క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
‘‘అయితే మీరనేది ప్రేమించి పెళ్లిచేసుకోమంటారు అంతేనా?’’ అన్నాను.
‘‘ప్రేమించనక్కర్లేదు రామంబాబూ. పేరు తెలిస్తే పదివేలు. అతగాడెవరో, ఎలాంటివాడో, అతని అభిప్రాయాలతో తను ఏకీభవించగలదో లేదో, భవిష్యత్తులో నైనా అతన్ని ప్రేమించగలదో లేదో ఇవన్నీ అయినా కనీసం ఆమెకు తెలియాలి. భర్త కంఠస్వరమే అపరిచితంగా ఉండకూడదు ఆమెకి. మీకు తెలియదు రాంబాబూ. స్త్రీ హృదయం ఎంత కరుణార్ద్రమయినదో తన మీద కనికరం చూపించిన వ్యక్తికోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. అది కూడా కరువైపోయింది ఆమెకు,’’ అంది సరళ.
‘‘నువ్వు చెప్పింది చాలా మట్టుకు నిజం సరళా, ఇందులో లోపం కొంతవరకు స్త్రీలదే, సమాజాన్ని ఎదిరించే శక్తిని పుంజుకోరు వచ్చిన అవకాశాన్ని జారవిడుస్తారు,’’ అన్నాను .
‘‘అవును, లోపం స్త్రీలలోకూడా వుంది. కమల అని నాకొక స్నేహితురాలుండేది. నా అభిప్రాయాలతో ఏకీభవించేది. చివరకు ఎవరో అపరిచితుడిని వివాహమాడింది. తర్వాత పూర్తిగా వ్యక్తిత్వమే కోల్పోయింది. ఈనాడు భర్త మాటను జవదాటదు. అతని ఇష్టంలేని చీరకూడా కట్టుకోదు. ఒకసారి ఆమెని కారణం అడిగాను. ఆమె ఏమందంటే, ‘‘సరళా. భార్యాభర్తలలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. భర్తకు ఎదురుతిరిగానంటే నేను చివరికి బయటికి పోవాల్సి వస్తుంది. నాకంత ధైర్యంలేదు. అందరితోపాటు ఈ ఊబిలో నేనూ దిగిపోతాను.’’ వివాహమైన తర్వాత కలిగేది జ్ఞానం కామోను. కమలకిప్పుడు ఇద్దరు పిల్లలు. సావిత్రి దమయంతులను జ్ఞాప్తికి తెచ్చే భారత నారీమణి,’’ అంది సరళ.
దిల్ బహదూర్ భోజనం తయారైందని చెప్పాడు. భోజనాలయిన తర్వాత పిక్నిక్ కి బయలుదేరాము.
చాప్టర్ 12
డూన్‍కి నాలుగుమైళ్ల దూరంలో ఉంది ఆ ఆహ్లాదకర ప్రదేశం. దట్టమైన చెట్లు, వురకలు కక్కుతూ పరుగెత్తే సెలయేరూ, ఉత్సాహాన్ని ఉర్రూతలూగించే మలయమారుతం, ఇవన్నీ కలసి ఎంతో మనసు ను ఉత్తేజ పరుస్తాయి. కారుని ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఆపింది సరళ. ఆటలు ఆడి ఆడి అలసిపోయాము. కారులోంచి టిఫినూ, కాఫీ తీసుకుని ఆరగించాము. పరుగు పెట్టడంలో సరళ కాలు బెణికింది. తను అక్కడే కూర్చుంటానంది. నేను కూడా బాగా అలసిపోయాను.
“అలా ఆ సెలయేరు వద్దకు వెళ్లి వద్దాము వస్తారా?” అంది యశో నాతో కొంతసేపటికి.
‘‘ఇప్పుడు అక్కడికెందుకు యశో, నలుగురము ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం,’’ అన్నాను.
‘‘నేను మిమ్మల్నడిగింది వస్తారా, రారా అని, సరే, అయితే రాజేంద్రబాబు, మీరైనా నా సాంగత్యాన్ని సహించగలరా,’’ అని, యశో జవాబుకు ఎదురుచూడకుండా ముందుకు నడిచింది.
రాజేంద్ర జవాబివ్వలేదు. నా వైపు ఒక సారి చూశాడు. నేను సరళ వైపు చూశాను. తర్వాత అతడామె వెనుక సాగిపోయాడు.
వారిద్దరూ వెళ్లిపోయిన తరువాత మాలో ఎవరూ మాట్లాడలేదు. నేను సరళతో ఒంటరిగా ఉండడం ఇదే ప్రథమ పర్యాయం.
‘‘ఇందాకా మీరేమీ తినలేదు ఒక యాపిల్ ఇమ్మంటారా?’’ అంది తను మాటకలపడానికన్నట్లు.
ఆ కంఠస్వరంలో తీయని మార్దవం ఉంది. కళ్లల్లో అలసటా, అశాంతి కనబడ్డాయి. హఠాత్తుగా అన్న మాటలవి. ఉలిక్కిపడ్డాను. సరళ నాకు మొదటి నుంచీ జటిల సమస్యగానే ఉంది. ఆమె కంపిత కంఠస్వరం, చెదిరిన నేత్రాలు నన్ను వ్యాకులపరిచాయి. నేనేమీ మాట్లాడలేదు. యాపిల్ అందుకున్నాను.
‘‘కత్తికావాలా రామంబాబూ,’’ అంది సరళ సన్నగా నవ్వుతూ,
సరళ ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు నేను చేసిన రసాభాస జ్ఞప్తికి వచ్చింది. ఇంక నేనేమీ మాట్లాడలేదు.
“కొంత మందిని చూస్తూంటే రెక్కలు కప్పి రక్షించాలని బుద్ధిపుడుతుంది కదూ రామంబాబూ,’’ అంది.
నేను దిగ్భ్రాంతుడనయ్యాను, ఏమిటి సరళ, ఇవాళ ఇలామాట్లాడుతుంది? ఈమె మాటల్లో ఎమైనా నిగూఢార్ధం ఇమిడివుందా? నా మనస్సు అక్కడ రాజేంద్ర యశోల మధ్య జరుగుతున్న సంభాషణని ఊహించుకుంటూంది.
ఇంక నేను మాట్లాడలేదు.
‘‘మీకు ప్రేమలో నమ్మకముందా, రామంబాబు,’’ అంది.
హఠాత్తుగా చెవివద్ద వీణ మీటినట్లయింది. ఏదో అస్పష్టంగా అన్నాను బహుశా ఉందని కామోను.
‘‘నాకుమటుకు యేమంత నమ్మకంలేదు. అనేక సమయాల్లో నేనే అనేక మందిని ప్రేమించాను; ఈ క్షణంలో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నా సర్వస్వమూ మీదే; కానీ ఇదే విషయం ఇంకాసేపు పోయిన తర్వాత అనలేను. అదేమి ఖర్మోకాని, నన్ను ప్రేమించేవాళ్లను నేను తిరిగి ప్రేమించలేను. నన్ను ప్రేమించి నిరాశ చెందినవారు చాలా మంది ఉన్నారు రామంబాబూ;’’ అని, చిరునవ్వు నవ్వుతూ, ‘‘ఒకతను ధనికుడు, బాగానే వుండేవాడు. నేను తనని ప్రేమించకపోతే మా కారుకింద పడతానన్నాడు. భయంతో కొన్నాళ్లు కారు నడపటం మానేశాను. ఇదంతా మీకు అసందర్భ ప్రలాపములా కనబడుతోందనుకుంటాను; ఇవ్వాళ మనస్సంతా చాలా చంచలంగా ఉంది. రామంబాబు! మీరు నన్ను క్షమించాలి,” అంది తను.
హృదయమంతా ఆమెయెడ కృతజ్ఞత, జాలితో నిండిపోయింది. ఒక అందమైన స్త్రీ క్షణికమైనా, తనను ప్రేమిస్తానని చెప్పినప్పుడు ఏ యువక హృదయం చలించదు. సుశీ, యశో నాతో ఎన్నో ప్రేమ వాక్యాలు పలికారు కాని ఎన్నడూ ‘నేను మిమ్మల్ని ఈ క్షణంలోప్రేమిస్తున్నాను. నా సర్వస్వమూ మీదే’ అని చెప్పలేదు. కాని ఈ విచిత్ర యువతి ఒంటరిగా నాతో మొదటిసారి మాట్లాడుతూ అలా చెప్పగలిగింది. తను నమ్మిన వాటినీ, వాంఛించిన వాటినీ నిర్భయంగా, నిస్సంకోచంగా వెల్లడించగల శక్తి ఈమెలోఉంది.
‘‘ఎందుచేత సరళా నిన్ను ప్రేమించేవాళ్లను నువ్వు తిరిగి ప్రేమించలేవు?’’ అన్నాను.
‘‘నాకూ తెలిస్తేగా మీకు చెప్పడానికి రామంబాబూ. కాని అప్పుడప్పుడు చాలా అశాంతిగా ఉంటుంది. ఈనాడు లఖియా జ్ఞాపకమొచ్చి మనస్సంతా పాడైపోయింది,’’ అంది.
‘‘లఖియా విషాద గాధ విన్నప్పటి నుంచీ నా మనస్సు కూడా సరిగా లేదు సరళా. జీవితంలో హృదయానికి హత్తుకుపోయిన కొద్ది మంది స్త్రీలలోను లఖియా ప్రథమస్థానం ఆక్రమిస్తుంది’’ అని, ఆమెగురించి ఆలోచిస్తూ, ఆమె రూపాన్ని ఊహించడానికి ప్రయత్నించాను.
‘‘నీలా యశో లా లఖియా కూడా అందంగా ఉంటుందా సరళా?’’ అన్నాను ఆఖరికి.
‘‘యశో లో లఖియా పోలికలు కనబడుతాయి రామంబాబూ. అందుకనే యశో అంటే నాకంత ఆపేక్ష,’’ అంది సరళ తల పైకెత్తి నాకేసి చూసి.
కాస్సే పాగి మనస్సులో మెదుల్తూన్న భయంకరమైన ప్రశ్న వేశాను.
‘‘లఖియా ఆత్మహత్య చేసుకుని వుంటుందనుకుంటావా సరళా?’’ అన్నాను ఎందుకో.
సరళ ఒక్కసారి వులిక్కిపడింది.
‘‘మీకలా అనిపిస్తుందా రామంబాబూ,’’ అంది.
‘‘లేదు సరళా. నాకలా అనిపించడంలేదు, నీవు చెప్పినదానిని బట్టి ఆమె అటువంటిది కాదనిపిస్తుంది. ఆమె విషాధగాధలో పిరికితనం ఏకోశానా లేదు. ఇందాకా నన్ను నేను ఎంతో కష్టంమీద నిబ్బరించుకున్నాను సరళా. కాని ఇప్పుడు నాకా అవసరం కనబడటంలేదు. నీ సమక్షంలో అజ్ఞాత యువతికి జోహారులర్పిస్తున్నాను హృదయ పూర్వకంగా ఈనాడు,’’ అన్నాను.
సరళ నాకేసి ఎంతో ఆశ్చర్యంగా చూసింది.
‘‘అదేమిటి రామంబాబూ. కన్నీరు కారుస్తున్నారు మీరు,’’ అంది.
నా కళ్లు నిజంగానే చెమర్చాయి..
‘‘అందులో తప్పేముంది. చెప్పు. పురుషులు కన్నీరు కార్చకూడదా. అది స్త్రీల హక్కేనా? కొన్నికొన్ని సమయాల్లో మనం కన్నీరు కార్చటం కంటే ఇంకేమీ చేయలేని అసహాయస్థితిలో ఉంటాము సరళా. హృదయంలోని సానుభూతీ, ఆవేదనా బయటకు ఎలా వెల్లడించటమో నువ్వే చెప్పు?’’ అన్నాను కళ్లు తడుచుకుంటూ.
సరళ దానికేమీ జవాబివ్వలేదు. కొంత సేపు మౌనంగా వుండిపోయింది.
‘‘లఖియా గాధ మీ మనస్సును కూడా పాడుచేసింది. ఇక ఆ విషయం గురించి మాట్లాడవద్దు,’’ అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతూంటే....
‘‘ఈ విషయంలో నువ్వు నాకొక వాగ్దానం చేయాలి సరళా! లఖియా సంగతి నీకెప్పుడైనా తెలిస్తే నాకు కబురు చెయ్యాలి. ఎంత దూరంలోవున్నా ఆమెను చూడటానికి వస్తాను. లఖియా నాతో మాట్లాడుతుంది కదా?’’ అన్నాను నేను అడ్డుకుని.
‘‘సరే అలాగే చేస్తాను. కాని అంతటి అదృష్టం నాకు లభిస్తుందనే ఆశ నశిస్తోంది,’’ అంది.
‘‘ఇప్పుడే వచ్చేస్తాను,’’ అని లేవబోయాను.
‘‘నన్ను వంటరిగా వదిలి వెళ్లిపోతారా?’’ అంది కంపిత స్వరంతో... ఆ కంఠస్వరమూ, ఆ కళ్ళూ మళ్లీ నన్ను విభృతుని చేశాయి.
‘‘హాస్యంకాదు రామంబాబు, ఈ ఆరణ్యంలో నేను ఒంటరిగా ఉండలేను; ఎక్కువగా మనుష్య సంచారం లేదు. వాళ్లే వస్తారు కొద్దిసేపటిలో, అయినా తప్పు చెయ్యకుండామీరు నన్ను ఎందుకు శిక్షిస్తారు? మీరు వెళ్లారంటే నా మీద ఒట్టే,’’ అంది సరళ కంగారుగా నామనోభావాన్ని గ్రహించి నట్టుగా.
నా కాళ్లకు బ్రేక్ పడింది. ఇంక చేసేదిలేక తిరిగి చతికిలబడ్డాను.
‘‘ఇంత చిన్న విషయాలమీద ఇంత రసాభాస ఎందుకు చేస్తావు సరళా? నిజంగా నీవు భయపడే నన్ను ఇక్కడ ఉండమన్నావా?’’ అన్నాను కొంచెం కోపంగా.
‘‘అవును, నిజంగానే భయం వేస్తూంది. నేను చెప్పానుకదా, ఈవేళ నా మనస్సు చాలా చంచలంగా ఉందని, కొన్ని కొన్ని సమయాల్లో స్త్రీలకు పురుష సహాయం చాలా అవసరం రామంబాబూ. అదిమీరెవరూ గుర్తించరు,’’ అంది.
నేనింకేమీ మాట్లాడలేదు. ఏకాంతాన్ని ఏవిధంగా భగ్నం చెయ్యాలా అని ఆలోచిస్తూంటే అల్లంత దూరంలో రాజేంద్ర యశోలు కనబడ్డారు. ప్రాణం లేచి వచ్చినట్లయింది.
‘‘అదుగో, వారు వస్తున్నారు,’’ అన్నాను ఉత్సాహంగా.
సరళ ఒకసారి నావైపు వేదనా పూరిత నేత్రాలతో చూసింది. నేను ఆమెను తప్పించుకోటానికి ఆత్రుత పడుతున్నానని గ్రహించింది.
‘‘మీరూ ఈ వేళ నా వాగుడంతా చాలా ఓపికతో విన్నారు. అందుకు నేను కృతజ్ఞురాలిని రామంబాబూ,’’ అంది కొంచెం నవ్వుతూ.
మరుక్షణంలో హృదయమంతా ఆమెపై జాలితో నిండిపోయింది పాపం. ఈమె ఏమి చేసింది? నేనెందుకు ఈమెను వదలించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను? ఇంతలో రాజేంద్ర యశోలు చాలా దగ్గరకు వచ్చేశారు. నా దృష్టి వారి మీదకు పోయింది.
వారొచ్చిన కొంతసేపటికి తిరుగు ప్రయాణం పట్టేము.
చాప్టర్ 13
యశోకి సుశీ సంగతి తెలుసునేమో అనే ఆశతో అంతవరకూ వున్నాను. ఆనాటి తర్వాత ఆమె ప్రవర్తన బట్టి ఆ ఆశ నిరాశ అని తెలిసింది. ఇక ఏమైనా ఈ వార్త ఈమెకు చెప్పాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా రోజులు గడిచిపోయాయి. ప్రతి రాత్రి ఆమెకు చెప్దామనుకునేవాడిని. కానీ నోట మాట వచ్చేది కాదు. రాత్రి భోజనం అయిన తర్వాత ఇద్దరమూ కలిసి నవలలు చదివేవాళ్లం. వాటిలోని పాత్రలను గురించి చర్చించేవాళ్లం.
‘‘మీరు నవలల్లో ఎవరిపక్షం వహిస్తారు. విసర్జించబడిన ప్రేమికూడా లేక వివాహం చేసుకున్నవాడా?’’ అడిగింది ఒక రాత్రి యశో.
‘‘సాధారణంగా విసర్జించబడినవాడే యశో. అతనికి ఎంత దు.ఖం కలుగుతుంది చెప్పు. ఒక సారి హృదయమర్పించిన తర్వాత ఏం జరిగినా తిరిగి తీసుకోలేడుగా,’’ అన్నాను.
‘‘అయితే మీరు ఎవరి ప్రేమనూ తిరస్కరించరు కదా?’’ అంది యశో ఎంతో ఆశతో
‘‘ఆ విషయం నాకు తెలియదు యశో. నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు .అయినా ఇతర బంధనాలు లేకపోతేనూ, ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తూందని నమ్మకం కలుగుతే ఎందుకు తిరస్కరిస్తాను,’’ అన్నాను.
‘‘ఒక వేళ ఇతర బంధనాలు లేవనుకోండి; ఆమె మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తూందనుకోండి. మీకే తన హృదయాన్ని అర్పించిందనుకొండి...’’ అని యశో ఎంతో ఆవేశంగా చెప్తూ నాకేసి భయంగా చూసింది.
నేను ఆమె మాటల అర్థాన్ని గుర్తించానేమోనని అనుమానం స్థిరపడిపోయింది కామోను గబుక్కున ఆగిపోయింది
‘‘నన్ను క్షమించండి బాదకబాబూ. నేనన్న మాటలు మరచిపోండి. నామీద మీకు కోపం వచ్చిందా?’’ అంది కొంతసేపటికి నా చేతులు పట్టుకుని..
భయపడుతూ, దీనంగా చూస్తూన్న ఆ కాటుక కళ్లని చూస్తూంటే ఏమనాలో తెలియలేదు.
‘‘అలా అనకు యశో. నాకూ హృదయం ఉంది. నీ అభిమానానికీ, ఆదరణకీ కృతజ్ఞుడని, కాని నన్నేమి చేయమంటావో చెప్పు,’’ అన్నాను.
యశో మంచంమీంచి క్రిందకు వంగి తన తల నా కాళ్లపై పెడుతుంటే నేను నాశ్చర్య పోయాను.
‘‘ఇక్కడే కొంచెం చోటివ్వండి’’ తను నన్నలా గద్గస్వరంతో 'శరత్' పార్వతి, దేవదాసును వేడుకొన్న రీతిలో అంటుంటే అవాక్కయిపోయాను.
తర్వాత కొంచెంసేపు గది అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. నా కాళ్లమీద నుంచి ఆశ్రుబిందువులు నేలపైన పడనారంభించాయి. .
‘‘యశో . నేను తప్ప నీకిక గత్యంతరం లేదా?” అన్నాను నేను యశోను లేవదీసి.
యశో మాట్లాడలేదు. ఒకసారి నా కళ్లల్లోకి చూసింది. ఆ చూపుతోనే నన్నడిగినట్లుంది... ‘‘దీనికి కూడా నేను జవాబివ్వాలా?’’
నాక్కూడా కళ్లు చెమర్చాయి. అయినా ఈ అవకాశం జారవిడుచుకోకూడదు. యశోకి సుశీ సంగతి చెప్పితీరాలి.
‘‘కాని నాకు ఇతర బంధనాలున్నాయి యశో,’’ అన్నాను మనస్సు రాయి చేసుకుని,.
‘‘చెప్పండి,’’ అంది యశో ఒక్కసారి ఉలిక్కిపడి.
తన కప్పుడు నేను నా సుశీవ్యథను వ్యక్తపరచ్చేను..
యశో మట్లాడకుండా అంతా వింది. ఆమెలో ఆవేశం కనబడలేదు; విచారమూ కనబడలేదు. శూన్యంలోకి శూన్యంగా చూస్తూంది. తన విన్న ఆ గాధకూ తనకూగల ఆ భయంకరమైన సంబంధం గ్రహించటానికి కొంతసేపు పట్టింది. నిశ్చలంగా ఉన్న ఈమె ముఖం మేఘా వృతమైంది.
చివరకి భయ విహ్వల అయి నా చెయ్యి పట్టుకుంది...
‘‘అంటే….మీరు నాకు ...మీరు నన్ను ఏంచేసి పోతారు,’’ అంది.
‘‘ఈ ప్రశ్నకి సమాధానం తెలియకే ఇన్నాళ్లూ నీకీ సంగతి చెప్పలేదు యశో, నేను పూర్తిగా నిస్సహాయుణ్ని.. జరిగిందంతా చెప్పాను. ఇక భవిష్యత్ లో ఏం జరగాలో నిర్ణయించవలసిన భారం కూడా నీమీద మోపుతున్నాను. నీ నిశ్చయానికి నేను కట్టుబడి ఉంటాను,’’ అన్నాను.
యశో చాలా సేపు మాట్లాడలేదు. నా మనస్సు కాస్త తేలికబడింది. భారమంతా ఆమె తలమీద పెట్టాను. ఆమె మాటకు కట్టుబడి ఉంటాను.
‘‘సుశీని మీరు మరచిపోలేరా ఎన్నటికీ?’’ అని అడిగింది యశో
‘‘మరచిపోతే సుశీ కాని, చివరకు నువ్వుకాని నన్ను క్షమించగలరా?’’ అప్రయత్నంగా నానోటి వెంట జవాబు వచ్చింది.
యశో ఆవేశంతో తలను మంచం కోడుకేసి కొట్టుకుంటూంది.
‘‘అదేమిటి యశో . ఏం చేస్తున్నావు?’’ అంటూ ఆతృతగా ఆపబోయాను.
ఆమె తలమీద తగిలిన ఒక్కొక్క దెబ్బా బల్లెపు పోటులా నా హృదయానికి తగిలాయి.
‘‘ఎంత పని చేశావు యశో,’’ అన్నాను ఆఖరికి యశో తలను రెండు చేతుల్లోనూ తీసుకుని.
‘‘దైవం నుంచీ, సమాజం నుంచీ, చివరకు మీ వద్దనుంచీ నేను పొందగలిగింది ఇదే. నానుదుట రాసివున్నది. నాకు జీవితంలో లభించేదీ ఇదే,’’ అంది దుఃఖమూ, బాధా పొర్లివస్తున్న కంఠంతో.
ఈ మాటలు అని, యశో గదిలోంచి రివ్వున బయటికి వెళ్లిపోయింది.
శిలాప్రతిమలా అలాగే కూర్చుండిపోయాను. అలాంటి పరిస్థితిలో కూడా నా మనస్సు పూర్వంకంటే తేలికపడింది. నా దు.ఖాన్ని పంచుకోవడానికి ఇంకొక అభాగిని దొరికింది. కానీ ఆ ఆలోచనలో ఇంత స్వార్ధం ఇమిడి ఉందని నాకప్పుడు తెలియదు. భవిష్యత్తులో ఆమె చెప్పినట్టు చేస్తానని మాటయిచ్చాను. ఇక నా తప్పు లేదు అని అనుకున్నాను. యశో మొదట చూపిన నిగ్రహమూ, నిశ్చలతా కోల్పోయింది. ఆ పరిస్థితిలో మీరు నావారే అంటే నేనేమి చెయ్యాలి?
మరునాడు పొద్దుపోయిన తర్వాత లేచాను. కళ్లు తెరచేటప్పటికి ఎదురుగుండా యశో కనబడింది.
“రాత్రంతా ఆలోచించటమూ, ఆలస్యంగా లేవడమూ మీకలవాటయింది ఇప్పటికైనా లేవండీ,’’ అంది చిరునవ్వుతో. నాకయితే, అది తెచ్చిపెట్ట్టుకున్న నవ్వు అనిపించింది.
యశో అలా దర్శనమిస్తుందని నేను ఊహించలేదు. అలా జరిగినందుకు నేను చాలా సంతోషించాను కూడా . కానీ, ఆ చిరునవ్వు దేనికి నాంది?
ముఖ ప్రక్షాళనం చేసి వచ్చేటప్పటికి యశోకి బదులు కాఫీ, టిఫినూ ఉన్నాయి. గ్లాసు తీసేటప్పటికి క్రింద ఒక చీటి కనబడింది. వణికే చేతులతో అది చదువనారంభించాను.
‘‘బాదకబాబూ,
రాత్రంతా ఆలోచించాను, ఇంత పెద్ద బరువు నా శుష్క స్కంధాలమీద మీరెందుకు పెట్టారు? కాని నేను మీకిప్పుడు ఏమని చెప్పాలి? కల్లోలపూరితమైన నా మనస్సుకి ఒకే సత్యం దృగ్గోచరమవుతూంది. మరణించినా సుశీ మిమ్మల్ని పొందగలిగిందిగాని బ్రతికుండి కూడా నేను కోల్పోతున్నాను . ఇతరులు మీకు లభించవచ్చు కానీ, ఇతరులు మిమ్మల్ని పొందలేరు. ఈ నిగూఢ సత్యాన్ని నేనెలా తోసిపుచ్చగలను?
నన్ను గురించి నేనేమీచెప్పలేను. అయినా జీవితంలో మీనుండి యాచించవలసిన బిక్ష ఒకటి ఉంది. యాచితంగానో, అనాయాచితంగానో, స్వకర్మవల్లనో, పరకర్మవల్లనో మీ సాంగత్యమూ, మీ స్నేహమూ నాకు లభించాయి. జీవితంలో మరుపురాని ఘడియలు కొన్ని నాకు ప్రాప్తించాయి. ఇంకా కొద్దికాలమే మనమిద్దరమూ కలిసుంటాము. అలాంటి సుఘడియలు ఇంకా కొన్ని నాకు లభ్యమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించండి. ఇది నాకు లభించకపోతే ఇక నాకు జీవితంలో మిగిలింది ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. మీ నుండీ నేనేమీ వాంఛించటంలేదు. నేను సమర్పించేదాన్ని స్వీకరించమని అడుగుతున్నాను. మీరు స్వీకరించే వస్తువు మీకు సమర్పించలేనిదాన్ని, దాన్ని కలుషితం చెయ్యనని మీరు గుర్తుంచుకోవాలి.
జీవితంలో స్త్రీ ఒకసారి హృదయార్పణం చేస్తుంది బాదకబాబూ. తిరిగి పుచ్చుకోవటమనేది ఆమెకు చేతకాదు. నా విషయంలో కూడా అంతే. మీకు సుశీ ఎలాగో మీరు నాకూ అలాగే. సుశీ మరణించింది. నేను జీవించే ఉన్నాను ఇంక. అంతే’’
ఇట్లు,
మీకేమవుతుందోతెలియని,
యశో’’
ఉత్తరం చేత్తో పట్టుకుని అలాగే కూర్చున్నాను. అప్పటి మనస్థితి నేను సరిగా చెప్పలేను. సుశీ..యశో..యశో...సుశీ ఏమిటి ఈ అంతర్యుద్ధం? ఆ ఉత్తరం చాలాసార్లు చదివాను. ఈ లక్ష్మి నన్ను శాశ్వతంగా విసర్జించిందా? అనే ప్రశ్నకు నాకు జవాబు దొరకలేదు.
ఎంతసేపు అలా ఉన్నానో నాకు గుర్తులేదు. యశో హఠాత్తుగా గదిలోకి వచ్చి, నన్నూ, నా చేతిలోనిఉత్తరమూ చూసి, క్షణంసేపు గుమ్మంవద్దే నిలబడిపోయింది. కానీ ఇంతట్లో ఆమె దృష్టి టేబుల్ మీద ఉన్న కాఫీ, టిఫిన్ మీద పడ్డాయి.
‘‘ఇంకా కాఫీ, టిఫిన్ తీసుకోలేదా? అరే,. కాఫీ చల్లారిపోయింది,” అంది గబగబా దగ్గరకు వచ్చి.
"అయితే ఏమి యశో," అన్నాను.
"మళ్లీ ఇప్పుడే తయారుచేసి పట్టుకొస్తా’’ అని అని వెళ్లిపోతూంటే హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని అన్నాను.
‘‘ఒక్క రోజు చల్లారిన కాఫి తాగితే ఏం ఫర్వాలేదు యశో. ఈ మొండి ప్రాణం ఏమైపోదు. అయినా పొరపాటు నాది అలాంటప్పుడు నీకెందుకు ఈ శిక్ష,” అన్నాను.
యశో కాసేపు తన చెయ్యిని నా చేతిలో అలాగే ఉంచింది. ఆమె కళ్లల్లో సన్నగా నీరు తిరుగుతున్నట్టనిపించింది...
‘‘ఫర్వాలేదు ఇప్పడే పట్టుకు వస్తాను,’’ అని నెమ్మదిగా చేయి విడిపించుకుని బయటకు వెళ్లిపోయింది.
వేడివేడి కాఫీ కొద్దిసేపటిలోనే వచ్చింది. కానీ యశోరాలేదు. రామదీన్ పట్టుకు వచ్చాడు. యశోకి కాఫీ చెయ్యటం ఏమంత కష్టంలేదు. కానీ గట్టులు తెంచుకుని ప్రవహించే ఆశ్రుధారలు ఆపటం అంత సులభంకాదు. చేతులంత సులభంగా నేత్రాలు మన ఆదేశాన్ని పాటించవు. ఆనాడు నేను తాగిన కాఫీలో కన్నీరు ఎంతవుందో నాకు ఈ నాటికి తెలియదు.
నేను రామదీన్ ని అడిగాను, యశో ఏం చేస్తూందని.
“ఏమిటో బాబూ. ఇవాళ అమ్మాయి పొద్దుటనుంచీ విచిత్రంగా ఉంది. రోజూ నవ్వుతూ ఎదురయ్యేది. ఇవాళ పొద్దున్న ఆ చిరునవ్వు మాయమైంది. దానికితోడు ఆ అమ్మ నన్నడిగింది, ‘తాతా! చావటానికి అన్ని మార్గాలకన్నా సులబమైన మార్గం చెప్పగలవా?’ అది పరాచకమే అనుకోండి అయినా పొద్దున్నే అలాంటి మాటలంటారా ఎక్కడైనా బాబూ,’’ అన్నాడు.
అది పరాచకమే అన్నాడు రామదీన్. కాని నాకంత నమ్మకం కలుగలేదు. హఠాత్తుగా ఉత్తరంలోని వాక్యాలు గుర్తొచ్చాయి. ఈ భిక్ష నాకు లభించకపోతే ఇక జీవితంలో మిగిలిందేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే దీని అర్థమేమిటి? ‘సుశీ మరణించింది. నేను జీవించే ఉన్నాను ఇంకా’, ఈ వాక్యం అనుమానాన్ని పోగొట్టింది.
యశో నాకు ఒంటరిగా కనబడలేదు. నేను తనకోసం ఆ రాత్రి పొంచి వున్నాను
‘‘కాస్త లోపలికి రా యశో. నీతో కొంచెం మాట్లాడాలి,’’ అన్నాను ఆమె తన గదిలోకి వెళ్లిపోతూంటే.
‘‘లోపలికెందుకు? ఇక్కడే చెప్పండి,’’ అంది యశో వరండాలో నుంచుని.
‘‘కాదు యశో, కాస్త లోపలికి రా,’’ అన్నాను అభ్యర్ధనగా.
‘‘చెప్పాల్సిందేమైనా ఉంటే ఇక్కడే చెప్పండి. లేకపోతే నేను వెళ్లిపోతాను,’’ అంటే, ఆమె కంటి కన్నీరు, కోపంగా వ్యక్తమవుతూందని గ్రహించాను.
‘‘నీ ఉత్తరం నాకు సరిగా అర్థంకాలేదు. యశో, నీ సుఖం కోసం...’’ అని ఏదో అనబోతూంటే యశో అడ్డువచ్చింది.
‘‘నా సుఖం కోసం మీరేమీ కష్టపడనక్కర్లేదు. నా ఉత్తరం అర్థం కాలేదన్నారు. ఉత్తరం స్పష్టంగానే రాశాను రామంబాబు,’’ అంది తీక్షణంగా నాకేసి చూస్తూ.
రామంబాబూ, అని ఆమె నన్ను ఎప్పుడూ పిలవలేదు. చెంపమీద చెళ్లున కొట్టినట్టయింది. మనస్సు ఎంతో బాధపడింది.
‘‘బాదకబాబుకు అంత్యక్రియలు ఎప్పుడు జరిపించావు యశో,’’ అన్నాను దీనంగా చూస్తూ.
ఆ మాట విని వేటగాని బాణపు దెబ్బతిన్న హరిణిలా నాకేసి చూసిన యశోరాజ్యం, రివ్వు మని తన గదిలోకి పోయి తలుపు గడియ వేసుకుంది.
చాప్టర్ 14
ఇంకో రెండు వారాలు గడచిపోయాయి. మొదట కొన్నాళ్లు యశోని చూస్తే భయంవేసేది, ఆమె ఏమి అఘాయిత్యం చేస్తుందో అని అనుక్షణం భయపడేవాడిని. రాత్రింబవళ్లు నిద్రపట్టేదికాదు. చాలా సార్లు యశో గది తలుపులు నెమ్మదిగా తోచి చూసేవాడిని, తెరచి ఉన్నాయేమోనని. ఆమె గదిలో లేనప్పుడు లోపలికి వెళ్లి వెదకేవాడిని. మరో వారం తిరిగిన తర్వాత యశో కాస్త మామూలు స్థితికివచ్చింది. అయినా నా మీద కోపం పోలేదు. ఒక సారి రాజేంద్ర వచ్చాడు. నామీదకోపాన్ని అతని మీద అనురాగంగా మార్చింది. అందుకు అతనే కాస్త కంగారు పడ్డాడు. నేను మొదట కొంచెం బాధపడ్డానుకాని చివర కదంతా మంచికే అనుకున్నాను. సరళ కూడా ఇదంతా గమనించింది. ఒక సారి ఆమె నన్నుడిగింది. అంతా చెప్పేశాను.
‘‘మీరు ఇదంతా యశోకి చాలా కాలం కిత్రం చెప్పిఉండాల్సింది రామంబాబూ. చాలా ఆలశ్యంచేశారు,’’ అంది అంతా విని.
‘‘అవును, అది నిజమే సరళా. నాదే అపరాధం. కాని నేనేమి చెయ్యను. మానవ బలహీనతకు కూడా మనం కొంచెం చోటివ్వాలి. చివరకు ఇలా పరిణమిస్తుందని నేను ఊహించలేదు. అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావు?’’ అన్నాను.
‘‘మీరు ఇదే నిశ్చయంలో ఉన్నట్లయితే యశోను త్వరలో విడిచి వెళ్లిపోండి,’’ అంది.
ఇంత స్పష్టంగా సరళ ఎలా చెప్పగలిగింది. ఇందులో స్వలాభమేమైనా ఉందా? ఏదయితేనేం నా ఉద్దేశ్యంకూడా ఇదే. హఠాత్తుగా వెళ్లిపోతే యశో తండ్రి అనుమానపడతారేమోనని ప్రయాణం కొన్నాళ్లు వాయిదావేశాను.
యశో మామూలు స్థితికి వచ్చింది. ఆవేశం, ఆవేదనా అట్టడుకి అణచివేసింది. చాలా ముభావంగా ఉండేది. అయినా ఆదరణకీ, అనురాగానికి ఏమీ లోపం రానిచ్చేదికాదు. ఎప్పుడూ గదిలో
Comments (0)