bookssland.com » Fiction » క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗

Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)



1 ... 9 10 11 12 13 14 15 16 17 18
Go to page:
పట్టుకుని ప్లాటుఫాం మీద నడుస్తున్నాము. యశో నేను చేయాల్సిన పనులన్నీ చెప్పింది.

‘‘నేను మీ ఆరోగ్యంగురించే ఆందోళన పడుతున్నాను. నేను లేకుండా మీకు జరుగదు. అంతమందిలో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు చూస్తారు?’’ అంది అప్పుడే జ్ఞాపకమొచ్చినట్టు.

‘‘ఎప్పుడూ ఎవరో ఒకరు ఎందుకు కనిపెట్టి వుండాలి యశో. ఎవరూ చూడకపోతే బహుశా నన్ను నేనే చూసుకుంటానేమో; అలా అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే,’’ అన్నాను.

‘‘కాదు మీకు జరుగదు. మీ స్వభావమే అంత,’’ అంది.

ఆమె ఆరోగ్యం సరిగా చూసుకోమనిగాని, జాగ్రత్తగా వుండమని గాని చెప్పే అర్హత నాకులేదు. ఎంతో హాస్యాస్పదంగా వుంటుంది. విని వూరుకున్నాను. రైలు కదలబోయే వేళైంది. యశో పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి బేల అయిపోయింది.

‘‘చూడండి; మీరు నాకు ఎంత అవసరమో నేను ఎప్పుడూ మీతో చెప్పలేదు. త్వరగా వచ్చేస్తారు కదూ,’ నిబ్బరాన్ని గాలిలో వదిలిపెట్టి నా చేతులు పట్టుకుని అంది.

అలాంటి స్థితిలో మాటలు పెంచి లాభం లేదు. మౌనమే దానికి మందు.

‘‘సరే యశో; వెళ్లినవెంటనే ఉత్తరం రాస్తాను,’’ అన్నాను.

యశో పూర్తిగా రైలు కదిలేవరకూ వుండలేదు. గబగబా బయటకు వెళ్లిపోయింది.

బాబాయ్ పరిస్థితి ప్రమాదకరంగానే వుంది. జబ్బుతో పాటు ముసలితనం, ఉబ్బసం, ‘‘కాలం సమీపించిందంటే అన్నీ వస్తాయి,’’ అంది లలిత పిన్ని.

బాబాయ్ ముసలివాడని నాకంతవరకూ తెలియదు. యభై సంవత్సరాలు దాటివుండవు. ఈమె మాటలు వింటూంటే నిర్విచారంగా వున్నట్టనిపించేది. మనిషిని చూస్తే దానికి పూర్తి విరుద్దం. చాలా కాలం నుంచీ స్నానపానాదులున్నట్టు కనబడలేదు. ఎప్పుడూ బాబాయ్ మంచాన్ని అంటిపెట్టుకుని వుండేదట.

‘‘బాబాయ్ చనిపోతూంటేకాని గుర్తురాలేదా రామం?,” అంటూ బాబాయ్ నన్ను చూసి కండ్లనీళ్లు  నింపుకున్నాడు.

“లేదు బాబాయ్ అలా అనకు, నువ్వు మళ్లీ కోలుకుంటావు. నీకు అనారోగ్యంగా వుందని తెలియలేదు. లేకపోతే ముందరే వచ్చేవాడిని,’’ అన్నాను దుఃఖం ఆపుకుంటూ. 

‘‘అన్నయ్యా కాశీ నుంచి మాకు ఏమి తెచ్చావు?’’అని మారం చేశారు పిల్లలంతా చూట్టూమూగి.

అంతలో పిన్ని హూంకరించేటప్పటికి నలుమూలలా పరుగెత్తారు.

బాబాయ్ రోగవివరాలూ, వైద్యమూ మొదలైనవన్నీ చెప్పడం అనవసరమనుకుంటాను. నేను వచ్చిన పదిరోజుల తర్వాత ఒక ఆదివారం తెల్లవారుజామున బాబాయ్,  లలిత పిన్నిని దుఃఖసాగరంలో ముంచి పరలోకయాత్ర చేశాడు. చేయాల్సిన తతంగమంతా చేశాను. బాబాయ్ మరణవార్త విని, పిన్ని తలిదండ్రులు వచ్చారు. తాను బ్రతికుండగా కూతురు విధవవటం చూసి ఆ తల్లి హృద‌యం తరుక్కుపోయింది. దుఃఖం భరించలేక, భర్తను నిందించింది. రెండవ పెండ్లికి ఇవ్వద్దుంటూంటే ఇచ్చారు. దాని ఫలితమే ఇది,’ అంది.

లలిత పిన్ని అక్కడే వుంది .‘అమ్మా’ అని ఒకసారి గట్టిగా అరచి ‘నాన్నగారిని అలాంటి మాటలనకమ్మా. ఎవరి కర్మఫలం వారనుభవించాలి’ అని ఏడుస్తూ తల్లి ఆలింగనంలో ఇమిడిపోయింది.

లలిత ముప్పది సంవత్సరాలు మించని అందమైన వనిత. బయటకు ఏవిధంగా కనబడినా మనస్సు మాత్రం మంచిది. జీవితంలో ఆమెకంటే ఎక్కువ సుఖాన్ని ఎవరూ అనుభవించలేదు. ప్రేమించే భర్త, దైవప్రసాదితులైన ముగ్గురు సుపుత్రులు తన కుటుంబమే స్వర్గమని భావించింది. భర్త మరణించిన మరుక్షణం నుంచీ జీవితమంతా చీకటిమయమయిపోయింది ఆమెకు. ఇద్దరు సవతి పిల్లలూ, ముగ్గురు తనవాళ్లు ఈమె భుజస్కందాలమీద పడ్డారు. వీరిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యతంతా ఈమెది. సవతి పిల్లలని ఆమె ఎన్నడూ విభేదం చూపించలేదు. నిజం చెప్పాలంటే వారిమీదే ఆమె అనురాగం  వ్యక్తపరిచేది .

‘‘ఈ ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచీ వీరిని నేను పెంచాను, మిగతావారంతా తర్వాత వచ్చారు. పుట్టుకలో ఏముంది?’’ అనేది నవ్వుతూ,

ఒకరోజు, యశో ఇచ్చిన వుత్తరం జేబులో పెట్టుకుని సురేఖని కలుసుకోవటానికి బయలుదేరాను. వివాహమైన తర్వాత సురేఖ తాతగారిని తీసుకుని అత్తవారింటికి వెళ్లిపోయిందని తెలిసింది. అక్కడికీ బయలుదేరాను. ఇంటినిబట్టి, గుమ్మంవద్ద వున్న నౌకరునుబట్టి బాగా కలవారని గ్రహించాను.

‘‘ఎవరు కావాలి?’’ అడిగేడు బంట్రోతు.

‘‘మధుగారున్నారా?’’ అన్నాను.

‘‘చిన్న బాబుగారు, విశాఖపట్నంలో వున్నారు,’’ అన్నాడు వాడు, నన్ను ఒక సారి ఆపాదమస్తకం చూసి.

‘‘పోనీ సురేఖ గారు వున్నారా?’’ అన్నాను.

దానితో వాడి అనుమానం హెచ్చింది. కాస్త చిరాకుగా, ‘‘ఇక్కడే వుండండి’’ అని లోపలికి వెళ్లిపోయారు.

సురేఖ బయటికి వచ్చింది. సురేఖ కళ్లు తళుక్కుమని మెరిశాయి.

‘‘బావగారూ’’ అంది నా దగ్గరకు ఒక గంతువేసి నా చెయ్యి పట్టుకుని.

‘‘మరదలా మీవారు  విశాఖపట్నంలో వున్నారట,’’ అన్నాను నవ్వుతూ.

“అవును, ఎంఎస్సీ చదువుతున్నారు, కానీ విశాఖపట్నంలో వున్నారని మీ కెలా తెలుసు?’’ అంది,

“మీ బంట్రోతు చెప్పేడు?” అన్నాను.

‘‘మీరు ఎప్పుడు వచ్చారు? అక్కయ్యని తీసుగులేదా? ఆమె ఎప్పుడూ నా మదిలో ప్రకాశిస్తుందిఅక్కయ్య        అరే బయటే నించున్నారు. లోపలికి రండి,’’ ప్రశ్నల వర్షంలో లోపలికి తీసుకెళ్లింది.

"మీ తాతగారిని పిలు," అన్నాను.  

"తాతయ్య లేడు  తీర్థయాత్రలకెళ్ళేడు," అంది.            

‘‘అయితే సురేఖా, మధు అక్కడ, నువ్వు ఇక్కడ, మధ్యన మేఘాలు ఏమిటి? నువ్వూ వెళ్లలేక పోయావా?’’ అన్నాను కుర్చీలో కూర్చుంటూ.

‘‘అది ఎలా వీలవుతుంది బావగారూ, నేను దగ్గరవుంటే బొత్తిగా చదవడు. ఇప్పటికీ పదిహేను రోజుల కొకసారి వస్తుంటారు. అది సరే అక్కయ్య ఎలావుందీ? అంతా చెప్పండి’’ అంది సురేఖ సిగ్గుతో తలవంచుకుని.

‘‘ఇది ముందర చదువుకో, ఏమైనా మిగిలితే  గిగిలితే తర్వాత చెప్తాను,’’ అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

సురేఖ ఎంతో ఆత్రుతతో ఉత్తరం చదువుకుంది. చాలా పెద్ద ఉత్తరంలావుంది. చదవటానికి చాలాకాలం పట్టింది. చదువుతూ చాలాసార్లు నాకేసి చూసి నవ్వింది.

‘‘అక్కయ్య అంతా రాసింది బావగారూ, మీ గుట్టు బయటపడింది,’’ అంది ఉత్తరం అంతా చదివి.  

‘ఇంటిగుట్టు లంకకు చేర్చకు, మధుకి తప్పఇంకెవరికి చెప్పకు,’’ అన్నాను.

‘‘సరేకాని ఆవిడ ఇక్కడికి రాకపోవడానికి కారణం మీరేనని రాసింది. ఎందుచేత తీసుకురాలేదు. చెప్పండి. అక్కయ్యను చూడాలని ఎంతో కోరికగా వుంది. ఆమె రుణం నేనెలా తీర్చుకోగలను?’’ అంది.

‘‘నేనెలా తీసుకురాగలను సురేఖా, సమాజం ద్రుష్టిలో మీ అక్కయ్య నాకేమీ కాదు. బాబాయ్ చనిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి మరీ అధ్వానంగా వుంది,’’ అన్నాను

‘‘అవును ఆయన చనిపోయారని విన్నాను, అక్కయ్య మిమ్మల్ని త్వరగా పంపించివేయమని రాసింది,’’ అంది.

‘‘త్వరగా ఎలా వెళ్లగలను సురేఖా? ఇప్పటివరకు అన్ని వ్యవహారాలు బాబాయ్ మీద పెట్టి వెళ్లాను. ఇప్పుడు ఎవరి మీద పెట్టగలను? ఏ పనీ స్వంతంగా చేయలేనని మీ అక్కయ్య అంటుంది. ఆమె దగ్గరవుంటే అన్నీ ఆవిడమీద పెట్టేవాడిని, ఇప్పుడెలాగ?’’ అన్నాను.

అదంతా ఏకరువు పెట్టడం అనవసరం. అయినా అప్పుడప్పుడు మనస్సుని వేధించే ఆలోచనల్ని బయటికి పెడితే ఎంతోతేలికవుతుంది. సురేఖ చాలా శ్రద్ధతో అంతావింది.

‘‘ఆ పరిస్థితి నేను గ్రహించాను, మీ గాధ ఎంత విషాదంగా వుంది,’’ అని ఒక నిట్టూర్పు విడిచింది.

అంత చిన్నతనంలో యశో ప్రియసోదరి నా గురించి చింతించడం ఇష్టంలేకపోయింది. యశోని దుఃఖపెడుతున్నాను. అది చాలదా?

‘‘అది సరే సురేఖా, ఆ రాత్రి జరిగిందంతా చాలా గమ్మత్తుగా వుందికదూ?’’ అన్నాను.

‘‘అలా నెమ్మదిగా అంటూన్నారేమిటి బావగారు? మరునాడు అదంతా ఒకకలలా అనిపించింది . తర్వాత కొన్నాళ్లకి అక్కయ్య వద్ద నుంచి డబ్బు వచ్చేటప్పటికి నా ఆశ్చర్యానికి, తాతయ్యసంతోషానికి మేరలేదు. ఒక రాత్రి పరిచయంతో అంత డబ్బు దేవతలు తప్ప ఎవరిస్తారు అనుకున్నాను. అక్కయ్య వివాహానికి రాకపోయేటప్పటికి నేను ఆ రాత్రి ఎంత దు.ఖించానో చెప్పలేను. దానితో సగం సంతోషం  హరించిపోయింది. వివాహమంటపం దగ్గర కూడా నాకు కన్నీరు ఆగలేదు. మీరు మానవ మాత్రులు కారేమో అనే అనుమానం కలిగింది. తర్వాత చాలా కాలానికి అక్కయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికి అనుమానం పోయింది. ఆమె మానవులలోని దేవత అని తెలిసింది,” ఏకరువు పెట్టింది సురేఖ. 

‘‘ఆగు సురేఖా; ఇంకా చాలు, కావాలంటే ఇదంతా ఉత్తరంలో రాసివ్వు. సురక్షితంగా నీ  అక్కకి అందజేస్తాను. అదిసరే అయితే నాకు మీ ఆయనని చూపించవా?’’ అన్నాను.

‘‘ఎందుకు చూపించను బావగారూ? మీరు ఇంకా వుంటారుగా? ఇవాళే మథుకి టెలిగ్రాం ఇచ్చాను. వచ్చే వీక్ ఎండ్ కు రమ్మనమంటాను,’’ అంది.

‘‘అయితే ఇక నేను వెళ్తాను, ఎన్నాళ్లుంటానో చెప్పలేను. వెళ్లేముందు ఇంకోసారి కనబడుతాను,’’ అని  లేచాను.

‘‘ఒకసారి ఏం బావా. రోజూరావాలి మీరు, లేకపోతే మీ ఇంటికి వస్తాను. అరె మరచి పోయాను, కాస్సేపాగండి ఇప్పుడు వస్తాను,’’ అని లోపలికి వెళ్లిపోయింది.

కాఫీ తీసుకొచ్చింది. అడ్డుచెప్పకుండా తాగేశాను.

‘‘మా అత్తమామలనీ చూడరా బావగారూ,’’ అంది బయటకు వస్తూంటే సురేఖ.

“మళ్ళీ  వచ్చినప్పుడు చూస్తాను,’’ అన్నాను.

గుమ్మంవరకూవచ్చి సాగనంపింది.

‘‘సురేఖా’’ అని పిలిచాను బయటకు వచ్చేస్తూ వుంటే జ్ఞప్తికి వచ్చి.

ఆమె వెనుదిరిగి దగ్గరకు వచ్చింది.

‘‘అన్నట్టు మాయింటికి వస్తానని చెప్పావు, ఇప్పుడు అలా చెయ్యటం మంచిది కాదు, వీలున్నప్పుడు నేనే వస్తుంటాను. మధు వస్తాడుగా,’’ అన్నాను.

సురేఖ ముఖం దిగజారిపోయింది.

‘‘ఈ లోపున ఇంకోసారి వస్తానులే సురేఖా. అలాంటి ముఖం మాత్రం పెట్టకు,’’ అన్నాను.

సురేఖను త్వరలో కలవడానికి వీలుపడలేదు.  అనేకవ్యహరాలు చూడాల్సివచ్చింది. స్వతహాగా సోమరిపోతును నేను. అయినా అప్పుడు గత్యంతరంలేక అన్ని పనులూ చేశాను. రోజువిడిచి రోజు యశోకి ఒక వుత్తరం రాసేవాడిని. ఆ పనిమట్టుకు క్రమం తప్పకుండా చేసేవాడిని, అలా చేస్తానని వాగ్దానం చేశాను. మాట తప్పితే ఆమె చాలా బాధపడుతుంది. బయలుదేరి వచ్చేసినా రావచ్చు. యశోని నేను పొందిన తర్వాత ఇదే మొదటి ఎడబాటు మాకు, ఇది ఆమె ఏవిధంగా సహిస్తోందో? ఆమె మనస్సంతా ఇక్కడే వుండి వుంటుంది. నా గురించీ, సురేఖ గురించీ ఆలోచిస్తూ కూర్చుని వుంటుంది. ఒంటరిగా ఆమె ఏమి చేస్తూ వుంటుంది? శరీరాలు దూరంగా వుంటే మనసులు దగ్గరకు వస్తాయంటారు. మా హృద‌యాలు ఎప్పుడో ఏకమయ్యాయి కానీ మా శరీరాలే దగ్గరగా ఉండికూడా  విలీన మవలేదు.  ఈ ఎడబాటువలన మాకు వేరే కలిగే నష్టమేమిటి? 

అనుక్షణం యశో మనస్సులో మెదిలేది. కావలసింది లభించకపోయినా, వేళకి ఏమైనా జరుగకపోయినా నామనస్సడిగేది. ‘యశో వుంటే ఇలా జరగనిచ్చునా?’ అంటే నాకు లోపాలు కలిగాయని కాదు. లలిత పిన్ని నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. అయినా ప్రియురాలు యశోరాజ్యం వేరు, పిన్ని లలితాదేవి వేరు.

అన్నట్లుగానే ఆ ఆదివారం సురేఖ ఇంటికి వెళ్ళేను.

సురేఖ తంతి అందుకుని మధు మెయిల్లో వచ్చాడు. సురేఖ ఆ రాత్రి మధు ఆ వూరిలో అందరికన్న అందంగా వుంటాడని చెప్పింది. నేను అంతదూరం పోను, కాని ఈ యువకుడు అందంగానే వుంటాడు. సురేఖ మధు ఒకరి పక్కన ఒకరు నించుని నవ్వుతూంటే నామనస్సు సంతోషంతో నిండిపోయింది. ఎంత చక్కని జంట వారిది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు వీరు; నా అనుభవంలో ఇది వక్కటే ఇలా పరిణమించింది. వారి వివాహపు బాటలో ఆటంకాలు లేవు. మనస్పర్థలులేవు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. సురేఖకి సుజాతకీ ఎంత విభేదముంది. ఈ సుఖ పరిణామానికి బాధ్యులెవరు? యశో రాజ్య మంటే ఒక వుత్తమనారీమణి? కాని ఈ సుఖమే, ఈ దాంపత్య సౌఖ్యమే ఆమెకు లభ్యంకాలేదు, అందుచేతనే ఆమెను నాతో తీసుకరాలేక పోయాను. దీనికంతకీ కారకుడిని నేనే, నేనే.

‘‘మమల్ని దీవించండి, బావగారూ,’’ అంది సురేఖ మధుతో కలిసి నా కాళ్ళకి మొక్కబోతూ. 

‘‘అలాంటి పనులు చేయకు సురేఖా. నేనేమంత పెద్దవాడిని కాను. నన్ను అప్పుడే ముసలివానిని చెయ్యకండి,’’ అన్నాను నా ఆలోచనలకు స్వస్తి పలుకుతూ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ.

‘‘అలా అడ్డుపెట్టకండి బావగారూ. అక్కయ్యలేదు. ఇక మమ్మల్ని మీరైనా ఆశీర్వదించండి. వివాహ సమయంలో మాకిది లభించలేదు,’’ అంది.

ఇక నేను అడ్డుచెప్పలేదు. మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకున్నాను. వీరిద్దరినైనాకష్టమూ దుఃఖమూ అనేవి అంటకుండా చూడమని.

‘‘మీకు ఏ విధంగా కృత‌జ్ఞత వెల్లడించాలో తెలియటం లేదని సురేఖ చెప్పింది,’’ అన్నాడు మధు.

‘‘పొరబడుతున్నావు మధూ, నువ్వు నాక్కాదు ఈ సత్కారాలన్నీ చేయాల్సింది. ఆవిడ వేరొకచోటవుంది, మీ కృత‌జ్ఞతకి మీ నమస్కారాలకీ అర్హురాలు ఆమె,’’ అన్నాను.

‘‘అవును బావగారూ మీరు చెప్పింది నిజమే, మా అక్కయ్య నిజంగా పూజ్యురాలు, కాని ఆమెకు మీకంటే ఆప్తులు లేరు. ప్రాణం కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తూంది. అందుకని మీరు పూజ్యులే,’’ అంది సురేఖ.

‘‘సరే సురేఖా, అయితే అయ్యాను కాని ఆపనిమటుకు చెయ్యకు. కావాలంటే ఫోటో ఒకటి ఇస్తాను. దానికి చెయ్యండి,’’ అన్నాను నవ్వుతూ.

‘‘నిజమే బావగారూ. అక్కయ్య మీరు కలసివున్న చిత్రం ఒకటి ఇవ్వండి,’’ అంది సురేఖ.

‘‘వుంటే తప్పకుండా ఇద్దును, కాని మేమిద్దరమూ కలసివున్న చిత్రమేలేదు. చివరకు మీ అక్కయ్య ఫోటో కూడా లేదు నావద్ద,” అన్నాను వాళ్లిద్దర 'తెల్ల' ముఖాలు చూస్తూ.   

వాళ్ళతో కాసేపు కబుర్లాడి  (అదృష్టవశాత్తు మధు తల్లితండ్రులు  ఇంట్లోలేరు) పిన్నిఇంటికి చేరేను,

ఆ తరువాత సురేఖతో నా పరిచయం ఎక్కువైంది. వీలున్నప్పుడల్లా వాండ్ల ఇంటికి వెళ్లేవాడిని, అక్కచెల్లెళ్లు లేనికొరత సురేఖ ఆరోజుల్లో తీర్చింది. అది నాకొక కొత్త అనుభూతి. యశోలో, తల్లి, సోదరి, ప్రేయసి ఇవన్నీ మిళితమై వుండేవి. ఆమెకూడా దగ్గరవుంటే ఎంతో బాగుండును. చెల్లెలూ, మరిది తనను పువ్వులలో పెట్టి పూజిస్తుంటే  ఆమె ఎంత సుఖించేదో? నేనెంత ఆనందించేవాడిని.

రాజమండ్రి వచ్చి ఒక నెల కావచ్చింది. లలితపిన్ని తలిదండ్రులు కూతురుతో అక్కడ వుండిపోవటానికి ఒప్పుకున్నారు. దానితో నామీద వున్న బరువు తీరింది. మిగతా సమస్యలు సులభంగానే పరిష్కారమవుతాయని ధైర్యం కలిగింది. మా ఇంటి అద్దె తిన్నగా కాశీ అందేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. భూముల మీద వచ్చే రాబడికి కూడా అదే ఏర్పాటు చేసుకున్నాను. పనులన్నీ అయిపోయిన మరునాడే  బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. యశోకి తంతి ఇచ్చాను.

ఆరోజే నా ప్రయాణం. రైల్వేష్టేషన్లో ఎవరివద్దో ఒకరి నుంచీ నా తిరుగుళ్లలో కన్నీళ్లతో వీడ్కోలు తీసుకోటం నాకు పరిపాటి అయిపోయింది. హృద‌య విదారకమైన అనేక సంఘటనలకి అది రంగస్థలమైపోయింది. ఇలాంటి వాటితో నా హృద‌యం కరడుగట్టిపోయింది. సురేఖ ఇంకా లేతయవ్వనంలో వుంది. ఇప్పటివరకూ జీవితంలోని వెలుగు మాత్రమే చూసింది. అలాంటి స్థితిలో నాకు వీడ్కోలు చెప్పటానికి స్టేషన్ కు వచ్చింది. నేను వద్దనలేదు. ఇక రాజమండ్రితో చాలా వరకూ నా సంబంధము తీరిపోయింది. మరలా ఈమెను తిరిగి చూస్తాననే నమ్మకం లేదు. దాని గురించి నేనట్టే చింతించలేదు. సురేఖకి భవిష్యత్తులో కష్టాలు, కన్నీరు ఎదురు కాకూడదని వాంఛించాను. యశో సరళా, లఖియా, సుజాతా వీరందరికీ ఏవో దుఃఖ కారణాలున్నాయి. సురేఖ మాత్రమే ఇప్పటి వరకు ఈ దుఃఖాలలో చిక్కుకోలేదు. మునుముందర ఆమె బాటలో కూడా ముళ్లులేకుండా వుండాలి. అదే నా వాంఛ.

‘‘ఈ నెల్లాళ్లూ అక్కయ్య మనతో వుంటే ఎంత బాగుండేది’’ అంది సురేఖ తనలో తను  అనుకున్నట్టుగా.

‘‘ఎందుకు బాగుండదు సురేఖా. చాలా బాగుండేది,’’ అన్నాను.

‘‘అక్కయ్యని చూడాలని వుంది, బావగారూ,’’ అంది.

‘‘దానికి మీరు కాశీ రావాలి సురేఖా,’’ అన్నాను.

‘‘అది చాలా కాలం తర్వాత మాట,’’ అంది సురేఖ దీర్ఘంగా నిట్టూర్చి.

‘‘అక్కయ్యను మరచిపోవాలి సురేఖా. ఆమె నీకు అందుబాటులో లేదు. ఇక ముందు వుండ కపోవచ్చుకూడా. ఆమె నాకు చాలా అవసరం. ఇలాంటి వాటిని గురించి నీవు ఆలోచించకూడదు. ఇంకా చిన్నపిల్లవి. నీకు అన్నిటికన్నా మిన్నగా మధు వున్నాడు. ఈ వూరిలో అందరికంటే అందగాడు, అయినా నీ  బావ ఎలా వుంటాడు సురేఖా ఎప్పుడు చెప్పలేదు,’’ అన్నాను ఆమె భుజం మీద చెయ్యి పెట్టి.

"అక్కయ్యని అడిగి చెపుతా బావా,"  అన్న సురేఖ వణికే పెదవుల మీద చిరునవ్వు వెలసింది.

 

 

చాప్టర్ 33

 

 

ఒక నెల ఎడబాటు తర్వాత యశోని తిరిగి కలుసుకున్నాను. మనిషి ఎంతో చిక్కిపోయింది. ముఖం మీద అలసట, నీరసమూ స్పష్టంగా కనబడుతున్నాయి. చలికాలం అది. తను నా వులన్ కోటు పట్టుకుని, కాశ్మిర్ శాలువ కప్పుకున్నా, వణకుతూ, ప్లాటుఫారం మీద నా రాక కై  ఎదురు చూస్తూంది. రైలు దిగిన వెంటనే నా కోటు ఇచ్చి వెంటనే తొడుక్కోమంది. టాక్సీలో ఇంటికి వెళ్తున్నాము ఒకరినొకరం హద్దుకు కూచుని.

‘‘జబ్బుపడ్డావా అమ్మీ,’’ అడిగాను తన చేయి తీసుగుని. 

“లేదే, ఎందుకలా అడుగుతున్నారు?’’ అంది నీరసంగా నవ్వుతూ.

‘‘నీ వాలకం చూస్తే  అలానే వుంది,’’ అన్నాను రుగ్దకంఠంతో.

‘‘ఇదంతా విరహం బాదల్ బాబూ. ఇక ఇప్పటి నుంచీ మిమ్మల్ని ఒక్కరినీ ఎక్కడికీ పంపించను. ఎడబాటంటే ఏమిటో తెలిసి వచ్చింది’’ అంది  హఠాత్తుగా ఒడిలో తల పెట్టి కళ్లు మూసుకుని.  

‘‘నేనెలా అనిపిస్తున్నాను,’’ అన్నాను నా తల త్రిప్పి తన కళ్ళలోకి చూస్తూ

‘‘మీరు ఏమీ మారలేదు, మునుపటి లాగే వున్నారు. నేను లేని లోటు మీకున్నట్లులేదు, ’’ అంది.

‘‘అది  కొంత మటుకు సురేఖ తీర్చింది అమ్మీ,’’ అన్నాను.

‘‘సురేఖ కొత్త కాపురమెలాగుంది?’’ అంది.

‘‘అన్యోన్య దంపతుల్లా ఉన్నారు,  సురేఖ నాకుచెప్పగా మిగిలిన నీమీద  ప్రేమను ఇందులో పొందు పరచిందను కుంటాను,’’ అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

“ఇప్పుడు కాదు తర్వాత చదువుతాను, నన్ను ఇలాగే పడుకోనివ్వండి. ఈ నెల్లాళ్లూ ఈ సుఖం కోసమే పరితపించాను,’’ నా ఒడిలో పడుకునే కళ్లు మూసుకుని అంది.

‘‘నేను నీకు ఇంత అవసరమని ఎప్పుడూ చెప్పలేదేమి అమ్మీ? చెప్పివుంటే నిన్ను వదిలి వెళ్లేవాడిని కాను,’’  శాలువ సరిగ్గా ఆప్యాయంగా కప్పి అన్నాను.

‘‘అభిమానం అడ్డువచ్చింది. ఇక ఎన్నడూ  ఈ పొరపాటు చెయ్యను,’’ అంది నా  చెయ్యి గట్టిగా పట్టుకుని. 

ఆమాటతో నా హృద‌యం పూర్తిగా కరిగిపోయింది.

“అలాగే చెయ్యి అమ్మీ, నేను ఎప్పుడూ ఇక నీ మాటకు అడ్డుచెప్పను,’’ నెమ్మదిగా ఆమె తలను ముద్దుపెట్టుకుని అన్నాను,

‘‘మీరు ఎప్పుడు అలాగే అంటారు,’’ అంది మెల్లగా.

“కాదు అమ్మీ నిజం చెప్తున్నాను నమ్ము, నీ ప్రేమ విలువ ఇప్పుడు పూర్తిగా  గ్రహించగలిగేను,’’ అన్నాను.

యశో దీనికి జవాబివ్వలేదు. అలాగే కళ్లుమూసుకుని నా ఒడిలో వుండిపోయింది. కనుకొలుకుల్లో కొంత సేపటికి కన్నీటి బిందువులు కనబడ్డాయి. నెమ్మదిగా, మృదువుగా వాటిని తుడిచి వేశాను.

ఆ రేయి నెల తర్వాతి రేయి. నా నేత్రాలకు యశో అందం ఎన్నటికన్నా చందంగా ఉంది.     

" నీకు గుర్తుందా అమ్మీ మన ఆంధ్ర ప్రాంతం చూడాలన్నావు," అన్నాను.

"మీరెల్లాగూ తేసుగెళ్ల లేదుగా, ఇప్పుడెందుకీ ఎందుకీ రెచ్చగొట్టడం," అంది బుగ్గ ముడిచి.

"ఎంత అందంగా ఉన్నవో వెళ్లి ఒమారు అడ్డం చూసుకో," అన్నాను చేయి చూపిస్తూ. 

"మీ కళ్ళుండగా నాకు దాని అవసరమేమిటి చెప్పండి,' అంది నా పక్కన కూర్చో బోతూ.                             

"ఆగు కాస్త నా పెట్టేలోని ప్యాకెట్ తీసుకురా," అన్నాను.

"ఏం తెచుకున్నారేమిటి మీవూరినించి అంత శ్రద్ధగా," అంది ఆ ప్యాకెట్ అందిస్తూ.

"మన ఉప్పాడ చీరలు కట్టుకుని వాటి అందంపెంచుతావని ముచ్చటగామూడు చీరలు తెచ్చాను," 

అన్నాను ప్యాకెట్ విప్పుతూ.

"ఈ లెక్కన మీకు త్వరలో 'సరసశిఖామణి' బిరుదివ్వాల్సొస్తుందేమో," అంది వాట్లని పరిశీలిస్తూ.

"ఉండండి ఇపుడేవస్తా,"  అని  మా మూడవగది లోకి అవి  తీసుగెళ్లి,  గచ్చకాయరంగు చీరలో తిరిగొచ్చింది యశో ఉల్లసంగా  .

"ఎలావున్నాను,"అంది హొయలు మీరుతూ.

"నాకళ్ళు చెప్పటంలేదూ, చీర కెంత చంద మిచ్చావో!" అన్నాను ఆప్యాయంగా.                                 

నాకు అప్పుడు అనిపించింది. యశో నా దగ్గరవుండటము ఎంత సహజమో, ఆమె అందంగా వుండటం కూడా అంత సహజమని తోచింది. అదేదో నా హక్కులాగ భావించేవాడిని.

‘‘మీ అమ్మగారు అందంగా వుండేవారా అమ్మీ?’’ అని అడిగాను 

‘‘ఏం అలా అడిగారు?’’ అంది.

‘‘ఏమో, అడగాలనిపించింది, చెప్పు,’’ అన్నాను.

‘‘అవును, మా అమ్మ చాలా అందంగా వుండేదని మా నాన్నగారు చెప్పేవారు. ఆవిడ పోలికలే నాకు వచ్చాయనేవారు, నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా చిన్నతనంలో తన్ని కోల్పోయాను,’’ అంది.

‘‘అది నిజమే అయివుండాలి. లేకపోతే ఇంత అందం నీకెక్కడి నుంచి వస్తుంది,’’ అన్నాను.

‘‘నేను అందంగావుంటానా?’’ తన ముఖం  వికసించగా అంది నవ్వుతూ అంది.

‘‘నెమ్మదిగా అంటావేమిటి అమ్మీ?’’ అన్నాను.

‘‘కాస్త నా అందం వర్ణించ రాదూ, వింటాను, ‘‘అంది పెదిమ నొక్కిపెట్టి  నవ్వుతూ.

‘‘నేనే కవినయితే నువ్వడగాలా భామినీ? అయినా నీకూ, ఇతర వన్నెలకూ వ్యత్యాస మేమనగా నీకు అందమైన కళ్లే కాదు, అందమైన ముక్కు కూడా వుంది. నూరు అందమైన నేత్రాలలో ఎదో ఒక ద్వయానికే సొంపయిన ముక్కుతో జతకట్టే యోగం ప్రాప్తిస్తుందన్న జేన్ ఆస్టిన్ మాటకి నీ ముఖం దర్పణం,” అన్నాను

‘‘మీకవిత్వం నా మనోరంజకం. నన్నుచూసిన ప్రతివారూ, నేను అందంగా వుంటానని అంటారు. కాని మీరెప్పుడూ ఇంతవరకూ అలా అనలేదు. చాలాసార్లు కోపం వచ్చిందికూడా మీ మీద. అయినా మీరు మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారేనా చెప్పండి,’’ అంది సగర్వంగా.

‘‘ముమ్మూర్తులా అలాగేవున్నావు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మరీ  అందంగా వున్నావు. వయస్సుతో పాటు వయ్యారం, వంకరలూ వచ్చాయి,’’ అన్నాను.

‘‘చాల్లెండి, ఇంకవూరుకోండి, నాకు తెలుసు మీరు ఇతర పురుషుల్లా తళుకు వళుకుల శరీరాలకు   లొంగిపోరని, అయినా ఆశ్చర్యపోయేదానిని నా  అందం పట్ల మీరింత నిర్లక్ష్యంగా ఎలా వుండగలుగుతున్నారా అని,” అంది.

‘‘ఏమో తొలిచూపులోనే నీ అందం నన్ను అందాంధుడిని చేసిందేమో, అది నీకే తెలియాలి,’’ అన్నాను.

ఆమాటతో యశోకి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. క్షణకాలంలో పచ్చటి ముఖం ఎర్రగా కుంకుమలా అయిపోయింది. మనస్సులోని భావమే ఆమె ముఖం మీద స్పష్టంగా కనబడింది. ముఖం క్రిందకి దించివేసుకుంది.

“అరె, ఇంత సిగ్గెందుకు యశో!” అన్నాను చేత్తో ఆమె ముఖం పైకెత్తి.

‘‘నేను ఆనాడు చెప్పాను మీరు సువాసనగల పుష్పంలాంటివారని, అదే అందరినీ మీలో ఆకర్ఫిస్తుంది. మీకు అందం వుంది. కానీ అది ఎవరినీ మోసపుచ్చదు. మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే మీలోని ప్రత్యేకత కనబడిపోతుంది,’’ అంది కళ్లు క్రిందికి దించుకునే.  

“ఇది చెప్పడానికి ఇంత సిగ్గెందుకు అమ్మీ” అన్నాను.

ఆ సంభాషణ ఫలితంగా నేను ఒక విషయం గ్రహించాను. అదేమంటే ప్రతి స్త్రీ తాను అందంగా వున్నానని ఇతరులు - ముఖ్యంగా ఆమెని ప్రేమించేవారు చెప్పాలని కనీసం తనలో తనైనా అనుకుంటుంది. అపరిచితుడు చెప్పినా హృద‌యం ఒకసారి స్పందిస్తుంది. ప్రశంసనీయవాక్యాలు వీనులవిందుగా వుంటాయి. ప్రకృతిసిధ్దంగా పురుషుడు సౌందర్యాన్వేషి కాని స్త్రీ అలాకాదు, లేకపోతే వారిలో చాలా మంది యావజ్జీవ బ్రహ్మచారిణులుగా వుండిపోవాల్సి వస్తుంది. వనిత పురుషునిలో వాంఛించేది అందంకాదు; అతడి ఆదరణ, అనురాగము. యశో

1 ... 9 10 11 12 13 14 15 16 17 18
Go to page:

Free e-book «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗» - read online now

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment