క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗
Book online «క్షంతవ్యులు (Kshantavyulu) - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (inspirational novels .txt) 📗». Author భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
ఆరోజుల్లో ఆమె నిజంగా అలా చేసియుండవచ్చు. కాని అది ఆమెలో అణగారివుంది. అంతరించిపోలేదు. నేను ఆ కుటీరంలో అడుగుపెట్టిన క్షణంలోనే తిరిగి తలఎత్తింది. నేను ఆనాడు అనుకున్నది నిజమే. లఖియాలాగ యశోరాజ్యం ఎప్పుడూ సర్వసంగపరిత్యాగి కాదు. ఈమె ఎన్నడూ సన్యాసిని కాలేదు. లఖియాని ఆ దొంగ గురువు సుందరీ అని పేరుపెట్టి పిలిస్తే ఆమె సహించి వుండేది కాదు. అతగాడు ఆ విషయం గ్రహించి ఆమెకు రాణి అని పేరు పెట్టాడు. యశోని ‘సుందరీ’ అని పిలిస్తే ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఆమె అది నిష్కల్మషమైన హృదయంతో పెట్టిన పేరనుకున్నదనే విషయం నిస్సందేహమైంది. అయినా ఆమె సౌందర్యాన్ని ఇతరులు కొనియాడటం స్వాభావికమైనదని ఆమె అనుకొనివుంటుంది. అందుకనే ఆ పేరు ఆమెకి వచ్చిందని నాకు చెప్పింది. కాని ఆ పేరుపెట్టిన వ్యక్తి కల్మష హృదయుడని తెలసిన వెంటనే చెవులుమూసుకుని దానిని కాశీలో వదిలేసింది.
కాశీలో కాలం గడిచిపోతూంది మనస్సును బాధించే ఆలోచనలు కట్టిపెట్టాను. ఎందుకు వాటిని గురించి బాధపడాలి? దానివల్ల నాకు కలిగే లాభమేమిటి? జీవితంలో అంత సుఖం నేనెప్పుడూ అనుభవించలేదు. ప్రాణ సమానంగా ప్రేమించే ప్రేయసి, నిందారహితమైన మనస్సు, ఈ రెండూ ఎప్పుడూ నాకు ఇంతకు ముందు కలసిరాలేదు. ఇదివరకు ప్రవాహంలోపడి కొట్టుకుపోయేవాడిని కానీ ఇప్పుడు ప్రవాహంలో పయనించడం అభ్యసించాను. నేను వాంఛించిందంతా నాకు ఆమె వద్ద లభించింది. కాని ఆమె వాంఛించింది నానుండి ఆమెకు లభించలేదు. నేను తప్ప ఇంకెవరైనా ఆమెను సుఖపెట్టేవారు. అలాంటి స్త్రీకి ఏలోటు రానిచ్చివుండేవారు కారు. పిల్లలంటే యశోకి వున్న మమకారం నేను గ్రహించాను, సరళ కొడుకు ‘రామం బాబూ’ గురించి చాలాసార్లు మాట్లాడేది.
“సుశీకి మీకు వివాహం జరిగివుండినట్లైతే మీ మనుమడికి పెట్టుకోవల్సిన పేరది,” అంది
‘‘అప్పుడు బాదల్ బాబూ అనే పేరు నాకు వుండదు యశో. ఇంకెవరికో ఆపేరు పెట్టివుందువు,’’ అన్నాను.
యశో వినివూరుకుంది, ఆమెవుద్దేశం నేను గ్రహించాను. ఆమె అన్న ఆ వాక్యంలో సుశీకి బదులు యశో అని చేరిస్తే సరిపోతుంది. అది ఆమె చెప్పలేక అలా అంది. కాని ఆమెలోని నిగ్రహశక్తి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచేది. లేకపోతే ఏం జరిగేదో?
చాప్టర్ 34
ఎదురుచూసిన శుభవార్త రానే వచ్చింది. లఖియా బెయిల్ హియరింగ్ వచ్చే గురువారం ఖాయమయిందని. యశో సంతోషానికి పట్ట్ట పగ్గాలులేవు, లేశమంత శంక అయినా లేదు న్యాయమూర్తి తీసుకోబోయే నిర్ణయంమీద, ఆమెకు రవిప్రకాష్ మాటలు బాగా వంటబట్టాయి.
మేమిద్దరం బుధవారంమధ్యాన్నం ముస్సోరి చేరి యధావిధిగా సరళ ఇంట్లోనే బసచేసాం. మరునాడు రాజేంద్రకు వీలులేకపోవడం వలన, సరళే మమల్ని డోన్ తీసుకెళ్లింది వాళ్ళ కారులో. సరళ కారు డ్రైవ్ చేస్తుంటే దారిపొడుగునా యశో, నేను వంతులేసుగుని రామంబాబు' తో ‘ఆడుకుంటూ కోర్ట్ చేరిన విషయమే గుర్తించ లేదు.
"మీరో బుల్లిబాబుని కంటారా లేక నన్ను కని ఇమ్మంటారా?" అంది సరళ కంపౌండులో కారు పార్క్ చే స్తూ.
"మీరంటే వారి నుద్దేశించా లేక నన్నా," అంది యశో.
"ఇద్దరినీ," అంది సరళ.
"కనిపించడం అయన వంతు కనివ్వడం నా తంతు," అంది యశో నవ్వుతూ.
నాకు ఏమనాలో తెలియక నొరు మెదపలేదు.
"మవునం అర్ధాంగీకారం అంటారు, అవునా 'బాదల్ బాబు," అంది సరళ.
అప్పుడే కారు దిగి వచ్చిన రవిప్రకాష్ నన్నుఇరకాటం లోంచి తప్పించేడు.
కోర్ట్ లో అంతా రవిప్రకాష్ చెప్పినట్టే అయింది, ప్రభుత్వ ప్లీడర్ పెద్దగా పెదవి విప్పక పోగా లాఖియాను తక్షణం బెయిల్ మీద విడుదల చెయ్యాలని ఆదేశించడమేగాక, గురువుగారి మీద తాను మోపిన మానభంగ అభియోగం మూడు నెలల్లో పరిశీలించి కోర్టుకు తెలియపరచాలని పోలీసులను ఆగ్రహించారా న్యాయమూర్తి.
కోర్ట్ హాల్ బయటకొచ్చినతరువాత, యశో, సరళ, రవిప్రకాష్ని కౌగలించుకున్నతపని చేశారు.
కొంత సేపటికి రవిప్రకాష్కి కోర్టు ఆర్డర్ చేజిక్కగా, అందరం డూన్ జైలు చేరాము లాఖియాని స్వాగతించడానికి , కానీ రాబోయే సెంటిమెంటల్ తుఫానులో తనెందు చిక్కుకోడం అన్నట్లు రవిప్రకాష్ వార్డెన్ రూమ్ లోనే ఉండిపోయాడు.
మేమంతా గుమ్మంవద్ద నుంచుని పొడుగాటి ఆదారిని అవలోకించాము. లఖియా మలుపుతిరిగి మాకు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె పక్కన పోలీసువాడు లేడు. చేతిలో ఒక చిన్న మూట పట్టుకుని ఒంటరిగానడచివస్తూంది. మావద్దకు రాగానే ముందస్తుగా సరళ కొడుకుని ముద్దాడి, నాకేసి చూస్తూ, అంది, "పేరుకు తగ్గ పెద్దమనిషివి అవ్వరా."
తరువాత, సరళ, యశోల ఆలింగనలలో మునిగి, తేలి, నాదరి చేరి, పాదాభివందనంచేసింది.
'ఇదేమి బాగా లేదు లఖియా," అన్నాను తన్ను లేవదీస్తూ.
"రామంబాబు, ఇంతకంటే విలువైన గురుదక్షిణ నేనివ్వలేను, దయవుంచి స్వీకరించండి," అంది.
"సదా సుఖీభవః లఖియా," అన్నాను తన తలపై నా చెయ్యి ఉంచి.
తరువాత అందరం రవిప్రకాష్ని కలసినప్పుడు నేను లఖియా తో "ఈయన నాగురువు, నీ దైవం" అంటే “నాకు తెలుసు” అని ఆయన కాళ్ళకు కూడా మొక్కింది.
"కంగ్రాట్స్ లఖియా, నేచెప్పేనుగా మన కేసుకి ధోకా లేదని. నువ్వు తిరిగి ఈ దరిదాపుల్లోకి రానవసరం ఉండదని. కానీ ఈ వ్యవహారం తేలేవరకు నువ్వు ముస్సోరిలోనే ఉండాలి. దానికి నేను జమానతు యిచ్చాను," అన్నాడు రవిప్రకాష్ లాఖియాను లేవదీసి.
"ఇప్పుడు తనని కాశీ తీసుగెళదామనుకుంటున్నామే," అంది యశో.
"పది పదిరోజులైతే నేను పోలీసుస్టేషన్ లో మేనేజ్ చేస్తాను," అన్నాడు రవిప్రకాష్.
"వారం పది రోజుల్లో వచేస్తాలెండి," అంది లఖియా.
"వెల్కమ్," అన్నాడు రవిప్రకాష్
రవిప్రకాష్తో మాటా మంచికీ నే నాయన కారులో చేరగా, సరళ బాబుని తీసుకుని, యశో, లఖియాలతో తన కారు ఎక్కింది.
దారి పొడుగునా, తను లఖియాతో జరిపిన సంప్రదింపులు, ఆమెలో వస్తున్న చైతన్యం గురించి మాట్లాడిన విధానం రవిప్రకాష్ చెప్తుంటే నాకు వింతగా అనిపించింది.
కాశీకి బయలుదేరే ముందు యశో, నేను ముస్సోరీలో వారం రోజులున్నాము. రవిప్రకాష్ ప్రతి సాయంత్రంవచ్చి , సరళ బలవంతాన భోజనంచేసే వెళ్ళేవాడు. అతను లాఖియామీద చూపుతున్న శ్రద్ధాసక్తులు మేమందరం గమనించాము, లాఖియాతోసహా. నాకుమాత్రం తానేమీ పెద్దగా ఇబ్బంది పడుతున్నట్లనిపించలేదు.
మాతో సరళ కూడా బయలుదేరింది తన 'రామంబాబు' తో సహా, కాని రాజేంద్ర మాతో రావడానికి అంత సుముఖత చూపలేదు, "పనివుండి రాలేనన్నాడు".
అలా మొదలయింది కాశీకి మా తిరుగు ప్రయాణం, రాజేంద్ర వీడ్కోలుతో. సరళ తెచ్చిన కొత్త పేకలతో ఆ రైలు డిబ్బాలో, నలుగురం రమ్మీ ఆడ్డం మొదలెట్టేము ఆడవారి ఛలోక్తులతో. లఖియా తను నెగ్గినప్పుడు పొందిన సంతృప్తిని నే నామెలో ఇదివర కెన్నడు చూడలేదు. లఖియాలోని కోత్తదనం నన్నాశ్చర్యపరచింది. అదే నేనామెతో వ్యక్తపరిస్తే నవ్వి ఉరుకొంది. కొంతసేపటికి బాబు పేచీ మా ఆట కట్టించింది.
అప్పుడు సరళ బాబుని ఊరబెడుతుంటే, కిటికీ పక్కన కూర్చున్న లఖియా, బయటకు చూస్తూ వుంది, ఆలోచనా దృష్టితో.
"ఏమాలోచిస్తున్నావు లఖియా?" అన్నాను, చూసి చూసి.
"జీవితం ఎలా జీవించడమా అని," అంది తలా తిప్పకుండానే.
"మేమందరం ఉన్నామని మర్చి పోయావా?" అన్నాను బాధతో.
"కొత్త జీవితం మొదలెట్టడానికి మీ నలుగురి సహాయం కోరడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నాను కాని నేనాలోచిస్తుంది తరువాత జీవితం ఎలా జీవించడమా అని," అంది నాకేసిచూస్తూ.
"కొంచం అర్ధమయ్యేలాచెప్పు లఖియా," అన్నాను.
"ఎలాగైతే జన్మనిచ్చినవారి సంరక్షణ లేనీదే ఏ శిశువు బతికి బట్టకట్ట లేదో అలాగే నా కొత్త జీవన నాందికి ఎవరో ఒకరి సహయం కావాలి. నా రూపం, వయసు అది నాకు లబ్ధిపరచ గలదు కానీ నేను అందుకు నా సర్వస్వాన్ని ఫణంగా పెట్టాలి. ఎలాగయితే తమ సంతానాన్ని బాల్య దశలో తలితండ్రులు ఫలాపేక్ష లేక పెంచుతారో అలాగే మీనలుగురు నా నవ్య జీవినా రంభ అధ్యాయానికి శ్రీకారం చుడతారని నా నమ్మకం. అలాగే, ఎదిగిన పిల్లలు వారి పెద్దల ఋణం తీర్చుకున్నట్లు, నేనూ ఓనాడు నాధర్మం పాటించగలనని నా విశ్వాసం. మీరు చేయగల ధన సహాయంతో, నేనేదో జీవనోపాధి కల్పించుకుని, నా జీవితం నన్నెలా నడుపుతుందో చూస్తాను," అంది లఖియా సాలోచనగా.
"నువ్వు చెప్పిందేమీ కాదనము కానీ అదేదో మా దగ్గరుండే చేసుకోవచ్చుగా?" అన్నాను
"అదెలా సాధ్యమో ఆలోచించి చెప్పండి, తప్పక వుంటాను," అంది లఖియా.
యశో, సరళ, నేను; ఒకరి మొహాలు ఒకరంచోసుగున్నాము.
"ఇంతలో ఎంత ఎదిగావు లఖియా," అంది సరళ ఆఖరికి.
"నేనేదగలేదు సరళా, ఎదిగిపించారు, రామం బాబు నార వేసి, రవిగారు నీరు పోసి," అంది లఖియా క్తుతజ్ఞతాభరిత నేత్రాలతో.
ఆఖరికి కాశీ చేరి మా ఇంటికి వచ్చిన మొదటి అతిథులతో ఖాళీగా పడివున్న మూడవ గదిని ఉపయోగబరచాము. నేనదేమాటంటే సరళ నవ్వుతూ అంది యశో తో,
“మా రామం బాబు, మీ రామం బాబు ఇంట అడుగుపెట్టిన వేళావిశేషం వల్ల త్వరలోనీకడుపు పండుతుందిలే."
"తధాస్తు," అంది లఖియా యశోని కౌగలించుకుని.
మూడురోజులు కాశీ చుట్టుముట్టి, సారనాధ్ పై దండయాత్రకు వెళ్లాం. అప్పటివరకు, అయిదుమైళ్ల దూరంలో వున్న అక్కడికి నేను వెళ్లలేదు, యశో ఇంతకుముందు ఒకసారి ఎవరితోనో వెళ్లి వచ్చింది.
మేమంతా అక్కడి బుద్ధుని విగ్రహాన్ని తదేకంగా చూస్తూవున్నాము. ఒక పక్క లఖియా మరో పక్క యశో తలవంచుకుని వున్నారు. బుద్ధుని ముఖంలోంచి వుట్టిపడే శాంతం, ప్రశాంతతా లఖియా నిమీలిత నేత్రాలలో నాకు కనబడ్డాయి. ఎప్పుడూలేంది సరళ కళ్లుమూసుకుని మౌనంగావుంది.
నాకు ఆ దొంగ గురువు తనను ఆనాడు గౌతమబుద్ధునితో పోల్చుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఆరోజు నేను తన్ని ధిక్కరిస్తే యశోకి ఎంతో కోపం వచ్చింది. కానీ చివరకు ఇలాగ అవుతుందని ఎవరనుకున్నారు? నన్నునేనపుకోలేక అదేమాట అంటే, కలవపువ్వు లాంటి ఆ కళ్లతో నా కళ్లు వొకసారి చూసి క్రిందికి దించుకుంది. దాని అర్ధం ‘‘ఈ గాయంతో ఇంకా నేను బాధపడుతున్నాను బాదల్ బాబూ. మీరు నాకు ఇంకా అది ఎందుకు జ్ఞాప్తికి తెస్తారు’’ అని నేను గ్రహించాను .
"అనాలోచితంగా పుండ్ల మీద కారంచల్లినందుకు ఈ క్షంతవ్యుడ్ని క్షమించండి," అన్నాను లాఖియాను యశోను ఉద్దే శించి.
యశో క్షమా వీక్షణం తరువాత లఖియా తన జ్ఞాన నేత్రం విప్పిండి .
"దుష్టుడికి ఇతరుల నిస్సహాయత అగ్నికి ఆజ్యం లాంటి దైతే, సౌమ్యుడుకి తన లఖియాత అంధుడి చేతి దిక్సూచి లాంటిది. కరువులో చెట్టు నరికి కలప చేయడమే లఖియాత, నిఘంటువులో నాపేరు నేనే చేర్చుకున్నాననే దోషం సరి. నాభర్త అప్పులు తీర్చడం భార్యగా నావ్యక్తిగత ధర్మం కానీ, ఉన్నఇల్లు తెగనమ్మి, నిల్వ నీడ లేకుండా చేసుకోవడం నామూర్ఖత్వం లేక రామాంబాబూ, మీరన్నట్లు, 'నా అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవట మనే అహంకారం' అయివుండలి. నేనేగనక ఆ ఇల్లు నిలబెట్టుకొని అందులో కొంత భాగం అద్దెకిచ్చి, ఎదో చిన్న ఉద్యోగమమో లేక వ్యాపారమో చేసుకుంటూ అప్పులు తీర్చి ఉంటే, ఇహం పరం రెండూ దక్కేవి. కానీ నా లఖియాతతో రోడ్డున పడి, నన్ను నేనే నిస్సహాయురాలిని చేసుకుని నాస్వయంకృతాపరాధంతో నేనే నన్ను బలిపశువుని చేసుకున్నాను. ఈ తప్పు మరెప్పుడు చెయ్యను, అందుకు రామం బాబూ, మీకు, రవిగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను,” అంది లఖియా మమ్మల్నందరిని అవాక్కుపరచేలా.
లఖియా, సరళ, బాబు మా ఇంటి కొచ్చి వారం రోజులయింది. ఆరోజే ముస్సోరికి వాళ్ల తిరుగు ప్రయాణం.
యశో,నేనువారిని సాగనంపడానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళేము. కొంత సేపటికి వాళ్ళుఎక్కేవలసిన ట్రైన్ ప్లాట్ఫారం కి చేరింది. నేను వారి సామాను తలుపుపక్కనున్న కంపార్టుమెంటులో సద్దిపెట్టాను. వాళ్లిద్దరూ చెరో కిటికీ దగ్గర కూర్చుండగా, మేమిద్దరమూ ప్లాట్ఫారం మీద వారి దగ్గర నిలుచుని ఉన్నాము. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కానీ నేను మౌనాం వహించాను.
ఇంతలో గార్డ్ పచ్చజండా చుపించగా లఖియా కిటికీలోంచి చెయ్యి వూపు తోంది. నాకెందుకో ఇంక ఆమెను తిరిగి చూడలేనేమో ననే భావం హఠాత్తుగా కలిగింది. అప్పటికే రైలు కదలిపోతూంది. నేనేమి చేస్తున్నానో నాకే తెలియలేదు. రైలు వెంట పరుగెడుతూ పుట్ బోర్డు ఎక్కి అప్రయత్నంగా లఖియావైపు వంగి అన్నాను, ‘జీవితంలో నీకంటే అధికంగా ఎవరినీ ప్రేమించలేదు లఖియా.’’
లఖియా ముఖం మీద అత్యంత ఆవేదనా ఆతురతా కనబడ్డాయి.
ఈలోపుగా రైలుప్లాటుఫారం పూర్తిగా దాటి పోయింది. అది చూసి నేను దిగటానికి ప్రయత్నించాను.
‘‘వద్దు రాంబాబూ దిగకండి’’ అంది లఖియా కంగారుపడుతూ.
ఆమెమాటలు నేను వినిపించుకో లేదు. వెనక్కోసారి తిరిగిచూసాను యశో కోసం, తను రైలుపట్టాల పక్కన పరిగెట్టు కొస్తూ కనబడింది. నాకంగారు మిన్ను ముట్టి వెంటనే కిందకి ఉరికాను. అంతే,తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
చాప్టర్ 35
కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రి మంచం మీద పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళ మంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు చూసేక నా శరీరంలో నీరసం ఇంకా పెరిగిందనిపించింది .
‘‘మీ ప్రయాణం ఆపేశాను కదూ,’’ అన్నాను.
అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. క్షణకాలం అంతా నివ్వెరపోయారు. యశో గబగబా లేచివచ్చి నాగుండెల మీద వెక్కివెక్కి ఏడుస్తూ పడిపోయింది. అంత దుఃఖాన్ని నేనింతవరకూ ఎప్పుడూ చూడలేదు.
యశో తల హృదయం మీద వుండడంతో ఆయాసం కూడా పుట్టుకు వచ్చింది.
‘‘కాస్త తలతియ్యి యశో ఆయాసంగావుంది, ఎందుకు చెప్పు ఇంత ఏడుపు,’’ అన్నాను.
లఖియా చటుక్కున లేచినించుని యశోని లేవదీసింది. యశో ముఖం చూస్తే నాకెంతో భయం వేసింది. ఎంత పాలిపోయింది? కుడి కాలిలో శూలంపెట్టి పొడిచినట్టయింది. అప్పుడు భయంకరమైన ఆలోచన కలుగగా కాళ్లమీద కప్పివున్న దుప్పటి జరిపి చూశాను. రెండుకాళ్లచుట్టూ కట్లున్నాయి. కుడికాలి క్రింద భాగమంతా ఏదో తెల్లగా వుంది. అది కదపటానికి ప్రయత్నించాను. ఇసుమంతైనా అది నేను చెప్పినట్లు వినలేదు అది ప్లాస్టర్ చేసారని గ్రహించాను. ఎడమకాలు కదిపి చూస్తే కొంచెం కదిలింది..
‘‘నా కాలుకి ఏమైంది?’’ అని గట్టిగా అరచాను.
తలకు కూడా కట్టుకట్టివుందని అప్పుడే గ్రహించాను. మరుక్షణంలో స్పృహతప్పి పోయింది.
తిరిగి స్ప్రుహ వచ్చేక నాపక్కన యశోనాకేసి దీనంగా చుస్తూ కనబడింది అప్రయత్నంగా ఆమె వైపుకు నా చేయి చాచేను; దాన్ని కళ్ల కద్దుకుంటూ తన కన్నీటితో పావనం చేస్తుండగా నాఆ లోచన్లు పరిపరి విధాలుగా సాగాయి.
నేను కుంటివాడినై పోయానా? చిన్నతనంలో ఒకసారి మద్రాసులో ఒక కుంటివానిని గేలిచేస్తే చిన్నపిల్లయినా సుశీ మందలించింది, ”తప్పు రామం పాపం వాడేమిచేయగలడు చెప్పు? నవ్వకూడదు.’’ ఇప్పుడు నా పరిస్థితీ అదే . ఒకవేళ సుశీ గనుక జీవించివుంటే ఏమనివుండును. స్వర్గంలో సుఖంగా వుంది. ఎవరికి తెలుసు బహుశా ఇదంతా యశో మంచికే జరిగిందేమో. మిసమిసలాడుతున్న యవ్వనంలో వున్న ఈ అందాలభరణి దేనికీ కొరగాని అంగవికలుడైన నన్నెందుకు భరించాలి? ఆమెకు నా మీద వున్న ఆశలన్నీ దానితో నేలకూలిపోయివుంటాయి. తను చేసిన పొరపాటు ఈ పాటికి గ్రహించివుంటుంది.
“ఎలావుంది?’’ యశో ఆప్యాయత నాఆలోచనలకి అడ్డకట్టు వేసింది.
"నన్ను క్షమించగలవా అమ్మీ?" అన్నాను నా కళ్ళు నూతులవగా.
“చూడండి ఈనాడు మీరు నాకొక మాటివ్వాలి. దీనిని గురించి మీరేమీ చింతించకండి. అసలు ఆలోచించనేకూడదు. మీ ఎడమ కాలుకేమి ధోకాలేదనీ, కుడికాలు కూడా నిమ్మదిగా దారిలో పడుతుందని డాక్టర్ గారు భరోసా ఇచ్చారు నాకు. అప్పటివరకు మీ ఒక కాలుకి బదులు నా రెండు కాళ్లు, రెండు చేతులూ వున్నాయి. మీకాలు ఎలా వాడుకుంటారో నన్నుకూడా అలా వాడుకోండి. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మీదికానిది నావద్ద ఏమీలేదని, మీకు నేనేమీ లోటురానీయను, నా జీవితంలో నాకిక వేరే పనిలేదు,’’ అంది నాజుట్టును చేత్తో సరిచేస్తూ
‘‘నువ్వేంచెపితే అదే చేస్తాను యశో అని నేను మాట ఇవ్వలేను , నన్ను మిధ్యావాదిని కూడా చేయకు, అది నా శక్యంలో లేదు. నీ జీవితంలో కూడా అన్నీ కష్టాలే రాసివున్నాయి. అమ్మీ. నీవు నాతో ఏమి సుఖపడగలవు చెప్పు?’’ అన్నాను.
‘‘ఎందుకు పడలేను చెప్పండి, మీలో ఇప్పుడు వచ్చిన లోటేమిటి? పూర్వం కంటె ఇప్పుడు నామీద కాస్త ఎక్కువగా ఆధారపడతారు. అంతేగా? అదీ మంచిదేగా, పూర్వంకంటే మీ అనురాగము, అభిమానము నాకు ఇంకా ఎక్కువగా లభిస్తాయి. నాకు అంతకంటే ఏంకావాలి? ’’ అంది.
‘‘నేను నీ జీవితంలో ప్రవేశించకపోతే ఎంత బావుండును అమ్మీ. ఎవరినో పెళ్లిచేసుకుని పిల్లలతో సుఖంగా వుండివుందువు,’’ అన్నాను.
ఆ ధోరణితోనే. వెచ్చటి రెండు కన్నీటిబొట్లు నుదిటి మీద పడ్డాయి.
‘‘నన్ను కష్టపెట్టాలని కోరికగావుంటే అలా అనండి, ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు మీరు ఎందుకు నమ్మరు చెప్పండి,’’ అంది.
‘‘నమ్మకపోవటం కాదు అమ్మీ. నిన్ను చూస్తూవుంటే నాకు అనిపిస్తూంటుంది. ఇంత అందమూ, బూడిదలో పోసిన పన్నీరై పోయిందిగదా అని, అందుకు బాధగావుంటుంది, ’’ అన్నాను.
‘‘బాదల్ బాబు బూడిదలో ఎందుకు పోస్తారు లేక అందరిమీద ఎందుకు జల్లుతారు? వారి పన్నీరును వారి దగ్గరే దాచుకున్నారు,’’ అంది యశో మెల్లగా నవ్వుతూ.
నేనేమీ జవాబివ్వలేదు, అంగవికలుడననే ఆలోచనపోలేదు. కాలుకేసి చూసినప్పుడల్లా చురుక్కుమని జ్ఞప్తికి వచ్చేది.
‘‘నేనొకప్పుడు ఉద్యోగం చేస్తానంటే వద్దన్నావు. అమ్మీ ఇక నీకా భయం అక్కర్లేదే,’’ అన్నాను.
‘‘అవును, అవసరం వస్తే గడించి పెడ్తాను, అందులో తప్పేముంది. కాని ఆ అవకాశం రాదనే నా నమ్మకం. మీ ఇంటి అద్దే భూముల మీద శిస్తు కలిసి మన ఇద్దరికి గడిచిపోతూంది. నా డబ్బు ఖర్చుచేయటమేలేదు. ఆ తర్వాత ఇంకా నగలున్నాయి. ఇవన్నీ అయిపోతే నా చేతులున్నాయి,’’ అంది.
‘‘నీకొకమాట చెప్పాలి అమ్మీ, రైలు వెంట పరుగెడుతూ లఖియాతో నేను ఏమన్నానో నీకు తెలుసా?’’ అన్నాను యశో కుడిచెయ్యి నా రెండు చేతుల్లోకి తీసుకుని.
‘‘తెలుసును, లఖియా చెప్పింది,’’ అంది.
లఖియా ఆవిషయం చెప్పిందని విని కాస్త ఆశ్చర్యపోయాను సరళ కూడా విందని జ్ఞప్తికి వచ్చి సిగ్గుపడ్డాను.
’’విని ఏమనుకున్నావు, బాధపడ్డావా?’’ అడిగాను.
‘‘బాధపడటానికి ఏముంది చెప్పండి. మిమ్మల్ని గురించి మీ కంటె బాగా నాకే తెలుసు, ఆ విషయం నాకు చాలా కాలం పట్టి తెలుసు,’’ అంది గోముగా.
‘‘ఏమి తెలుసు అమ్మీ,’ అన్నాను కాస్త భయపడుతూ.
‘‘మీ మనస్సు మీకే తెలియదు, మీలో నేనంటే అమితమైన కృతజ్ఞత, లఖియా అంటే అమితమైన జాలి వున్నాయి. జీవితంలో మీరు ఎవరినైనా నిజంగాప్రేమించివుంటే ఆమె సుశీ మాత్రమే,’’ అంది.
"అమ్మీ నువ్వు చెప్పిందంతా నేను లఖియాకి 'ఐ లవ్ యూ' చెప్పేరవరకు ముమ్మాటికీ నిజం కానీ తరువాత కాదు," అన్నాను యశోచేయి తీసుకుంటూ.
"అర్ధంకాలేదు," అంది ఆశా ఆశ్చర్య మిళిత వదనంతో.
"ఆ మరుక్షణం నిన్నుతలచుకొని మెడతిప్పి చూశాను నీకోసం. రైలు పట్టాల పక్క నువ్వా వంగ పండు రంగు చీరలో నాకోసం పరుగెత్తుకొస్తుంటే, ఒకవైపు లాఖియా "వద్దు రామం బాబూ దిగకండి’’ అని నన్ను అభ్యర్దిస్తున్నా, నా ప్రేమ నీ వైపు పరవళ్లు తీసి నన్నా ట్రైన్ లోంచి దూకించింది. లేక పోతే, దానిలో ఎక్కి, చైన్ లాగడమో లేక పక్కస్టేషన్లో దిగడమో ఎదో చేసివాడిని. ఇప్పు డర్దమైయిందా అమ్మీ ?"
యశో ఆనందభాష్పాలతో నా హృదయం అంతా నిండిపోయింది.
"నీకు నాకూ తెలియని ఈ వాస్తవం నీ మనసు మొదటే గ్రహించి నీ త్యాగానికి చేయూత నిచ్చింది,"
అన్నాను నా ఆనందభాష్పాలు జత చేస్తూ.
‘‘ఇదంతా త్యాగం కాదు, బాదల్ బాబూ, స్వలాభం కోసమే ఇలా చేస్తున్నాను. మీరులేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను,’’ అంది యశో కళ్ళు తుడుచుకుంటూ.
నామీద ఆమెకు వున్న ఈ మమతని ఇంతచక్కగా ఎప్పుడూ ఆమె విప్పిచెప్పలేదు. ఆనాడు ఆమె హృదయం విప్పి నా ముందర పెట్టింది. లోపల ఏముందోనని కుతూహలంగా తొంగిచూశాను. బాదల్ బాబూ అనే ఒక్క మాట రాసివుంది. పొంగిపొర్లే ఆ నిర్మల ప్రేమను చూస్తూంటే హృదయమంతా అనురాగంతో నిండిపోయింది.
‘‘నీకు నేను తిరిగి ఏమీ ఇవ్వలేనా అమ్మీ? ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం నీకు చేతగాదా?’’ అన్నాను.
‘‘ఇవ్వగలిగిందంతా ఇస్తున్నారు. నేను అంతకంటె ఏమీ ఆశించను. ఏమీ కోరుకోను’’ అంది.
సరిగ్గా అదే సమయానికి డాక్టర్ స్వరూప్, సిస్టర్ సుగుణ తలుపుతోసుకుని లోపలికి వచ్చారు.
‘‘ఎలావున్నావు రామంబాబూ?’’ అన్నారు డాక్టర్ స్వరూప్ దగ్గరకు వచ్చి.
‘‘చాలా కులాసాగావుంది డాక్టర్ గారు. అంతా మీదయ,’’ అన్నాను.
‘‘నా దయకాదు మిస్టర్ మీ మంచం మీద కూర్చున్న అవిడది. ఈ పది రోజులూ ఈవిడ మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని వుండకపోతే ఏమయివుండునో చెప్పలేం. ముఖ్యంగా మొదటి నాలుగు రాత్రులూ చాలా కష్టపడ్డారు. విపరీతమైన జ్వరం, వొళ్లు తెలియని ప్రేలాపన గిలగిలా కొట్టుకోవడం ఇవన్నీ చూస్తూంటే మా సిస్టర్స్ కే భయమేసింది. ఇంతనిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు,’’ అన్నారు ఆయన.
“నేను కూడా మీ కోసం కష్టపడ్డాను. డాక్టరు గారి మాటలువిని నన్ను మరచిపోకండి,” అంది సిస్టర్ సుగుణ నా బిపి చూస్తూ.
"ఆయనకు చెల్లి లేని లోటు తీర్చవని ఎప్పుడో చెప్పాను లే," అంది యశో నవ్వుతూ.
"ఇప్పట్నించి నీకు రాఖీ ఖర్చు పెంచింది నా యశో," అన్నాను
"ఊరికే కట్టించు కుందా మనుకుంటున్నారేమో, అదేంకుదరదు," అంది తను నవ్వుతూ.
చాప్టర్ 36
యశో వెళ్లిన కొంతసేపటికి సరళ వచ్చి నా మంచం దగ్గర కుర్చీలో కూర్చుంది. ముఖమంతా వుద్రేక పూరితంగా వుంది. అభిమానంతోటి, నిర్లక్ష్యంతోటి, కోపంతో వణికిపోతూ ఏమైనా సరే ఈ అవకాశం జారవిడవకూడదని నిశ్చయించుకున్నట్లు కనబడింది. పరిణామాలతో నిమిత్తం లేదనే మొండి ధైర్యం ఆమెలో ప్రవేశించినట్లు కనబడింది. అలాంటిఘడియలు ప్రతివారికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి.
‘‘భోజనం చేశావా సరళా?’’ అన్నాను.
‘నా శ్రవణాలకి మీ నిరర్ధక సంభాషణ తప్ప వేరే ప్రాప్తి లేదా రామంబాబూ,’’ అంది నా కళ్లలోకి ఒకసారి చూసింది.
‘అల్లా అనడం నీకు తగదు సరళా, యశోకి, లఖియాకి ఆప్తులు ఇంకెవరూ లేరు. నీకు ప్రేమించాల్సిన భర్త, లాలించాల్సిన కొడుకూ వున్నారు’’ అన్నాను.
ఆ ఆఖరి వాక్యం నోరు జారి అన్నాను. అందులో వ్యంగ్యం లేదనుకుంటాను, అయినా అది సరళ కోపాన్ని ప్రేరేపించింది.
‘‘అవును రామంబాబూ. అదే నేను చేసిన పాపం, ఘోర పాపం. సమాజం స్త్రీకి ఎంత అన్యాయం చేస్తుంది. ఒకసారి నేరక చేసిన తప్పుకి జీవితాంతం వరకూ బాధపడాల్సిందేనా. ఒకసారి వుచ్చులో పడితే అందులోంచి కాళ్లు చేతులూ కాకపోయినా కనీసం తల అయినా బయటపెట్టి తొంగి చూడగూడదా? ఇక దీనికి గత్యంతరం లేదా?’’ అంది ఆవేశంగా.
‘‘నువ్వు చేసింది తప్పుకాదు, సరళా. నాకు తెలిసిన వారందరిలోనూ నువ్వే ఎక్కువగా సుఖపడుతున్నావు. నిన్ను చూస్తుంటే జీవితంలో సుఖం కూడా వుందనే విషయం జ్ఞప్తికి వస్తుంది. లేకపోతే అంతా చీకటిమయంగా కనబడుతుంది,’’ అన్నాను.
“సుఖం,” అంది, క్రుత్రిమంగా నవ్వుతూ.
"సుఖానికి నిర్వచన మేమిటి?" అన్నాను
‘‘పెళ్లి చేసుకుని కొడుకుని కంటె సుఖపడుతూందని మీరంటారు. ఆ విషయం మనస్సులో మీరు నమ్మరు, బయటికి తియ్యటి మాటలని వదలించుకోవాలని ప్రయత్నిస్తారు. సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోరు, మీరందరూ ఇంతే రామంబాబూ, మీ రెప్పుడూ అంతే,’’ అంది.
సరళ ముఖం వుజ్వలంగా వుద్రేకంతో ప్రకాశిస్తుంది. ముఖం ముఖ్యంగా, పెదిమలు ఎర్రగా అయిపోయాయి. క్రింది పెదిమ క్షణకాలం వణికింది.
సంబాషణ మార్చాలనే ఆతురతతో మళ్లీ తప్పుప్రశ్న వేశాను.
‘‘నీ కొడుకుకి రామం బాబు అని పేరు పెట్టావు. నేను
Comments (0)