క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
‘‘రణధీర్ కాస్త బండి ఆపు బాబుగారికి కాఫీ కాచిఇవ్వాలి,’’ అంది యశో.
రణధీర్ బండిని ఒక పెద్ద చెట్టు కింద ఆపాడు. యశో బండిలోంచి కావాల్సిన సరంజామా అంతా తీసింది. ఈలోగా రణధీర్ ఎండిన కర్రముక్కల్ని ఏరి తీసుకొచ్చాడు.
‘‘అయితే మనము ముస్సోరీకి తిన్నగా ఈ బండిమీదే వెళ్తున్నామా యశో?’’ కాఫీ కాస్తూంటే అడిగాను.
‘‘భలేప్రశ్న వేశారు. డెబ్బై మైళ్లు రెండెడ్ల బండిమీద వెళ్తున్నామనుకున్నారా? ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద పల్లెవుంది. ఏ పల్లె రణధీర్? ’’ అంది నవ్వుతూ.
‘‘అయిదారు మైళ్లకంటె ఎక్కువ వుండదు చిన్నక్కా. భోజనం వేళకి ముందరే చేరుతాం,’’ అన్నాడు.
‘‘మంచిది, అయితే. మీరు అక్కడకాస్త ఎంగిలి పడవచ్చు,’’ అంది.
అంటే దాని అర్థం ఆ పూట యశో పస్తుంటున్నదన్నమాట. అలాంటి విషయాల్లో ఆమెతో వాదించటం అనవసరం. తమ్ముడికి, నాకు తను కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చింది, అవి తిని కాఫీ తాగి మళ్లీ ఎడ్లబండెక్కాము.
సరళను మళ్లీ కలుసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనే నన్ను కలవరపరచసాగింది.
‘‘అయితే మనం ముస్సోరీలో ఎన్నాళ్లు వుండాల్సి వస్తుంది యశో,” అడిగాను.
“రెండు, మూడు రోజుల కంటె ఎక్కువ వుండనక్కరలేదనుకుంటా,’’ అంది.
“ఇంతకీ మనము ముస్సోరీలో ఎక్కడ వుందాము, సరళ ఇంట్లోనా?” అన్నాను
“అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాం? అయినా, వాళ్ళింటికి వెళ్లకపోతే సరళ ఇంకెప్పుడూ మన ముఖం కూడా చూడదు. రాజేంద్రకు కూడా చాలా కోపం వస్తుంది. అయినా వుండేది రెండు మూడు రోజులేకదా? ఆ తర్వాత ఏంచేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. జీవితమంతా గూడులేని పక్షుల్లా తిరుగుతూ వుండలేం కాదా,’’ అంది.
వింటూ వూరుకున్నాను.
‘‘హే భగవాన్. సమస్యలేని వేళ నీ సృష్ఠిలోనే లేదా? అబ్బా, ఈ స్థితిలో ఎంత కాలం గడపాలో? ఎప్పటికయినా గమ్యస్థానం చేరుస్తావా!’’ మళ్లీ తనే అంది పరధ్యానంగా.
ఆ మాటలు విన్నాక నాకు ఎంతోబాధకలిగింది. ఇరువైమూడు వసంతాల అందమైన యువతి, అవివాహిత, అనాల్సిన మాటలా ఇవి? జీవితంలో ఎంత విరక్తి కలగిందీమెకు? మూడున్నర సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఈమెను కలుసుకున్నప్పుడు తనకు బరువూ, బాధ్యతా, బాధా అంటే తెలియవు. ఎప్పుడూ చిలిపిగా వేళాకోళం చేస్తూండేది. అరక్షణంలో మూడుసార్లు నవ్వేది. ఆమెకిప్పుడు చిరునవ్వే కరువైపోయింది. మందహాసమే మరుగైపోయింది. నేను ఎంతో శోచనీయమైన పరిస్థితిలో వున్నానని, నా కోసం సర్వస్వం త్యజించి, నాకు సర్వస్వాన్ని సమర్పించిన ఈమెకు వుండటానికి ఇల్లు అయినా చూపించలేక పోతూన్నాను. నాకు ఒక ఇల్లు వుంది, కానీ ఏం లాభం?
ఇంకా నేనేమీ మాట్లాడలేదు. రణధీర్ హుషారుగా బండితోలుతున్నాడు. యాజమానిలోని ఉత్సాహం ఎడ్లలో లేదు. కొరడా పడితె పరుగెడుతున్నాయి, లేకపోతే నీరసించి పోతున్నాయి.
‘‘ఇప్పుడు మనం తీర్థయాత్రలకి వెళితే బాగుంటుందనిపిస్తోంది. అంత దగ్గరున్నా రిషీకేశ్ నేనెప్పుడూ వెళ్లలేదు. ముందక్కడకెళ్లి, తరవాత హరిద్వార్, బృందావనం, ప్రయాగ వగైరా తిరిగి ఆఖరికి కాశీలో ఒక ఇల్లు కొనుక్కుని స్థిరపడదాం. ఏమంటారు?” అంది తను, మౌనాన్ని భంగం చేస్తూ.
‘‘సరే అమ్మీ, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఎక్కడికిపోయినా నన్ను నీతో తీసుకునిపో అంతే, ’’ అన్నాను.
మళ్లీ నిశ్వబ్దంలో మునిగిపోయాను. యశో బండిలోంచి బయటకు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచించి, ఒక గాఢ నిట్టూర్పు విడిచింది
‘‘నిన్న రాత్రి మీరు పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా?’’ అని అడిగింది నాకేసి తలతిప్పి.
‘‘లేదు యశో. తెలుసుకుని మాత్రం చేసేదేముంది; కానీ నా భవిష్యత్తూ, నా సర్వస్వమూ ఒక తక్కెడలో వూగిసలాడాయని మాత్రం తెలుసు,’’ అన్నాను.
‘‘అయినా చెప్తాను. చెప్తే నా మనస్సు కాస్త తేటపడుతుంది. మీరు పడుకున్న తర్వాత నేను చాలాసేపు మేల్కొనే వున్నాను. మనస్సంతా వేదానాపూరితమై పోయింది. మరునాడు మీరు వెళ్లిపోతారని మాటి మాటికి జ్ఞప్తికి వచ్చింది. అలాంటి స్థితిలో వుండగా బయట నుంచి లఖియా పిలుపు వినబడింది. ఆ సమయంలో లఖియా నా పాలిటి దేవతలా వచ్చిందనిపించింది. బయటికి వెళ్లి తనతో అంతా చెప్పి, ‘మళ్లీ బాహ్యప్రపంచంలోకి వెళ్లడమంటే భయం వేస్తోందని ఇక్కడే నాకు నిశ్చింతగా వుందని’ అని, ‘నన్నేమి చేయమంటావు’ అని అడిగేను,’’ ఆపి, ఆమె మాటలు నన్ను బాధపెట్టేయేమో నన్నట్లు యశో నాకేసి చూసింది.
అప్పుడు, తను నన్ను ఆదరించిందన్న ఆనందంలో ఉన్న నన్ను ఆమె పాతసంశయాలు ఇబ్బందిపెట్టలేదు. అది గ్రహించి, యశో కధ కొనసాగించింది.
‘‘లఖియా అప్పుడు అంది, సుందరీ, ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలనీ, పరిస్థితులను పరిగణించకూడదు. ఎవరికి తెలుసు ఏ వస్తువు ఎంత విలువెంతో? కర్తవ్య పాలన తప్ప, ఇతర ప్రశంసా లేక స్వీయసుఖము సమస్తమూకాదు. ఇంకొకటి, ప్రపంచంలో నాఅనదగ్గవారు బహు కొద్దిమంది వున్నారు. సుందరీ నువ్వు ఎవరినైతే వదలుకోవటానికి సిద్ధపడుతున్నావో వారే నీకు కావలసినవారు, అని చెప్పి, ఎంతో చక్కగా, సున్నితంగా ప్రభోధం చేసింది. వెంటనే నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత అక్కడ వుండ మనస్కరించలేదు. లఖియా నేను కలిసి సామానంతా సర్దాము. తలుచుకుంటూంటే భయం వేస్తుంది. లఖియా నాకు మార్గం చూపించకపోతే నేనే మిమ్మల్ని పోగొట్టుకునే దానిని కదా!’’ అని మనస్సులో మళ్లీ ఓసారి లఖియాకి నమస్కరించుకుంది.
“ఎక్కడకు పోతాను నేను అమ్మీ . తిరిగి మళ్లీ నీ వద్దకే వచ్చుండేవాడిని,’’ అన్నాను.
‘‘అయినా నేను మిమ్మల్ని విసర్జించడమయ్యుండేది కదా? అదెంత మహాపాతకం,?’’ అంది.
‘‘అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటావా?‘‘అన్నాను.
‘‘మీరు ఙ్ఞాపకం చేశారు. ఏమో చేసుకోవాలేమో. కాశీలో మళ్లీ చెయ్యండి,’’ యశో నవ్వింది.
‘‘అయితే ఈ సారి సలహా ఇవ్వడానికి గురువుగారు లేరుకదా?’’ అన్నాను నవ్వుతూ.
గురువుగారి పేరు విని యశో కాస్త సిగ్గుపడింది.
‘‘ఇప్పటినుంచి మీరున్నారు కదా. ఆయన బదులు అన్నీ మీరే,’’ అంది ప్రయత్నపూర్వకంగా నవ్వుతెచ్చుకుని.
రణధీర్ బండి ఆపాడు. మేము బస్సు ఎక్కాల్సిన బస్‍స్టాప్ వచ్చేసింది. బస్సుఎక్కి కూర్చున్నాము. బస్సులోంచి చేయిచాపి కొన్ని పదిరూపాయల నోట్లని యశో, రణధీర్ చేతిలో పెట్టింది.
‘‘ఇదేమిటి చిన్నక్కా?’’అన్నాడు రణధీర్, అతని ముఖమే చెప్తూంది దుఃఖం బలవంతాన్న ఆపుకుంటున్నాడని.
‘‘చిన్నక్క అభిలాష ఇది....అంతకంటే ఇంకేమీ కాదు. నన్ను మరచిపోవు కదూ,” యశో రణధీర్ గుప్పిటమూసి అంది.
ఇంక వాడి నిబ్బరం పటాపంచలైంది. కళ్లవెంట ఏకధారగా నీళ్లు కారసాగాయి.
‘‘ఛా నీ చిన్నక్క అత్తవారింటికి వెళ్తుంటే ఏడుస్తావేంటి. అయినా నీకు నేనొక్కత్తినే కాదు. నాకంటే ఇంకా నిన్ను ప్రేమించే పెద్దక్క వుంది. పెద్దక్కని సదా కనిపెట్టి వుండు,’’ అంది యశో,
‘‘నన్ను ఆశీర్వదించు చిన్నక్కా,’’ అన్నాడు అప్పటికి వాడి దుఃఖం ఆపుగుని కళ్ళుతుడుచుకుంటూ
‘‘ఎప్పుడూ సహృదయుడై సుఖంగా వుండు రణధీర్, భగవంతుడు ఎప్పుడూ నిన్ను కాపాడుతూంటాడు,’’ అంది యశో, చెమర్చిన కళ్లతో.
‘‘చిన్నక్కను మీరు తీసుకుపోతున్నారు. బాబూగారూ నా లోటుకూడా మీరే తీర్చండి,’’ అన్నాడు, వాడు నా చేయి పట్టుకుని.
‘‘నీ చిన్నక్క గురించి నీవేమీ దిగులు పడకు రణధీర్. ఆమె ఎక్కడున్నా సుఖంగా వుంటుంది,’’ అన్నాను నా చేయి బిగిస్తూ.
లఖియా నన్ను యశో చేతిలో పెట్టింది. రణధీర్ యశోని నా చేతిలో పెట్టాడు.
‘‘మీరు కూడా ఆశీర్వదించండి బాబుగారూ,’’ అన్నాడు.
‘‘నీ అక్కలిద్దరి ఆశీర్వాదబలం దైవం ఎల్లప్పుడు నీకు సమకూర్చు గాక, ’’ అన్నాను.
బస్సు కదిలింది.
‘‘వెళ్లివస్తాను తమ్ముడూ’’ అంది యశో.
అ జన ఘోషలో బహుశా ఆమె మాటలు వాడికి వినబడి వుండవు. కొంతదూరం పోయిన తర్వాత వెనుదిరిగి చూస్తే కళ్లు తుడుచుకుంటూ ఎడ్లబండి వైపు వెళ్తున్నాడు యశో తమ్ముడు.
జీవితంలో మనకు ఎంతో మంది తారసిల్లుతూ వుంటారు. కొద్దిమందితోనే మనం జీవిత బాటలో కలిసి ప్రయాణం చేస్తాము. కొంతమంది చాలాకాలం, చాలామందైతే స్వల్పకాలమే మనతో కలిసి వుంటారు. తర్వాత దారులు వేరవుతాయి. కాని మానవ ప్రాణం మాత్రం ఈ ప్రపంచంను విడనాడటానికి ఎంతో బాధపడుతుంది. విధిని ఎదిరిస్తూ, ఇంకా ఇక్కడే ఉండడానికి జీవి చివరి శ్వాస వరకూ ప్రాకులాడుతుంది. కాని మరణం తప్పదు, జాతస్య ధ్రువో మృత్యు. బాంధవ్యాలుకూడా జనన మరణాల్లాంటివే. ఈ పరమసత్యం తెలుసుకున్నవాడు బాధారాహితుడవుతాడు, లేనివాడు బాధాగ్రస్తుడవుతాడు. అదే తేడా!
చాప్టర్ 25
ఆ మధ్యాహ్నం మేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో.
"రా యశో, రామంబాబుని ఆహ్వానిస్తే ఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అంది సరళ.
"రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను.
"మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలు అయిన వాళ్ళకి విస్తర్లు," అంది సరళ నవ్వుతూ.
"ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటం మర్చిపోయావు సరళా," అంది యశో నవ్వుతూ.
"నాకుకోపం తెపిద్దామనుకుంటే మీది వృధాప్రయాస, రోజులుమారాయి," అన్నాను.
అప్పుడే దిల్ బహాదూర్ మంచినీళ్ళు తెచ్చేడు, మమల్నిగుర్తుపట్టి నమస్కరించేడు.
"దిల్ బహాదూర్, డాక్టర్ గారికి బంధువు లొచ్చేరని చెప్పు," అంది సరళ.
ఆ రాత్రి నేనూ రాజేంద్రా మేడమీద కూర్చుని వున్నాము. సరళా, యశో కింద వున్నారు.
‘‘అయితే రామంబాబూ. మీరిక్కడే వుండిపోకూడదా? అక్కడికీ, ఇక్కడికీ ఎందుకు వెళ్లటం? మాది లంకంత ఇల్లు. ఏం చేసుకుంటాము చెప్పండి. మేమిద్దరమూ, మా మామగారు కూడా ఇక్కడకు రావటం మానేశారు,’’ అన్నాడు రాజేంద్ర.
మేము ఉదయం వాళింట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇదే ధోరణి. యశోని సరళ, నన్ను రాజేంద్ర ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే, అనుకున్న ప్రకారం ఇప్పుడు మమ్మల్ని విడదీసినట్టున్నారు.
‘‘మీరలా అంటున్నందుకు చాలా థ్యాంక్స్ రాజేంద్రబాబూ. కానీ అదెలా సాధ్యపడుతుంది చెప్పండి. ఇది ఏమైనా నెలా రెండు నెలల మాటా. చివరకు మేము ఎక్కడో అక్కడ స్థిరపడిపోవాలి కదా. పూర్వపు స్మృతులకు ఎంత దూరంగావుంటే అంత శ్రేయస్కరం కాదా,” అన్నాను.
రాజేంద్ర ఏదో చెప్పబోతూంటే, హఠాత్తుగా సరళ, ‘పోస్టు పోస్టు’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.
‘‘రాజేంద్రా, ప్రస్తుతం వీళ్ల ప్రయాణం ఒక వారం రోజులు వాయిదా వేయించాను. మిగతాది తర్వాత చూద్దాము,’’ అంది సోఫాలో కూర్చుంటూ.
సరళ వెనకాల యశో వచ్చింది. నేను యశోకేసి కాస్త కోపంగా చూశాను.
“మీ అనుమతి కూడా కావాలి రామంబాబూ. లేకపోతే అంగీకారం అమలులోకి రాదని చెప్పింది,” అంది సరళ అది కనిపెట్టి.
‘‘అంతగా ఉండమంటుంటే ఉండననడం సమంజసంగా వుండదు,’’ అంది యశో.
‘‘సరే సరళా. యశో అంగీకరిస్తే నేను ఒప్పుకున్నట్టే. ఆ తర్వాత మమ్మల్ని వెళ్లిపోనీయి. అలా వుంటున్న కొద్ది వుండాలనిపిస్తుంది. ఎప్పటికైనా ఒక రోజు వెళ్లిపోవాల్సిందేగా?’’ అన్నాను.
‘‘మీరు అదే మాట అంటారు. ఎందుకు వెళ్లిపోవాలి మీరు? మా ఇంటిలో మీకు ఇష్టంలేక పోతే వద్దు. ఈ ఊరిలోనే ఇంకొక ఇల్లు కొనుక్కునో, అద్దెకు తీసుకునో వుండిపోకూడదా? మాకు తెలిసినవారు చాలామంది వున్నారిక్కడ. చవకగా దొరుకుతాయి. ఎక్కడికో కొత్త ప్రదేశానికి ఎందుకు వెళ్లిపోవాలి చెప్పండి. యశోకి ఈ ఊరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా? అదేగాక, లఖియాకి దగ్గరగా వుంటారు. అప్పుడప్పుడు వెళ్లి చూడవచ్చు. ఆమె ఎంతో సంతోషిస్తుంది. మీరిలా చేస్తే,’’ అంది.
ఇవన్నీ నిజమే. కాదనలేని సూచనలివి. ఆ విషయం నాకు మొదటి నుంచి తెలుసు. అందుకనే నేను ముస్సోరీ వెళ్లటానికి భయపడ్డాను. నేనేం మాట్లాడకపోవడంతో సరళ అవకాశం జారవిడవటం ఇష్టం లేక ‘‘జవాబు చెప్పు రామంబాబూ. ఈసారి మిమ్మల్ని వదలిపెట్టను,’’ అంది.
నేను యశోకేసి చూశాను, యశో ఆకాశం లోకి చూస్తోంది. అంటే ఇక్కడ నాకే మాట సహాయం లభించదన్నమాట. రాజేంద్ర చిరునవ్వు నవ్వుతూ, ‘‘ఇక లాభం లేదు రామం బాబు, సరళకు మీరు తిరుగులేని సమాధానం చెప్పాలి,’’
“మా భిన్నమయిన జీవితం నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలి సరళా,’’ అన్నాను.
అప్పుడు యశో ముఖం సింధూరంలా ఎర్రబడింది. సరళ తబ్బిబైంది. రాజేంద్ర అయోమయం లోకి చూస్తున్నాడు. నేను నాలిక్కరుచు కున్నాను.
మూడు రోజలు గడిచిపోయాయి. ముస్సోరిలో మా పనులన్నీ అయిపోయాయి. ఇంకా వారంరోజు లుండాలి అంగీకారం ప్రకారం. కానీ, ఎంత బలవంతం చేసినా యశో పూర్వంలా హక్ మాన్స్ కీ, పిక్చర్సు కీ, సుతరామూ రానంది.
అందుచేత మేము సాధారణంగా ఇంట్లోనే వుండిపోయేవాళ్లం. రాజేంద్ర మాత్రం క్లినిక్ కి అవసరం కలిగినప్పుడల్లా వెళ్ళేవాడు. అతని కళ్లల్లో ఇప్పటికీ యశోపై పూర్వపు మమతా, అనురాగం కనబడేవి. యశో పూర్వంలా కటువుగా వుండేదికాదు. ఎంతో సున్నితంగా వుండేది. దానితో నా హృదయం కాస్త తేలికపడింది. ఇక సరళ మా ఇద్దరినీ వదలి ఒక్క క్షణం కూడా వుండేది కాదు, వీలున్నప్పుడల్లా ఇక్కడ వుండిపొండి అనే మాట మంత్రంలా జపించేది. అప్పుడు కూడా ఆమె నాకొక సమస్యగా వుండిపోయింది. వివాహం ఆమెలో ఏమీ మార్పు తేలేదు. హఠాత్తుగా నవ్వేది. అప్పుడప్పుడు కళ్లలోంచి అనిర్వచనీయమైన విచారమూ, దు.ఖమూ వుట్టిపడేవి.
సరళను నేను ఎప్పుడూ అర్ధంచేసుకోలేక పోయాను. ఆమె అంటే అప్పుడప్పుడు జాలి వేసేది. అప్పుడప్పుడు కోపం వచ్చేది. నా మీద ఆమెకున్న అభిమానం తలచుకుంటే కృతజ్ఞత కూడా హృదయంలో మెరిసేది. కొన్ని కొన్ని సమయాల్లో ఆమె హద్దు మీరుతుందనుకునే వాడిని. అప్పుడప్పుడు ఆమె తలపుకు వస్తే రోబెర్టు బ్రౌనింగు తన భార్య ఎలిజబెత్ బారెట్ గురించి అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి - సోల్ ఆఫ్ ఫైర్ యెన్‍క్లోజ్డ్ ఇన్ ఎ షెల్ ఆఫ్ పెర్ల్. ఈమె జీవితంలోని అన్వేషణ ఏమిటి? ఇంత అశాంతిగా ఎందుకు వుంటుంది. ఈమె వైవాహిక జీవితం సుఖంగా లేదా అన్న ఆలోచన వచ్చినందుకు అప్పుడప్పుడు నేను బాధపడేవాణ్ణి. రాజేంద్ర ఆమె మాట ఎప్పుడు కాదనగా నేను చూడలేదు. యవ్వనం, అందం, ఆస్తి, ప్రేమించే భర్త ఇవన్నీ వున్నాయి. అయినా ఏమిటి ఆమె జీవితానికి లోటు?
ఆరోజు మధ్యాహ్నం రాజేంద్ర ఏవో కేసులు చూడటానికి డూన్ వెళ్లాడు. క్రింద హాలులో మేము ముగ్గురమూ ఉన్నాము. కొంతసేపు పోయిన తర్వాత యశో కొంచెం తలనెప్పిగా వుందంది. సరళ ఏదో లేపనం తెచ్చి యశో నుదిటిపై రాసింది. కాసేపు యశో అక్కడే కూర్చుని, తరువాత పడుకుంటానని వెళ్లిపోయింది.
ఇక మేమిద్దరమూ మిగిలాము. సన్నగా రేడియో పాడుతూంది. సరళ పూలు అల్లుకుంటూ వుంది. సోఫాలో కూర్చుని నేను ఏదో పుస్తకం చదువుతున్నాను.
‘‘అయితే మీరు ఇక్కడ నుంచి వెళ్లక తప్పదా రామంబాబూ?’’ అంది సరళ తలెత్తకుండానే.
‘‘చెప్పాను కదా సరళా తప్పదని, జీవితంలో మనకు ఒక వ్యక్తి సాహచార్యమే జీవితాంతం వరకూ లభిస్తుంది. అదైనా అదృష్టవంతులకే, మిగతా వారంతా ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతారు. అఖరుకి ఆనవాలు కూడా వుంచకుండా. వారిని మనము కఠిన హృదయులూ, నిర్ణయులూ అని లాభంలేదు. మానవ జీవితమే అంత,’’ అన్నాను.
‘‘అయితే సరే వెళ్లండి, కాని నాకు ఈ మాట ఇవ్వండి. నా మీద కోపం వచ్చికాని, నన్ను చూసి అనుమానపడికాని మీరు వెళ్లిపోవటం లేదని,’’ అంది సరళ తల పైకెత్తకుండానే.
‘‘నీ మీద కోపగించటానికి నేనెవరిని సరళా. అయినా నువ్వు యింత ఆదరంతో ఆతిథ్యం ఇచ్చినందుకు నీమీద కోపగించి క్రోధం చూపించాలా?’’అన్నాను.
ఇంకా తను తలెత్తకుండా పూలు అల్లుకుంటొంది.
‘‘నిన్ను నేను పూర్తిగా ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. సరళా,’’ అప్రయత్నంగా, అనాలోచితంగా అన్నాను.
‘‘ఎప్పుడూ అర్థంచేసుకోలేకపోయారా నన్ను?’’ అంది అప్పుడు మెల్లిగా తలపైకెత్తి.
“అవును సరళా? ఆ మాట నేను కాదనలేను,’’ అన్నాను.
“అదే నా బాధ రామంబాబూ. లఖియా, యశో, రాజేంద్ర వీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు. మీరుకూడా ఇంతేనా? జీవితాంతం నన్నర్ధంచేసుకొనే వ్యక్తి కోసం వెతుకుతూ వుండాల్సిందేనా? ఈ అన్వేషణకు అంతం లేదా?” అంది సరళ నిటూర్పుగా.
‘‘రాజేంద్ర నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు సరళా. నిన్ను సరిగ్గా చూడడా?’’ అన్నాను.
‘‘అది కాదు రామంబాబు. రాజేంద్ర భర్తగా నాకేలాంటి లోటు రానివ్వడు; నేనూ, భార్యగా అతనికి ఏలోటు రానీయను. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. నాకు కావాల్సింది నాకు లభించలేదు.’’ అంది.
అలా మాట్లాడుతూండగానే ఆమె కళ్లు నీళ్లతో నిండుకున్నాయి. ముఖం క్రిందకు దించేసుకుంది. నేను చకితుడనయ్యాను. సరళ కన్నీరు చూడడం ఇది రెండో సారి . మొదటిసారి తిరిగి కలుసుకున్నప్పుడు చూశాను. యశోలాగ సరళ ప్రతి విషయానికి కన్నీరు కార్చదు. నేను ఏమంటే ఆమెకు ఓదార్పు కలుగుతుంది? ఆమెకు కావాల్సింది నావద్ద లేదు. అది యశోకే లభించలేదు.
‘‘నీకు నేను సహాయం చేయాల్సిందేదైనా వుంటే చెప్పు సరళా, నాకు సాధ్యమైతే చేస్తాను,’’ అన్నాను.
సరళ మళ్లీ తల పైకెత్తింది. కళ్లల్లోంచి ఆశ తొంగి చూస్తూ వుంది.
‘‘ఇక్కడే వుండిపోండి రామంబాబూ. మీరు అవునంటే యశో కాదనదు. మీతో మళ్లీ ఎప్పుడూ ఈ విధంగా వుండను. నా హృదయాన్ని ఎప్పుడు బయట పెట్టను. ఎప్పుడూ మీతో ఒంటరిగా ఉండను. సరే అనండి. మీకు జీవితమంతా కృతజ్ఞురాలినై వుంటాను. ఆ వొక్కమాట అనండి, తర్వాత మీరేమి అడిగితే అది చేస్తాను,’’ అంది.
ఏమిటిదంతా? మళ్లీ కధ అడ్డం తిరుగుతూంది. అలా అవటానికి వీల్లేదు. గుండె రాయిచేసుకోవాలి.
‘‘ఈ విషయంలో నీవు పట్టు పట్టకు సరళ. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. మొదట కొన్నాళ్లు కాస్త కష్టంగా వుండొచ్చు. ఆ తర్వాత నా మాటల్లోని వివేకాన్ని నీవే గ్రహిస్తావు. ఇంక ఈ విషయం గురించి ఆలోచించకు. మరి ఏ విషయంలో నైనా, నేను నువ్వు చెప్పిందే చేస్తాను,’’ అన్నాను.
‘‘అయితే ఈ విషయం చెప్పండి. మీరు నన్ను గురించి చెడుగా భావించటం లేదు కదా?’’ అంది.
తుఫాను తగ్గుముఖం పడుతోంది, ఇంక పర్వాలేదు.
‘‘నీ గురించి నేను ఎందుకు చెడుగా భావిస్తాను సరళా. నువ్వు నాకు సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ నీలోని మంచితనాన్ని, ఔదార్యాన్ని, విశాల హృదయాన్ని నేను గుర్తించాను. నీకొకమాట చెప్పాలని చాలా కాలం పట్టి అనుకుంటున్నాను. చెప్పమంటావా?’’ అన్నాను.
‘‘చెప్పండి,’’ అంది.
‘‘నువ్వు చంచల స్వభావినివే కావొచ్చు. కాని ఆ చంచలత్వాన్ని ప్రేరేపించకు, జీవితంలో మనము ఆశించినవన్నీ జరగవు. మన మనస్సు కోరినవన్నీ తీర్చలేము. చాలా కోరికలు, తీరని వాంఛలగానే వుండిపోతాయి. ప్రతి మానవుడి జీవితంలో ఇలాగే జరుగుతూంటుంది. వాటికి హృదయానికి పొందు కూడదు,’’ అన్నాను.
‘‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కాని వివాహమైనంత మాత్రాన ఇంక కోరికలూ, అభిమానాలూ, ఆవేశాలూ వుండకూడదంటే నేను ఒప్పుకోను. స్త్రీ జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన సంఘటన మాత్రమే. అది సర్వస్వమూ ఎన్నటికీ కానేరదు. మీరంతా నువ్వు వివాహితవు కనుక నీకు వివాహేతర అంశాలు తగవు అంటారు. నీ గృహమే నీ ప్రపంచం, నీ భర్త సర్వమానవ కోటి అంటారు. అది ఎప్పటికీ నేను ఒప్పుకోను,’’ అంది.
గృహిణిగా మూడు సంవత్సరాలు గడిపినా సరళ లో ఏమీ మార్పు లేదు . అసలు ఆమె వివాహం ఎందుకు చేసుకుంది?
“అది సరే సరళా. నీ అభిప్రాయాలు, ఉద్దేశాలు నాకు తెలుసు, వాటిలో కొన్నింటిని గౌరవిస్తాను కూడా. కోరికలు వుండకూడదని నేను ఎప్పుడూ అనలేదు. వాటిని అదుపులో వుంచుకోవాలంటాను. నువ్వు నాకు ఒక మాట యివ్వాలి. ఈ వారం అయిపోయిన తర్వాత మమ్మల్ని సంతోషంగా సాగనంపు. మేము ఎక్కడున్నా నిన్నుతలుచుకుంటూనే వుంటాము. భవిష్యత్తులో మళ్లీ కలుసుకోమని ఎందుకనుకోవాలి. బుల్లి పాపాయి నీ యింట పాకుతూంటే చూడటానికి వస్తాము,’’ అన్నాను.
సరళ ఇంతసేపటికి నవ్వింది.
‘‘పిల్లలు పుట్టటానికి ఎంత అవకాశంవుందో, పుట్టకపోవటానికి అంతే అవకాశం వుంది. అయినా పుట్టటమే తటస్థిస్తే మొట్టమొదటి కొడుకుపేరు ‘బాదల్ బాబు’ అని పెట్టుకుంటాము,’’ అంది.
ఆమె నవ్వుమాటలు తీరుపట్టి పిల్లలు పుట్టాలనే కాంక్ష ఆమెలో వుందనిపించింది.
‘‘అలాగే చెయ్యి సరళా, మీ వాడికి నేను గాడ్ ఫాదర్ ని అవుతాను,’’ అన్నాను.
గోడమీద గడియారం గర్వంగా మూడుగంటలు కొట్టింది.
‘‘అరే, మూడయింది. దిల్ బహదూర్ కి కాఫీ పెట్టమని చెప్తాను . మీరు యశోని లేపండి’’ అని లోపలికి వెళ్లిపోయింది.
నేను నెమ్మదిగా మేడమీదికి దారితీశాను. గదిలోకి వెళ్లి చూస్తే అసలు పగలు పడుకోవడమనే అలవాటు లేని యశో గాఢనిద్రలో వుంది. ముఖం కూడా కాస్త ఎర్రబడింది. నేను ఆందోళనతో తన పక్కమీద కూర్చుని, నెమ్మదిగా తన నుదిటిమీద చెయ్యిపెట్టేను. అరే, ఒళ్ళు సలసలా కాగిపోతూ యశో బాధపడుతూంటే నేను సరళతో కబుర్లు చెప్పుతున్నానా!! నాకు చాలా బాధ కలిగింది. నా ఉనికికి యశో కళ్లు విప్పి చూసింది. కళ్లు ఎర్రగా వున్నాయి.
‘‘జ్వరంగా ఉందా యశో?’’అని అడిగాను.
అవునంటూ తల వూపింది.
‘‘తల నొప్పి కూడా వుందా?’’ అన్నాను.
“అబ్బా,” అని కళ్లు మూసుకుంది.
అప్పుడే సరళ వచ్చి, యశో పరిస్థితిని గ్రహించి, వెంటనే కిందకెళ్లి దిల్ బహదూర్తో క్లినిక్ లోనే ఉన్న రాజేంద్రకి కబురు పంపింది.
వెంటవెంటనే తిరిగి వచ్చి తను యశో నుదిటిమీద మెత్తగా ముద్దుపెట్టుకుంది అప్పుడు యశో కళ్లు విప్పిచూసింది. మొదట నేననుకుంది కామోసు... ఆశ్చర్యంగా, ‘‘నువ్వా సరళా’’ అంది.
‘‘అవును నేనే యశో, ఇంత జ్వరంగా వుంటే ఎందుకు చెప్పలేదు,” అప్యాయంగా అంది సరళ.
‘"వీ రెలాగూ తెలుసుకుంటారని," యశో నా చెయ్యి పట్టుగుని నవ్వుతూ అంది.
"అమ్మీ, నీ నమ్మకం ఎప్పుడూ వమ్ముచేయను," అన్నాను పొంగుపొరలుతున్న ఆత్మేయతతో.
చాప్టర్ 26
హుటహుటిగా రాజేంద్ర వచ్చాడు. తనతో ఇంకొక డాక్టరుని కూడా తీసుకొచ్చాడు. అయన ఏదో స్పెషలిస్ట్, అప్పుడే వేరే పేషెంట్ని చూడడానికి రాజేంద్ర క్లినిక్కి వచ్చాడు. ఇద్దరూ యశోని పరీక్షించారు. జ్వరము మామూలుదే త్వరలోనే తగ్గిపోతుంది అన్నారు.
‘‘త్వరలో అంటే ఎంతకాలమని," అడిగాను ఆతృతతో.
ఇద్దరూ ఏదో సంప్రదించుకున్నాక, నాలుగైదు రోజులన్నారు.
రాజేంద్ర ఆ కన్సల్టింగ్ డాక్టరుకి వీడ్కోలుచెప్పి, తన ఇంజక్షన్ సామగ్రి తీసుగుని వచ్చాడు.
‘‘మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను రాజేంద్రబాబూ. రాక రాక జ్వరం మీఇంట్లోనే రావాలా చెప్పండి,’’ అంది యశో నెమ్మదిగా, రాజేంద్ర తనకు ఎదో ఇంజక్షన్ ఇస్తుంటే.
‘‘అలా అనకు యశో, నీకు
Comments (0)