావు ఈనాడు. మీ అమ్మకి ఒకప్పుడు వాగ్ధానం చేశాను. నీ కూతురు మీద ఈగ వాలకుండా చూస్తానని. పవిత్రమైన స్మృతిలో
Comments (0)